Renting Vs Buying Home : సొంత ఇళ్లు వద్దంటున్న నేతి తరం.. అద్దె ఇళ్లే ముద్దంటున్న యువత
అద్దె ఇళ్లే ముద్దంటున్న యువత

Renting Vs Buying Home : భారతదేశంలో సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ అతిపెద్ద కలగా, సమాజంలో ఒక గౌరవంగా భావిస్తారు. కానీ మారుతున్న కాలంతో పాటు నేటి తరం యువత ఆలోచనల్లో పెను మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న మిలేనియల్స్, జెన్-జీ ప్రొఫెషనల్స్ ఈ పాత ఆలోచనా ధోరణిని పూర్తిగా మార్చేస్తున్నారు. జీవితాంతం హోమ్ లోన్ల చుట్టూ తిరుగుతూ, భారీ ఈఎంఐలు కడుతూ ఆర్థిక ఇబ్బందులు పడటం కంటే.. హాయిగా అద్దె ఇంట్లో ఉంటూ లైఫ్‌ను ఎంజాయ్ చేయడం బెటర్ అని వారు భావిస్తున్నారు. అప్పుల భారం లేని ఆర్థిక స్వేచ్ఛకే నేటి యువత మొదటి ప్రాధాన్యత ఇస్తోంది.
నోబ్రోకర్ సర్వేలో ఆసక్తికర విషయాలు
ప్రముఖ ప్రాపర్టీ ప్లాట్‌ఫారమ్ నోబ్రోకర్ సేకరించిన తాజా గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం నగరాల్లో ఉంటున్న వారిలో 46 శాతం మంది అద్దె ఇళ్లలోనే సుదీర్ఘకాలం పాటు కొనసాగడానికి మొగ్గు చూపుతున్నారు. ఇందులో 25 నుంచి 34 ఏళ్ల వయసు గల యువత 53 శాతంగా ఉండగా, 35 నుంచి 44 ఏళ్ల వయసు గల వారు 48 శాతంగా ఉన్నారు. వీరంతా రాబోయే రోజుల్లో కూడా కొత్తగా ఇల్లు కొనడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కేవలం అద్దె ఇంట్లో ఉంటూ మిగిలిన డబ్బును ఇతర వ్యాపారాల్లో లేదా పెట్టుబడుల్లో పెట్టడమే ఉత్తమమని వీరు స్పష్టం చేస్తున్నారు.
ఈఎంఐ కంటే అద్దె సగమే
యువత ఇలా అద్దె ఇళ్ల వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం మార్కెట్లో ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకడమే. పెద్ద నగరాల్లో ఒక ఇల్లు కొనడానికి నెలకు కట్టాల్సిన హోమ్ లోన్ ఈఎంఐ, అదే ఇంటి అద్దె కంటే రెండింతలు ఎక్కువగా ఉంటోంది. గత ఐదేళ్లలో గురుగ్రామ్‌లో ఈఎంఐ-టు-రెంట్ రేషియో 1.86 నుంచి ఏకంగా 2.68 కి పెరిగింది. ఇదే పరిస్థితి బెంగళూరు (2.38), హైదరాబాద్ (2.47), ముంబై (2.19) వంటి ఐటీ హబ్‌లలోనూ కనిపిస్తోంది. అంటే సరళంగా చెప్పాలంటే.. ఏ ఇంట్లోనైనా ఉండటానికి అద్దె నెలకు రూ. 50,000 ఉంటే, అదే ఇల్లు కొనడానికి కట్టాల్సిన ఈఎంఐ నెలకు లక్ష రూపాయల కంటే ఎక్కువగా ఉంటోంది. అందుకే డౌన్ పేమెంట్లు, భారీ ఈఎంఐలలో డబ్బులు ఇరికించడం కంటే, అద్దె ఇంట్లో ఉంటూ మిగిలిన డబ్బును మ్యూచువల్ ఫండ్స్ లేదా షేర్ మార్కెట్‌లో పెట్టుబడిగా పెట్టడానికి యువత ఇష్టపడుతోంది.
లైఫ్‌స్టైల్‌తో నో కాంప్రమైజ్
ఈ రోజుల్లో అద్దె ఇంట్లో నివసించడం అనేది ఒక నిస్సహాయత కాదు, అదొక ప్లాన్డ్ నిర్ణయంగా మారింది. తాము ఇల్లు కొనలేక కాదు, తమ జీవన ప్రమాణాలను మరింత ఉన్నతంగా మార్చుకోవడానికి యువత ఈ నిర్ణయం తీసుకుంటోంది. నేడు యువత సాధారణ ఇళ్లకు బదులుగా పెద్ద ఇళ్లు, గేటెడ్ కమ్యూనిటీలు, పూర్తిగా ఫర్నిష్డ్ చేసిన విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లలో ఉండటానికి ఇష్టపడుతున్నారు. బెంగళూరు వంటి నగరాల్లో అద్దెలు ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ 3-BHK ఫ్లాట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. అలాగే ముంబై మెట్రోపాలిటన్ రీజన్లో మొత్తం అద్దె ఇళ్ల డిమాండ్‌లో మూడో వంతు డిమాండ్ నెలకు రూ. 40,000 కంటే ఎక్కువ అద్దె ఉన్న లగ్జరీ ఇళ్లకే ఉండటం విశేషం.
కెరీర్ మార్పులు, హైబ్రిడ్ వర్క్ కల్చర్
యువత కెరీర్ గ్రాఫ్ వేగంగా మారడం కూడా ఇందుకు ఒక ముఖ్య కారణం. ఐటీ రంగంలో ఉద్యోగాలు త్వరత్వరగా మారడం, వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా హైబ్రిడ్ వర్క్ కల్చర్ పెరగడం, నగరాల్లో స్థిరాస్తి ధరలు విపరీతంగా పెరిగిపోవడం వంటి అంశాల వల్ల యువత ఇల్లు కొనే ఆలోచనను వాయిదా వేస్తోంది. తాము భవిష్యత్తులో ఏ నగరంలో స్థిరపడతామో క్లారిటీ వచ్చే వరకు ఎలాంటి శాశ్వత ఆస్తులను కొనకూడదని భావిస్తున్నారు. ఈ సరికొత్త ట్రెండ్ వల్ల నగరాల్లో రెంట్ మార్కెట్ చాలా బలంగా మారుతోంది. గత ఏడాది కాలంలో ముంబై రీజన్ లో ఇళ్ల అద్దెలు అత్యధికంగా 11 శాతం పెరిగాయి. ఆ తర్వాత చెన్నైలో 8 శాతం, బెంగళూరులో 7 శాతం అద్దెలు పెరగ్గా.. హైదరాబాద్, ఢిల్లీ-NCR ప్రాంతాలలో 3 శాతం చొప్పున ఇళ్ల అద్దెలు పెరిగాయి.

