GenZ Success : ఒక్క జాబ్‌తో మా వల్ల కాదు బాబోయ్.. జెన్ జీ కుర్రాళ్ల సంపాదన చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
జెన్ జీ కుర్రాళ్ల సంపాదన చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

GenZ Success : నేటి తరం ఆలోచనలు మునుపటి కంటే చాలా భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా 1997 నుంచి 2012 మధ్య పుట్టిన జెన్ జీ యువత సంపాదన విషయంలో కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. కేవలం ఒకే ఉద్యోగం లేదా ఒకే వ్యాపారంపై ఆధారపడితే ఆర్థికంగా రిస్క్ ఉంటుందని భావిస్తున్న వీరు, ఆదాయం కోసం ఒకటి కంటే ఎక్కువ వనరులను వెతుక్కుంటున్నారు. లింక్డ్‌ఇన్ తాజాగా విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం.. దాదాపు ముగ్గురిలో ఇద్దరు యువత వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు.
ఏమిటీ పోర్ట్‌ఫోలియో కెరీర్ ?
గతంలో మన పెద్దలు ఒకే కంపెనీలో దశాబ్దాల పాటు పని చేసేవారు. కానీ ఇప్పుడు పోర్ట్‌ఫోలియో కెరీర్ అనే కాన్సెప్ట్ ఫేమస్ అవుతోంది. అంటే ఒక వ్యక్తి తన ప్రధాన వృత్తితో పాటు ఫ్రీలాన్సింగ్, కంటెంట్ క్రియేషన్, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు వంటి వాటిని సమాంతరంగా నడపడం. దీనివల్ల ఏదైనా ఒక రంగం దెబ్బతిన్నా, ఇతర ఆదాయ మార్గాల ద్వారా ఆర్థిక భద్రత లభిస్తుంది. జెన్ ఎక్స్ తరంలో ఈ ధోరణి 62 శాతం ఉండగా, జెన్ జీలో ఇది ఏకంగా 75 శాతానికి పైగా ఉంది.
భారత్‌లో ఫౌండర్ల జోరు.. 104 శాతం వృద్ధి
ప్రపంచవ్యాప్తంగా వ్యాపార ధోరణులు ఎలా మారుతున్నాయో చెప్పడానికి భారత్ ఒక ప్రధాన కేంద్రంగా మారింది. లింక్డ్‌ఇన్ గణాంకాల ప్రకారం.. తమ ప్రొఫైల్‌లో ఫౌండర్ అని జోడించుకుంటున్న వారి సంఖ్య మన దేశంలో ఏకంగా 104 శాతం పెరిగింది. ఇది ఇతర దేశాల కంటే చాలా ఎక్కువ. చిన్నా చితకా వ్యాపారాలు మొదలుపెట్టి, వాటిని సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తూ యువత అద్భుతమైన వృద్ధిని సాధిస్తోంది.
AI తో తగ్గిన అడ్డంకులు.. పెరిగిన అవకాశాలు
ఈ మార్పుకు ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. గతంలో ఒక స్టార్టప్ మొదలుపెట్టాలంటే ఎంతో మంది సిబ్బంది, భారీ పెట్టుబడి అవసరమయ్యేవి. కానీ ఇప్పుడు ఏఐ టూల్స్ సహాయంతో ఒక్కరే పది మంది చేసే పనిని సులభంగా చేస్తున్నారు. దీనివల్ల రిస్క్ తీసుకోవడం సులభమైంది. ఏప్రిల్ 2026లో దేశవ్యాప్తంగా ఉన్న 500 మంది చిన్న వ్యాపారవేత్తలు, సోలోప్రెన్యూర్ల పై జరిపిన సర్వేలో ఈ ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
ఆర్థిక భద్రతే మెయిన్ టార్గెట్
వ్యాపారంలో ఎదురుదెబ్బలు తగిలినా కుంగిపోకుండా ఉండేందుకు, తమ లైఫ్ స్టైల్‌పై పూర్తి నియంత్రణ సాధించేందుకు జెన్ జీ యువత ఈ మార్గాన్ని ఎంచుకుంటోంది. వీరికి సక్సెస్ అంటే కేవలం భారీ జీతం మాత్రమే కాదు, పనిలో స్వేచ్ఛ, స్థిరమైన భవిష్యత్తు. అందుకే వీరు స్టార్టప్ రన్ చేస్తూనే యూట్యూబ్ ఛానెల్ నడపడం లేదా డిజిటల్ మార్కెటింగ్ సేవలు అందించడం వంటివి చేస్తూ స్మార్ట్ ఇన్వెస్టర్లుగా మారుతున్నారు.

