Home Loan: జీవితంలో హోమ్ లోన్ పూర్తి చేయడం అనేది ప్రతి ఒక్కరికీ ఎంతో ఊరటనిచ్చే విషయం. ఎన్నో ఏళ్ల పాటు కష్టపడి చివరి ఈఎంఐ కట్టేసిన తర్వాత అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు. కానీ అసలు సమస్య ఆ తర్వాతే మొదలవుతుంది. లోన్ మొత్తం చెల్లించినప్పటికీ, బ్యాంకులు కస్టమర్ల ప్రాపర్టీ ఒరిజినల్ డాక్యుమెంట్లను సకాలంలో తిరిగి ఇవ్వకుండా నెలల తరబడి తిప్పుకుంటూ ఉంటాయి. కస్టమర్లు తమ స్వంత ఆస్తి పత్రాల కోసం బ్యాంకు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తుంది. కస్టమర్ల ఈ ఇబ్బందులను పూర్తిగా తొలగించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ అత్యంత కఠినమైన, విప్లవాత్మకమైన కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది.

30 రోజుల్లోగా పత్రాలు ఇవ్వాలన్న ఆర్బీఐ నిబంధన

ఆర్బీఐ తాజా మార్గదర్శకాల ప్రకారం.. ఎవరైనా కస్టమర్ తమ హోమ్ లోన్ మొత్తాన్ని పూర్తిగా చెల్లించి క్లోజ్ చేసిన వెంటనే బ్యాంకులు తమ బాధ్యతలను నిర్వర్తించాలి. లోన్ పూర్తిగా తీర్చిన నాటి నుంచి సరిగ్గా 30 రోజుల్లోపు బ్యాంకులు ఆ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని అసలు పత్రాలను కస్టమర్లకు తిరిగి అప్పగించాలి. అంతేకాకుండా ఆ ఆస్తిపై బ్యాంకు తరఫున రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదైన చార్జ్ లేదా తనఖాను కూడా అదే సమయంలో తొలగించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు అన్ని రకాల కమర్షియల్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ సంస్థలకు కచ్చితంగా వర్తిస్తాయి.

నిబంధనలు ఉల్లంఘిస్తే రోజుకు రూ.5000 ఫైన్

ఒకవేళ బ్యాంకులు నిర్దేశిత 30 రోజుల గడువులోగా ఒరిజినల్ డాక్యుమెంట్లను ఇవ్వడంలో విఫలమైతే, ఆ బ్యాంకులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. గడువు ముగిసిన తర్వాత ప్రతి ఒక్క రోజు ఆలస్యానికి బ్యాంకులు కస్టమర్‌కు రూ.5,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఉదాహరణకు బ్యాంకు మీ పత్రాలు ఇవ్వడంలో 10 రోజులు ఆలస్యం చేస్తే, ఆ బ్యాంక్ నేరుగా మీ ఖాతాలోకి రూ.50,000 జరిమానా కింద జమ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆలస్యం కావడానికి అసలు కారణం ఏమిటో కూడా బ్యాంక్ వారు కస్టమర్‌కు రాతపూర్వకంగా తెలియజేయాలి.

ఒకవేళ బ్యాంకు పత్రాలు పోగొడితే ఏం చేయాలి

కొన్ని సందర్భాలలో బ్యాంకుల నిర్లక్ష్యం వల్ల కస్టమర్ల విలువైన ఆస్తి పత్రాలు పోగొట్టుకోవడం లేదా పాడవవడం జరుగుతుంటుంది. ఒకవేళ బ్యాంకు కస్టడీలో డాక్యుమెంట్లు పోతే, ఆ పూర్తి బాధ్యత ఆయా బ్యాంకులదే అవుతుంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో డూప్లికేట్ లేదా సర్టిఫైడ్ కాపీలను స్వయంగా బ్యాంకు వారే ప్రభుత్వ కార్యాలయాల నుంచి తెప్పించి ఇవ్వాలి. ఈ ప్రక్రియ కోసం బ్యాంక్‌కు అదనంగా మరో 30 రోజుల సమయం లభిస్తుంది. అంటే మొత్తం 60 రోజుల్లోగా పత్రాలు ఇవ్వాలి. ఒకవేళ 60 రోజులు దాటినా పత్రాలు అందించకపోతే, అప్పటి నుంచి మళ్లీ రోజుకు రూ.5,000 పెనాల్టీ వర్తిస్తుంది. బ్యాంక్ స్పందించకపోతే కస్టమర్లు నేరుగా ఆర్బీఐ అంబ్‌డ్స్‌మన్ (బ్యాంకింగ్ లోక్‌పాల్)కు ఫిర్యాదు చేసి న్యాయం పొందవచ్చు.

Next Story