వారు తిరిగితేనే ఇల్లు గడుస్తుంది..గిగ్ వర్కర్ల గోడు వింటే కన్నీళ్లు ఆగవు

Gig Workers : నేడు స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ఒక్క క్లిక్‌తో ఆహారం ఇంటికి వస్తోంది, మరో క్లిక్‌తో క్యాబ్ గుమ్మం ముందుకు వస్తోంది. మన జీవితాలను ఇంత సులభతరం చేస్తున్న ఈ వ్యవస్థ వెనుక ఉన్నది గిగ్ వర్కర్లు. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబెర్ వంటి సంస్థల్లో పనిచేసే ఈ డెలివరీ బాయ్స్, డ్రైవర్ల జీవితాలు పైన కనిపించేంత రంగులమయంగా లేవు. అందుకే ఇప్పుడు వారు తమ హక్కుల కోసం సమ్మె బాట పట్టారు. డిసెంబర్ 25న నిరసన తెలిపిన వీరు, డిసెంబర్ 31న కూడా పని నిలిపివేసేందుకు సిద్ధమవుతున్నారు. అసలు వీరు ఎంత సంపాదిస్తున్నారు? వీరిని వేధిస్తున్న సమస్యలేంటి? అన్నది తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.

అసలు ఎవరీ గిగ్ వర్కర్లు?

సాధారణంగా ఏదైనా కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు నెల నెలా జీతం, సెలవులు, ఇన్సూరెన్స్ వంటివి ఉంటాయి. కానీ గిగ్ వర్కర్లు అలా కాదు. వీరు స్వతంత్రంగా పనిచేసే కాంట్రాక్టర్లు. వీరికి ఫిక్స్‌డ్ జీతం ఉండదు. ఎన్ని ఆర్డర్లు చేస్తే అంత డబ్బు వస్తుంది. ఎప్పుడు పని చేయాలి, ఎక్కడ చేయాలి అన్నది వీరి ఇష్టమని కంపెనీలు చెబుతున్నప్పటికీ.. ఆచరణలో మాత్రం వీరు కంపెనీల నిబంధనలకు బందీలుగా మారుతున్నారు.

సంపాదన తక్కువ.. కష్టం ఎక్కువ

సర్వేల ప్రకారం, దేశంలోని 43% గిగ్ వర్కర్ల దైనందిన సంపాదన అన్ని ఖర్చులు పోను రూ. 500 కంటే తక్కువే. అంటే నెలకు వీరికి రూ. 15,000 కూడా మిగలడం లేదు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే.. 34% మంది డెలివరీ బాయ్స్ నెలకు రూ. 10,000 కూడా సంపాదించలేకపోతున్నారు. మరోవైపు పని గంటలు చూస్తే గుండె తరుక్కుపోతుంది. సుమారు 83% మంది డ్రైవర్లు రోజుకు 10 గంటల కంటే ఎక్కువ పనిచేస్తుండగా, మూడో వంతు మంది ఏకంగా 14 గంటల పాటు రోడ్ల మీదనే గడుపుతున్నారు. సామాజికంగా వెనుకబడిన వర్గాల వారు మరింత ఎక్కువ సమయం పని చేయాల్సి వస్తోంది.

కంపెనీల కమిషన్ల మాయాజాలం

కంపెనీలు అధికారికంగా 20% కమిషన్ అని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో డ్రైవర్ల సంపాదనలో 31% నుండి 40% వరకు కోత విధిస్తున్నాయని 80% మంది డ్రైవర్లు వాపోతున్నారు. పెరిగిన పెట్రోల్ ధరలు, బైక్ రిపేర్లు, మొబైల్ ఖర్చులు అన్నీ తీసేస్తే వచ్చే ఆదాయం వారి ఇంటి ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. దీంతో 68% మంది డ్రైవర్లు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

ప్రాణాలకు గ్యారెంటీ లేని 10 మినిట్స్ పాలసీ

కొన్ని సంస్థలు ప్రవేశపెట్టిన 10 నిమిషాల డెలివరీ పాలసీ గిగ్ వర్కర్ల పాలిట శాపంగా మారింది. వేగంగా డెలివరీ చేయాలనే ఒత్తిడిలో వారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, అతివేగంగా వెళ్లడం వల్ల రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. దీనికి తోడు కస్టమర్ల అసభ్య ప్రవర్తన, చిన్న పొరపాటు జరిగినా కంపెనీలు వారి ఐడీలను బ్లాక్ చేయడం వంటివి వీరిని మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాయి. అందుకే వీరు ఇప్పుడు ఉద్యోగ భద్రత, సామాజిక రక్షణ, మెరుగైన వేతనాల కోసం గొంతు ఎత్తుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story