AI Race : ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది.. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ సరికొత్త టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తుండటంతో గ్లోబల్ ఇన్వెస్టర్లంతా ఎఐ వైపే పరుగులు పెడుతున్నారు. అయితే ఈ ఎఐ విప్లవాన్ని అందిపుచ్చుకోవడంలో భారత్, చైనా, హాంగ్‌కాంగ్ దేశాలు కాస్త వెనుకబడ్డాయి. అమెరికన్ టెక్ కంపెనీలు ఎఐ బూమ్‌తో రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తుంటే.. ఆసియాలోని అగ్రదేశాలైన భారత్, చైనాలలోని అతిపెద్ద కంపెనీలు మాత్రం గ్లోబల్ మార్కెట్ క్యాప్‌లో తమ పట్టును కోల్పోతున్నాయి. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఈ రేసులో సరైన ఎఐ దిగ్గజ కంపెనీలు లేకపోవడం వల్ల ఆసియా మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

కరిగిపోతున్న అగ్ర కంపెనీల మార్కెట్ షేర్

బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం.. భారత్, చైనా దేశాలలోని టాప్ 10 అత్యంత ప్రతిష్టాత్మక కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా ఇప్పుడు కేవలం 19 శాతానికి పడిపోయింది. సరిగ్గా ఏడాది క్రితం చూస్తే చైనా కంపెనీల వాటా 26 శాతంగా, భారత కంపెనీల వాటా 22 శాతంగా ఉండేది. అలాగే హాంగ్‌కాంగ్ మార్కెట్‌లో కూడా పెద్ద కంపెనీల కేంద్రీకరణ 10 శాతం నుంచి 9.8 శాతానికి తగ్గింది. ఏఐ రంగంలో బలమైన ముద్ర వేయలేకపోవడం వల్లే ఈ దేశాల బెంచ్‌మార్క్ సూచీలు అంతర్జాతీయంగా వెనుకబడుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

చిప్స్, మెమొరీ పవర్‌తో దూసుకుపోతున్న తైవాన్, దక్షిణ కొరియా మార్కెట్లు

భారత్, చైనా వెనుకబడితే.. మరోవైపు తైవాన్, దక్షిణ కొరియా దేశాలు ఎఐ సప్లై చైన్‌ను శాసిస్తూ మార్కెట్‌లో అద్భుతాలు సృష్టిస్తున్నాయి. చిప్స్ తయారీలో ప్రపంచంలోనే నంబర్ వన్ అయిన తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (TSMC) అండతో తైవాన్ బెంచ్‌మార్క్ ఇండెక్స్ ఈ ఏడాది ఏకంగా 54 శాతం వృద్ధి చెందింది. ఇక దక్షిణ కొరియా విషయానికి వస్తే, ఏఐ టెక్నాలజీకి అత్యంత కీలకమైన హై-బ్యాండ్‌విడ్త్ మెమొరీని తయారు చేసే ఎస్‌కే హైనిక్స్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ పుణ్యమా అని అక్కడి కోస్పి ఇండెక్స్ ఏకంగా రెట్టింపు అయింది. కొరియా మార్కెట్‌లో టాప్ 10 కంపెనీల వాటా గతేడాది కంటే డబుల్ అయి 65 శాతానికి చేరగా, తైవాన్‌లో ఈ వాటా 49 శాతం నుండి 56 శాతానికి పెరిగింది.

భారత మార్కెట్ పరిస్థితి ఏంటి?

భారతదేశానికి చెందిన నిఫ్టీ 50 ఇండెక్స్ ఈ ఏడాది దాదాపు 8 శాతం మేర నష్టాల్లో నడుస్తోంది. దీనికి ప్రధాన కారణం మన మార్కెట్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వంటి సాంప్రదాయ పాత తరం కంపెనీలే నడిపిస్తుండటం. ఐటీ రంగంలో మనకు దిగ్గజాలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు కేవలం సాఫ్ట్‌వేర్ సర్వీసెస్‌పైనే ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఈ సర్వీసెస్ రంగానికి సరికొత్త ఎఐ టెక్నాలజీ వల్ల పెద్ద ముప్పు పొంచి ఉందని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. నెక్స్ట్ జనరేషన్ ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో మన కంపెనీలు ఇంకా కొత్త గ్రోత్ ఇంజిన్‌ను సృష్టించలేకపోతున్నాయని సాక్సో మార్కెట్స్ వ్యూహకర్త చారు చనానా పేర్కొన్నారు.

భారత మార్కెట్‌కు ప్లస్ పాయింట్ అదే

ఎఐ రేసులో వెనుకబడినప్పటికీ, భారత మార్కెట్‌కు ఒక పెద్ద సానుకూల అంశం ఉంది. మన ఇండెక్స్ కేవలం ఒకే రంగంపై కాకుండా ఐటీ, బ్యాంకింగ్, ఎనర్జీ, ఫార్మా వంటి పలు రంగాలపై (డైవర్సిఫైడ్) ఆధారపడి ఉంది. పీఎల్ క్యాపిటల్ ఫండ్ మేనేజర్ సిద్ధార్థ్ వోరా ప్రకారం, భవిష్యత్తులో అంతర్జాతీయంగా ఎఐపై పెడుతున్న ఖర్చులు అవసరానికి మించి ఎక్కువయ్యాయని ఇన్వెస్టర్లు భావిస్తే, వారు వేరే వైవిధ్యమైన మార్కెట్ల వైపు చూస్తారు. అప్పుడు భారత్ వంటి దేశాలకు లాభం చేకూరుతుంది. గ్లోబల్ మార్కెట్లలో భారీ పతనం వస్తే భారత్ కూడా ప్రభావితం అవుతుంది కానీ, మన దేశీయ లిక్విడిటీ, కంపెనీల విస్తృత ఆదాయ వనరులు మన మార్కెట్‌కు రక్షణ కవచంలా నిలుస్తాయి.

చైనా కొత్త ప్లాన్

చైనాలో పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. అక్కడి ప్రభుత్వ అధికారులు, ఇంటర్నెట్ దిగ్గజాలు ఎఐ పరిశోధనలపై పెట్టుబడులు పెంచుతామని హామీ ఇస్తున్నారు. చైనాలోని పాత ఇంటర్నెట్ కంపెనీల కంటే ఎఐ టెక్నాలజీతో నేరుగా సంబంధం ఉన్న కేంబ్రికాన్ టెక్నాలజీస్, సెమీకండక్టర్ ఫౌండ్రీ SMIC వంటి కంపెనీల షేర్లు ఈ ఏడాది అద్భుతమైన ప్రదర్శన చేశాయి. ఇన్వెస్టర్లు కూడా బ్యాంకులు, ఇన్సూరెన్స్, ఎఐ హార్డ్‌వేర్ కంపెనీల వైపు తమ నిధులను మళ్లిస్తున్నారు. ఈ విస్తృత భాగస్వామ్యం వల్లే చైనా CSI 300 ఇండెక్స్ ఈ ఏడాది దాదాపు 5 శాతం లాభపడిందని ఐజీ ఇంటర్నేషనల్ అనలిస్ట్ ఫాబియన్ యిప్ తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story