Crude Oil : యుద్ధం ముదిరితే చమురు కష్టాలే.. గల్ఫ్ దేశాల నుంచి నిలిచిపోనున్న ఇంధన సరఫరా
గల్ఫ్ దేశాల నుంచి నిలిచిపోనున్న ఇంధన సరఫరా

Crude Oil : మధ్యప్రాచ్యంలో రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారుతున్నాయి. ఈ ఉద్రిక్తతలు ఇలాగే మరో కొన్ని వారాల పాటు కొనసాగితే, దాని ప్రభావం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాదని, ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఖతార్ ఇంధన శాఖ మంత్రి సాద్ అల్-కాబీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి. యుద్ధం గనుక ముదిరితే గల్ఫ్ దేశాల నుండి చమురు, గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆయన బాంబు పేల్చారు.
ఖతార్ మంత్రి హెచ్చరికల ప్రకారం.. ఒకవేళ పరిస్థితులు చేయి దాటితే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 150 డాలర్ల రికార్డు స్థాయికి చేరుకోవచ్చు. గల్ఫ్ దేశాలు ఫోర్స్ మెజ్యూర్ వంటి అసాధారణ స్థితిని ప్రకటించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అంటే, అనివార్య కారణాల వల్ల కంపెనీలు తమ సరఫరా ఒప్పందాలను తాత్కాలికంగా రద్దు చేసుకుంటాయి. అదే గనుక జరిగితే ప్రపంచ దేశాల ఆర్థిక వేగం మందగించడమే కాకుండా, పెట్రోల్, డీజిల్ కోసం యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యుద్ధం మొదలైనప్పటి నుండి అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో అస్థిరత నెలకొంది. బ్రెంట్ క్రూడ్ ఇప్పటికే 80 డాలర్ల మార్కును దాటేసింది. కేవలం రెండు రోజుల్లోనే ధర 9 శాతం పెరిగి, ఒక దశలో 85 డాలర్లను కూడా తాకింది. చమురు రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధి మూతపడటమే దీనికి ప్రధాన కారణం. కేవలం చమురు మాత్రమే కాకుండా, గ్యాస్ ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. దీనివల్ల విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు పెరిగి, సామాన్యుడిపై భారంగా మారనున్నాయి.
చమురు ధరలు పెరిగితే దాని ప్రభావం నేరుగా నిత్యావసర వస్తువుల మీద పడుతుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల కూరగాయల నుండి పప్పు దినుసుల వరకు ప్రతిదీ ప్రియం అవుతుంది. కేవలం భారతదేశమే కాదు, ఐరోపా దేశాల్లో కూడా ద్రవ్యోల్బణం 2 శాతం నుంచి అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉందని సీఎన్ఎన్ నివేదిక పేర్కొంది. జర్మనీ వంటి దేశాల్లో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి, దీనివల్ల చిన్న వ్యాపారాలు మూతపడే పరిస్థితి నెలకొంది. వ్యవసాయం, ఉత్పత్తి రంగాలపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా ఉండనుంది.
ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం?
యుద్ధం ఇలాగే నెలల తరబడి కొనసాగితే ప్రపంచం మరోసారి ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వృద్ధి రేటు అర శాతం మేర తగ్గే అవకాశం ఉంది. పెరిగిన ధరలు సామాన్యుడి జేబును ఖాళీ చేస్తుంటే, దేశాల ఖజానాపై భారం పెరుగుతోంది. మన దేశం వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది గడ్డు కాలమనే చెప్పాలి. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, అంతర్జాతీయంగా ధరలు పెరిగితే ఆ సెగ తగలకుండా ఉండటం అసాధ్యం.

