డిజిటల్ ప్రపంచంలో మోదీ సరికొత్త చరిత్ర

PM Modi : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా సామ్రాజ్యంలో రారాజుగా వెలుగొందుతున్నారు. తాజాగా ఆయన ఖాతాలో మరో అరుదైన ప్రపంచ రికార్డు వచ్చి చేరింది. వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‎లో 30 మిలియన్ల (3 కోట్లు) సబ్‌స్క్రైబర్‌ల మైలురాయిని దాటిన ప్రపంచపు తొలి రాజకీయ నాయకుడిగా మోదీ చరిత్ర సృష్టించారు. మంగళవారం నాటికి అందిన గణాంకాల ప్రకారం.. ప్రపంచంలోని ఏ ఇతర అగ్రనేత కూడా మోదీ దరిదాపుల్లో కూడా లేరు.

మోదీ యూట్యూబ్ ఛానల్ ఎంత వేగంగా దూసుకుపోతుందంటే.. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య, మోదీ సబ్‌స్క్రైబర్‌లలో కేవలం నాలుగో వంతు మాత్రమే. ఇక అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోలిస్తే, మోదీకి ఏడు రెట్లు ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. కేవలం యూట్యూబ్ మాత్రమే కాదు, కొద్ది రోజుల క్రితమే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా 100 మిలియన్ల (10 కోట్లు) ఫాలోవర్లను సంపాదించుకున్న ఏకైక ప్రపంచ నాయకుడిగా మోదీ నిలిచారు. డిజిటల్ ప్రపంచంలో మోదీకి ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఈ అంకెలే చెబుతున్నాయి.

2014లో ఇన్‌స్టాగ్రామ్‌లోకి ప్రవేశించిన ప్రధాని మోదీ, నేడు ప్రపంచంలోని మొదటి ఐదుగురు అగ్రనేతల ఫాలోవర్ల మొత్తాన్ని కలిపినా ఆయన ఒక్కరి ఫాలోయింగ్‌కు సరిపోరు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్‌కు 43.2 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో (15 మిలియన్లు), బ్రెజిల్ అధ్యక్షుడు లూలా (14.4 మిలియన్లు), టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ (11.6 మిలియన్లు), అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మైలీ (6.4 మిలియన్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

భారతీయ రాజకీయ నేతల విషయానికి వస్తే, మోదీ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన నేతగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (16.1 మిలియన్లు) నిలిచారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 12.6 మిలియన్ల ఫాలోవర్లతో మూడో స్థానంలో ఉన్నారు. ప్రజలతో నేరుగా మమేకం కావడానికి మోదీ సోషల్ మీడియాను ఒక శక్తివంతమైన ఆయుధంగా మలుచుకున్నారు. ఆయన ప్రసంగాలు, పర్యటనలు, సామాన్యులతో జరిపే ముఖాముఖి వీడియోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుంటాయి. ఈ రికార్డులన్నీ అంతర్జాతీయ స్థాయిలో మోదీ ఇమేజ్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్లాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story