Oil Crisis : ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల గుండెల్లో మళ్ళీ గుబులు మొదలైంది. అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో ముడి చమురు ధరలు మంట పుట్టిస్తున్నాయి. గత రెండేళ్లలో ఎన్నడూ లేని విధంగా ముడి చమురు ధర రికార్డు స్థాయికి చేరుకుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో చూసిన ధరలు ఇప్పుడు మళ్ళీ కనిపిస్తున్నాయి. బ్యారెల్ ధర ఏకంగా 120 డాలర్ల మార్కును దాటేయడంతో, దీని ప్రభావం నేరుగా పెట్రోల్, డీజిల్ ధరలపై పడే అవకాశం ఉంది.

ముడి చమురు ధరలు అకస్మాత్తుగా పెరగడానికి అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలే ప్రధాన కారణం. ఇరాన్ నుంచి చమురు ఎగుమతులపై అమెరికా కఠిన ఆంక్షలు విధించడంతో సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీనికి తోడు ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మార్గంలో ప్రతిష్టంభన ఏర్పడటం మార్కెట్‌ను మరింత అస్థిరపరిచింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో దాదాపు 20 శాతం ఈ మార్గం నుంచే వెళ్తుంది. ఇక్కడ చిన్న ఆటంకం కలిగినా ప్రపంచ దేశాలన్నీ ఇబ్బందుల్లో పడతాయి.

ఏప్రిల్ 30 నాటి గణాంకాల ప్రకారం.. జూన్ డెలివరీ కోసం బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 1.96 శాతం పెరిగి 120 డాలర్లకు చేరుకుంది. ఇక అమెరికాకు చెందిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ కూడా 107 డాలర్ల పైన కొనసాగుతోంది. బుధవారం ఒక్క రోజే బ్రెంట్ క్రూడ్ 6 శాతం, డబ్ల్యూటీఐ 7 శాతం పెరగడం చూస్తుంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2022 తర్వాత ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి.

చమురు ఉత్పత్తిని పెంచడం ద్వారా ధరలను అదుపులోకి తీసుకురావాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఓపెక్ కూటమి నుంచి విడిగా వెళ్లి ఉత్పత్తిని పెంచాలని యూఏఈ భావిస్తున్నప్పటికీ, దీని ప్రభావం మార్కెట్‌పై వెంటనే పడే అవకాశం లేదు. సరఫరా, డిమాండ్ మధ్య సమతుల్యత దెబ్బతినడంతో ధరలు అదుపుతప్పుతున్నాయి. ఇరాన్ న్యూక్లియర్ డీల్‌పై క్లారిటీ రాకపోవడం కూడా ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది.

ప్రపంచ ఆర్థిక విశ్లేషకులు ఇస్తున్న హెచ్చరికలు భయపెడుతున్నాయి. ఒకవేళ అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు విఫలమై, హోర్ముజ్ జలసంధి మూతపడితే ముడి చమురు ధరలు ఏకంగా 150 డాలర్లకు చేరుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజూ ఈ మార్గం ద్వారా దాదాపు 2 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. ఈ సరఫరా నిలిచిపోతే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ విపరీతంగా పెరిగిపోయి, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడం ఖాయం. భారత దేశం తన చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుంది కాబట్టి, మన దేశంపై దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉండవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story