Crude Oil : వణికిస్తున్న చమురు బాంబు.. 94 డాలర్లకు ముడి చమురు, సామాన్యుడిపై ధరల పిడుగు
94 డాలర్లకు ముడి చమురు, సామాన్యుడిపై ధరల పిడుగు

Crude Oil : మధ్యప్రాచ్యంలో రోజురోజుకూ ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత ఆర్థిక వ్యవస్థపై పిడుగులా పడేలా ఉన్నాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, దానికి ప్రతిగా ఇరాన్ హెచ్చరికలతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మండిపోతున్నాయి. మొన్నటి వరకు బ్యారెల్‌కు 73 డాలర్లు ఉన్న బ్రెంట్ క్రూడ్, ఒక్కసారిగా 94 డాలర్లకు చేరింది. ఈ పెరుగుదల ఇలాగే కొనసాగితే రాబోయే 2027 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయికి చేరి, సామాన్యుడి జేబుకు భారీగా చిల్లు పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సామాన్యుడి బడ్జెట్ అస్తవ్యస్తం
ముడి చమురు ధరలు పెరిగితే దాని ప్రభావం నేరుగా మన నిత్యావసర వస్తువుల మీద పడుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అంచనా ప్రకారం.. చమురు ధర బ్యారెల్‌కు 75 డాలర్లకు చేరితే ద్రవ్యోల్బణం 0.20 శాతం పెరుగుతుంది. ఒకవేళ యుద్ధం ముదిరి ధరలు ఇంకా పెరిగితే ఈ ప్రభావం 0.50 శాతం కంటే ఎక్కువగా ఉండవచ్చు. గతంలో కంటే ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలకు మన మార్కెట్ మరింత సున్నితంగా మారింది. కొత్త సీపీఐ సిరీస్ ప్రకారం.. ద్రవ్యోల్బణ లెక్కల్లో ఇంధన వాటా 2.3 శాతం నుంచి 4.8 శాతానికి పెరిగింది. అంటే చమురు ధరల్లో వచ్చే చిన్న మార్పు కూడా వస్తువుల ధరలను భారీగా పెంచేస్తుంది.
దిగుమతులపై ఆధారపడటమే శాపమా?
భారతదేశం తన చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. అందులో సగానికి పైగా ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి మిడిల్ ఈస్ట్ దేశాల నుంచే వస్తుంది. దురదృష్టవశాత్తూ ఈ చమురు రవాణా అయ్యే హోర్ముజ్ జలసంధి ఇప్పుడు యుద్ధ ప్రాబల్య ప్రాంతంలో ఉంది. అక్కడ రవాణా ఆగితే మన దేశానికి చమురు సరఫరా నిలిచిపోతుంది. దీనివల్ల మన దేశ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే విదేశీ మారక ద్రవ్య లోటు భారీగా పెరుగుతుంది. ఇది దేశ ఆర్థిక పురోగతిని దెబ్బతీసే ప్రమాదం ఉందని డీబీఎస్ బ్యాంక్ నిపుణులు చెబుతున్నారు.
జీడీపీపై యుద్ధ ప్రభావం
చమురు ధరలు పెరగడం కేవలం ధరల పెంపుకే పరిమితం కాదు, దేశ మొత్తం వృద్ధిని కూడా దెబ్బతీస్తుంది. రిజర్వ్ బ్యాంక్ విశ్లేషణ ప్రకారం.. చమురు ధరలు 10 శాతం పెరిగితే, మన జీడీపీ వృద్ధి రేటు 0.15 శాతం పడిపోతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చమురు ధరలు 90 డాలర్లు దాటితే ప్రభుత్వం రంగంలోకి దిగి పెట్రోల్ ధరలను నియంత్రించాల్సి ఉంటుంది. ఒకవేళ అలా చేయకపోతే రవాణా ఖర్చులు పెరిగి ప్రతి వస్తువు సామాన్యుడికి అందనంత దూరంలోకి వెళ్ళిపోతుంది.
పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయా?
ప్రస్తుతానికి వినియోగదారులను ధరల భారం నుండి కాపాడేందుకు ప్రభుత్వం రిటైల్ ధరలను స్థిరంగా ఉంచే అవకాశం ఉందని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ నిపుణులు భావిస్తున్నారు. అయితే, చమురు కంపెనీల లాభాలు తగ్గిపోతే మాత్రం ఆ భారాన్ని ప్రజలపై వేయక తప్పదు. 2026 మొదటి భాగంలో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం 1 శాతం మేర పెరిగే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ నివేదిక స్పష్టం చేస్తోంది. యుద్ధం త్వరగా ముగియకపోతే మాత్రం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థికంగా గడ్డు కాలం తప్పదు.

