Oil Crisis: మూసుకుపోయిన సౌదీ చమురు పైప్‌లైన్.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయా ?
పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయా ?

Oil Crisis: సౌదీ అరేబియాలో ప్రధానమైన చమురు పైప్‌లైన్ మూతపడటం అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు నాలుగు శాతం వాటా ఉన్న ఈ మార్గం నిలిచిపోవడంతో ఇంధన ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం పొంచి ఉంది. ఈ పరిణామం ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. డ్రోన్ దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియా తన భారీ ఎడ్-వెస్ట్ చమురు పైప్‌లైన్‌ను అత్యవసరంగా నిలిపివేయాల్సి వచ్చింది. ఈ పైప్‌లైన్ అరేబియా ద్వీపకల్పం నుంచి ఎర్ర సముద్రంలోని యాన్బు నౌకాశ్రయానికి చమురును రవాణా చేస్తుంది. ఈ మార్గం ద్వారా రోజూ సుమారు 140 లక్షల బ్యారెళ్ల చమురు ఎగుమతి జరుగుతోంది. ఇది ప్రపంచ మొత్తం చమురు సరఫరాలో నాలుగు శాతానికి సమానం. ఈ కీలక పైప్‌లైన్ బంద్ కావడంతో యాన్బు నౌకాశ్రయం వద్ద కేవలం 5 నుంచి 7 రోజులకు సరిపడా చమురు నిల్వలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
ఈ పైప్‌లైన్‌కు జరిగిన నష్టం తీవ్రతపై సౌదీ అరేబియా ఇంకా పూర్తి స్పష్టత ఇవ్వలేదు. నిపుణుల అంచనాల ప్రకారం, ఈ దెబ్బతిన్న మార్గాన్ని పూర్తిగా బాగు చేయడానికి 5 నుంచి 6 వారాల వరకు సమయం పట్టవచ్చు. ఒకవేళ వీలైనంత త్వరగా పాక్షికంగానైనా సరఫరా పునరుద్ధరించకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. యాన్బు పోర్టులో సుమారు 3.5 కోట్ల బ్యారెళ్ల చమురు నిల్వ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ, పైప్‌లైన్ పనిచేయకపోతే ఈ నిల్వలు వేగంగా అడుగంటిపోతాయి.
అంతర్జాతీయ ఇంధన సంస్థ నివేదికల ప్రకారం, గత ఆగస్టు నెలలో సౌదీ అరేబియా చమురు సరఫరా మూడు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయింది. హర్మూజ్ జలసంధి అలాగే ఎర్ర సముద్ర మార్గాల్లో రవాణా దెబ్బతినడం ఇందుకు ప్రధాన కారణం. యుద్ధ పరిస్థితుల కారణంగా మధ్యప్రాచ్యం నుంచి జరిగే చమురు ప్రవాహం గణనీయంగా తగ్గిపోయింది. సౌదీ అరేబియా తన రోజువారీ ఉత్పత్తిని కూడా భారీగా తగ్గించుకోవాల్సి వచ్చింది. ఫిబ్రవరి నెలలో రోజుకు 1.09కోట్ల బ్యారెళ్లుగా ఉన్న ఉత్పత్తి, ఆగస్టు నాటికి కేవలం 62 లక్షల బ్యారెళ్లకు పడిపోయింది.
సౌదీ అరేబియా నుంచి చమురు ఎగుమతులు ఇలాగే నిలిచిపోతే ఇప్పటికే ఇబ్బంది పడుతున్న గ్లోబల్ మార్కెట్‌పై మరింత భారం పడుతుంది. దీనివల్ల పెట్రోలు, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకుని పలు దేశాల్లో ద్రవ్యోల్బణం అదుపుతప్పే ప్రమాదం ఉంది. మరోవైపు యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు కూడా సౌదీ చమురు నౌకలను టార్గెట్ చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తుండటంతో భద్రతా పరమైన సవాళ్లు మరెన్నో పెరుగుతున్నాయి.

