ఆకాశాన్ని తాకిన ఎరువులు, డీజిల్ ధరలు.. వరి సాగుకు బ్రేక్

Global Rice Crisis : మధ్యప్రాచ్యంలో రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు సామాన్యుడి కడుపు కొట్టేలా ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలకు ప్రధాన ఆహారమైన బియ్యం సాగుపై ఈ యుద్ధం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడం, ఎరువుల కొరత వెరసి ఆసియా దేశాల్లోని వరి రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. పంట చేతికి వచ్చినా కోయలేక, కొత్త పంట వేయలేక అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్‌లో ఆరు వారాలుగా జరుగుతున్న యుద్ధం ప్రపంచ వాణిజ్యాన్ని అతలాకుతలం చేసింది. హోర్ముజ్ జలసంధి దాదాపు మూతపడటంతో ఆసియా దేశాలకు చేరాల్సిన ఎరువులు, ఇంధన సరఫరా నిలిచిపోయింది. దీంతో ట్రాక్టర్లు, ఇరిగేషన్ పంపులు నడపడానికి అవసరమైన డీజిల్ ధరలు రెట్టింపు అయ్యాయి. థాయ్‌లాండ్, కంబోడియా వంటి దేశాల్లో వరి కోయడానికి అయ్యే ఖర్చు కంటే, మార్కెట్‌లో బియ్యం ధర తక్కువగా ఉంది. దీంతో చాలా మంది రైతులు పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. కోస్తే వచ్చే ఆదాయం కంటే కూలీల ఖర్చు, డీజిల్ ఖర్చే ఎక్కువగా ఉండటమే దీనికి కారణం.

ప్రపంచ ఆహార భద్రతకు ముప్పు

ప్రపంచ జనాభాలో సగానికి పైగా మందికి బియ్యమే ప్రధాన ఆహారం. ముఖ్యంగా ఆగ్నేయాసియాలో కోట్లాది మంది ప్రజల జీవనాధారం వరి సాగుపైనే ఆధారపడి ఉంది. కానీ ఇప్పుడు ఎరువుల ఖర్చు మూడు రెట్లు పెరగడం, మరోవైపు పాత స్టాక్ ఎక్కువగా ఉండటంతో మార్కెట్‌లో బియ్యం ధరలు పడిపోవడం రైతుల్ని కుంగదీస్తోంది. థాయ్ వైట్ రైస్ ధర గత పదేళ్లలో లేనంత కనిష్ట స్థాయికి అంటే టన్నుకు 400 డాలర్ల కంటే కిందకు పడిపోయింది. అటు సాగు ఖర్చు పెరిగి.. ఇటు అమ్మే ధర తగ్గి రైతులకు కనీస లాభం కూడా మిగలడం లేదు.

ఉత్పత్తిలో భారీ కోత

ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం దిగుమతిదారు, ప్రధాన ఉత్పత్తిదారు అయిన ఫిలిప్పీన్స్‌లో ఈ ఏడాది వరి ఉత్పత్తి 10 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే దాదాపు 20 లక్షల టన్నుల బియ్యం కొరత ఏర్పడవచ్చు. దీని ప్రభావం సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు. కంబోడియాలో కూడా పది శాతం మంది రైతులు కొత్త పంట వేసేందుకు వెనుకాడుతున్నారు. రేపు మార్కెట్‌లో గ్యారెంటీ ధర లభిస్తుందో లేదో తెలియక, అప్పులు చేసి సాగు చేయడం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు.

ప్రత్యామ్నాయ మార్గాల వేట

ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు రైతులు కొత్త దారులు వెతుకుతున్నారు. వరికి బదులుగా తక్కువ నీరు, తక్కువ ఇంధనం అవసరమయ్యే మొక్కజొన్న వంటి పంటలను సాగు చేస్తున్నారు. కంబోడియాకు చెందిన కొన్ని కంపెనీలు బయో-ఆర్గానిక్ ఎరువుల వాడకాన్ని పెంచుతున్నాయి. సోలార్ పంపులు, ఎలక్ట్రిక్ ట్రాక్టర్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. భారత్ లో సాగు సీజన్ మొదలవ్వడానికి ఇంకా సమయం ఉండటంతో ప్రస్తుతానికి ప్రభావం తక్కువగా ఉన్నా, చైనా తన వద్ద ఉన్న ఇంధన నిల్వలతో కొంత సురక్షితంగా ఉంది. అయితే, హోర్ముజ్ జలసంధి త్వరగా తెరుచుకోకపోతే మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత తప్పదని ఐరాస హెచ్చరిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story