Make In India : చైనాకు దిమ్మతిరిగే షాక్ ఇస్తున్న టెక్ దిగ్గజాలు.. పని చేస్తున్న మోదీ మేక్ ఇన్ ఇండియా మ్యాజిక్
పని చేస్తున్న మోదీ మేక్ ఇన్ ఇండియా మ్యాజిక్

Make In India : ప్రపంచం దృష్టిలో భారతదేశం కేవలం ఒక పెద్ద మార్కెట్‌గా కాకుండా, ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారుతోంది. ఈ మార్పును బలపరుస్తూ ప్రపంచంలోని దిగ్గజ సంస్థలు తమ కార్యకలాపాలను భారతదేశానికి తరలిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికన్ దిగ్గజాలైన ఫోర్డ్, హెచ్‌పీ, దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జీ వంటి సంస్థలు స్థానిక వినియోగం కోసం కాకుండా, అత్యాధునిక ఉత్పత్తి, పరిశోధన, ఎగుమతుల కోసం భారతదేశాన్ని తమ ప్రధాన కేంద్రంగా ఎంచుకుంటున్నాయి.
అమెరికన్ కార్పొరేట్ దిగ్గజాలు భారతదేశంలో తమ ఉత్పత్తి కార్యకలాపాలను కేవలం మార్కెటింగ్ కోసం కాకుండా, గ్లోబల్ ఎగుమతుల కోసం బలోపేతం చేస్తున్నాయి. అమెరికన్ ఆటో దిగ్గజం ఫోర్డ్ తమ చెన్నై ప్లాంట్‌ను హై-ఎండ్ ఇంజిన్ల తయారీ కోసం పునరుద్ధరించాలని ప్రకటించింది. ఈ ప్లాంట్ నుంచి ఏటా 2,35,000కు పైగా ఇంజిన్‌లను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ఇతర మార్కెట్‌లకు ఎగుమతి చేయనుంది.
అమెరికన్ టెక్ దిగ్గజం హెచ్‌పీ కూడా భారతదేశంలో తమ ఆధిపత్యాన్ని పెంచుకుంటోంది. రాబోయే 3-5 సంవత్సరాలలో భారతదేశంలో విక్రయించే అన్ని పర్సనల్ కంప్యూటర్లు (ల్యాప్‌టాప్‌లు) దేశంలోనే తయారు అవుతాయని హెచ్‌పీ సీఈఓ ఇటీవల తెలిపారు. భవిష్యత్తులో భారతీయ ప్లాంట్ల నుంచే ల్యాప్‌టాప్‌లను ఎగుమతి చేయాలని కూడా ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
అమెరికన్ కంపెనీలు ఉత్పత్తి, వ్యూహంపై దృష్టి సారిస్తుండగా, దక్షిణ కొరియా సంస్థలు దీర్ఘకాలిక పారిశ్రామిక, సాంకేతిక అనుబంధంపై పందెం వేస్తున్నాయి. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ గ్రూప్ నోయిడాలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఒక గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా దాదాపు 500 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఎల్‌జీ ప్రస్తుతం కొరియా, చైనా, వియత్నాంలో తయారవుతున్న క్యాపిటల్ గూడ్స్(ఎలక్ట్రానిక్ ఫ్యాక్టరీలలో ఉపయోగించే భారీ యంత్రాలు) ఉత్పత్తిని కూడా భారతదేశానికి మార్చాలని యోచిస్తోంది.
ప్రపంచ కంపెనీలు భారతదేశం వైపు మొగ్గు చూపడానికి మూడు ప్రధాన అంశాలు దోహదపడుతున్నాయి.
1. ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు: మేక్ ఇన్ ఇండియా, పీఎల్ఐ స్కీమ్, ఆత్మనిర్భర్ భారత్ వంటి స్పష్టమైన పారిశ్రామిక విధానాలు కంపెనీలను ఇక్కడ ఉత్పత్తి చేయడానికి ప్రోత్సహిస్తున్నాయి.
2. నైపుణ్యం కలిగిన యువ శ్రామిక శక్తి: భారతదేశం విస్తారమైన యువ జనాభాను కలిగి ఉంది. వీరు టెక్నికల్ స్కిల్స్ కలిగి ఉండటమే కాకుండా ఆంగ్ల భాషా పరిజ్ఞానం కలిగి ఉన్నారు. ఇది డిజైన్ నుంచి ఉత్పత్తి వరకు అన్ని పనులకు అనుకూలంగా ఉంది.
3. మారిన ప్రపంచ రాజకీయ వాతావరణం: అమెరికా-చైనా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ సరఫరా గొలుసును కేవలం ఒక దేశం (చైనా)పై ఆధారపడకుండా వికేంద్రీకరించాలనే ప్రపంచ ఆలోచన.. భారతదేశాన్ని వ్యూహాత్మక ప్రత్యామ్నాయంగా మార్చింది.
ఈ కారణాల వల్ల, భారతదేశం కేవలం చైనాకు చౌకైన ప్రత్యామ్నాయంగా కాకుండా, ప్రపంచ మార్కెట్‌లకు సేవలు అందించే ఒక సమాంతర సామర్థ్యం గల కేంద్రంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది.

