Gold Price : వెండి మెరుపులు మాయం..పాతాళానికి పసిడి ధరలు..కొనుగోలుదారులకు కాసుల పంట
కొనుగోలుదారులకు కాసుల పంట

Gold Price : బులియన్ మార్కెట్‌లో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా చుక్కలను తాకిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో ధరలు పడిపోతున్న తీరు చూస్తుంటే ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యంగా వెండి ధరలు ఊహకందని రీతిలో పతనమవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సామాన్య కొనుగోలుదారులకు ఇది భారీ ఊరటనిచ్చే విషయమే అయినప్పటికీ, మార్కెట్ వర్గాల్లో మాత్రం అలజడి రేపుతోంది.
వెండి ధరల పతనం ఇప్పుడు మార్కెట్ నిపుణులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఎంసీఎక్స్‌లో వెండి ధర ఏకంగా రూ.2,35,221కి పడిపోయింది. ఈ రోజు మార్కెట్ ప్రారంభంలోనే వెండి ఏకంగా రూ.15,000 వరకు నష్టపోయింది. ఒకానొక దశలో కొంత కోలుకున్నా, ఇప్పటికీ రూ.9,000 లోటుతోనే కొనసాగుతోంది. నిపుణుల విశ్లేషణ ప్రకారం, గత 50 ఏళ్లలో ఇలాంటి పతనం ఎప్పుడూ చూడలేదు. 1980లో వెండి తన గరిష్ట ధర నుండి 70 శాతం పడిపోగా, ప్రస్తుతం గత కొద్ది రోజుల్లోనే 46 శాతం మేర ధర తగ్గింది. ఇదే ధోరణి వచ్చే వారం కూడా కొనసాగితే, వెండి ధర రూ.2 లక్షల కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
బంగారం పరిస్థితి ఏంటి?
కేవలం వెండి మాత్రమే కాదు, బంగారం కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1,50,699 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండితో పోలిస్తే బంగారం ధరలో తగ్గుదల కొంత తక్కువగా ఉన్నప్పటికీ, కొనుగోలుదారులను ఆకర్షించే స్థాయికి రేట్లు దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన అనిశ్చితి, ఇన్వెస్టర్లు బంగారం అమ్మకాలపై మొగ్గు చూపడం వల్ల ధరల మీద భారం పడింది. ఇది మరికొంత కాలం కొనసాగవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
ఎందుకు ఈ భారీ పతనం?
అసలు బంగారం, వెండి ధరలు ఎందుకు పేక మేడల్లా కూలిపోతున్నాయనే దానికి ప్రధాన కారణం అంతర్జాతీయ పరిణామాలే. అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా డాలర్ గత రెండు వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. డాలర్ బలపడితే, ఇతర కరెన్సీలు వాడే దేశాలకు బంగారం కొనడం భారంగా మారుతుంది, దీనివల్ల డిమాండ్ తగ్గి ధరలు పడిపోతాయి. అమెరికా - చైనా మధ్య గత కొంతకాలంగా ఉన్న వాణిజ్య యుద్ధ మేఘాలు కొంత శాంతించాయి. రాజకీయ పరిస్థితులు కుదుటపడటంతో, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి తీసి షేర్ మార్కెట్ల వైపు మళ్లిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర 2.5 శాతం తగ్గి 4,838 డాలర్లకు పడిపోగా, స్పాట్ సిల్వర్ ఏకంగా 14.9 శాతం నష్టంతో 74.94 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

