Gold ETF : గడిచిన 12 నెలలుగా అప్రతిహతంగా సాగుతున్న బంగారం మార్కెట్ రేసులో ఇప్పుడు సరికొత్త మార్పులు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ గోల్డ్ ఈటీఎఫ్‌లలో విపరీతంగా పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు.. ఇప్పుడు లాభాలను వెనక్కి తీసుకునే పనిలో పడ్డారు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) విడుదల చేసిన మే 2026 తాజా నివేదిక ప్రకారం.. మే నెలలో గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి ఏకంగా రూ.725 కోట్ల నికర పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి. గత ఏడాది కాలంలో బంగారం ఫండ్స్ నుంచి ఈ స్థాయిలో డబ్బులు బయటకు రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

లాభాల స్వీకరణే ప్రధాన కారణం

అయితే ఈ అమ్మకాల వెనుక ఎలాంటి కంగారు కానీ, భయం కానీ లేవని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కేవలం ఒక ముందస్తు వ్యూహం ప్రకారమే జరిగింది. ఈ విషయమై ఎంఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ చలసాని మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయని, ముఖ్యంగా ఇంపోర్ట్ డ్యూటీ పెరిగిన తర్వాత రేట్లు ఆకాశాన్ని తాకాయని గుర్తుచేశారు. దీనివల్ల తక్కువ ధరల్లో ఉన్నప్పుడు గోల్డ్ ఈటీఎఫ్ కొనుగోలు చేసిన వారు.. ఇప్పుడు మంచి రేటు రావడంతో తమ ప్రాఫిట్‌ను బుక్ చేసుకుని క్యాష్ చేసుకున్నారని వివరించారు. అలాగే బలపడుతున్న అమెరికా డాలర్, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు కూడా ఇన్వెస్టర్లను కాస్త అప్రమత్తం చేశాయి.

డబ్బులు విత్‌డ్రా చేసినా పెరిగిన గోల్డ్ ఫండ్ విలువ

పెట్టుబడుల ప్రపంచంలో కొన్నిసార్లు గణాంకాలు చాలా వింతగా ఉంటాయి. మే నెలలో రూ.725 కోట్లు బయటకు వెళ్లినప్పటికీ.. గోల్డ్ ఈటీఎఫ్‌ల మొత్తం నిర్వహణ ఆస్తి విలువ (AUM) తగ్గకపోగా మరింత పెరిగింది. మే చివరి నాటికి ఈ ఏయూఎం దాదాపు 4 శాతం వృద్ధితో రూ.1.85 లక్షల కోట్ల రికార్డు స్థాయికి చేరుకుంది. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఈ ఫండ్ పరిమాణం దాదాపు మూడు రెట్లు పెరిగింది. దీనికి ముఖ్య కారణం మార్కెట్లో ఉన్న బంగారం రేటు విపరీతంగా పెరగడమే. ఇన్వెస్టర్లు కొంత డబ్బు తీసుకున్నప్పటికీ.. ఫండ్‌లో మిగిలి ఉన్న యూనిట్ల మార్కెట్ వాల్యూ పెరగడంతో ఓవరాల్‌గా ఫండ్ సైజ్ పెద్దగా కనిపించింది.

బంగారాన్ని పక్కన పెట్టి వెండి వైపు పరుగు

ఒకవైపు పసిడి ఫండ్స్ నుంచి డబ్బులు డ్రా చేస్తుంటే.. మరోవైపు వెండి (సిల్వర్ ఈటీఎఫ్) పై ఇన్వెస్టర్లు కాసుల వర్షం కురిపిస్తున్నారు. మే నెలలో సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్స్‌లోకి రికార్డు స్థాయిలో రూ.2,133 కోట్ల భారీ పెట్టుబడులు వచ్చాయి. భవిష్యత్తులో సోలార్ ఎనర్జీ రంగం, అలాగే వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రిఫికేషన్ (ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు)లలో ఇండస్ట్రియల్ పరంగా వెండికి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుందని ఇన్వెస్టర్లు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే లాంగ్ టర్మ్ వ్యూహంతో సిల్వర్‌ను తమ పోర్ట్‌ఫోలియోలో ఎక్కువగా చేర్చుకుంటున్నారు.

లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

మీ దగ్గర కూడా గోల్డ్ ఈటీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటే.. మే నెలలో జరిగిన ఈ మార్పులను చూసి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్ ఎప్పుడూ ఒకేలా పైకి వెళ్లదని, మధ్యమధ్యలో ఇలాంటి ప్రాఫిట్ బుకింగ్స్ రావడం చాలా సహజమని చెబుతున్నారు. 2026 ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు జరిగిన ఓవరాల్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ డేటా చాలా బలంగా ఉంది. కాబట్టి దీర్ఘకాలికంగా చూస్తే సురక్షితమైన, నమ్మకమైన పెట్టుబడిగా బంగారంపై మార్కెట్ నమ్మకం ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story