ఈ వారంలో పసిడి మెరుపు ఎలా ఉంటుంది ?

Gold Price : బంగారం ధరలు కొంత తగ్గుముఖం పట్టడంతో కొద్ది రోజుల పాటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇప్పుడు పసిడి ధరలు మళ్లీ రికార్డు గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో అమెరికాలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ద్రవ్య విధాన కమిటీ సమావేశం, అమెరికాలో ఉద్యోగ, ద్రవ్యోల్బణ గణాంకాలు, అలాగే రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చల వంటి కీలక పరిణామాలు మార్కెట్‌ను ప్రభావితం చేయనున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో బంగారం ధరల ధోరణి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం.

రాబోయే వారంలో బంగారం ధరలపై అనేక అంతర్జాతీయ, దేశీయ పరిణామాలు ప్రభావం చూపనున్నాయి. పెట్టుబడిదారులు అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం మరియు భారత ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశంపై దృష్టి సారిస్తున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం, ఉద్యోగాల గణాంకాలు, వినియోగదారుల సెంటిమెంట్ డేటా, వివిధ ప్రాంతాల తయారీ, సేవల పీఎంఐ గణాంకాలు వంటివి ధరల ధోరణిని నిర్ణయిస్తాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చల్లో వచ్చే పరిణామాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతాయి. ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్ ప్రసంగంపై కూడా ట్రేడర్లు దృష్టి సారించారు.

గత వారం బంగారం ధరల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‎లో ఫిబ్రవరి 2026 కాంట్రాక్ట్ కోసం గోల్డ్ ఫ్యూచర్స్ గత వారం ఏకంగా రూ. 3,654 లేదా 2.9 శాతం పెరిగి, శుక్రవారం రూ. 1,29,504 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ డిసెంబర్ డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ 138.8 అమెరికన్ డాలర్లు లేదా 3.4 శాతం పెరిగి, ఔన్స్‌కు 4,218.3 డాలర్ల వద్ద ముగిసింది. భారతీయ మార్కెట్లలో రూపాయి విలువలో హెచ్చుతగ్గులు, దేశీయ డిమాండ్ కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఏంజిల్ వన్ నిపుణుడు ప్రథమేష్ మాల్యా ప్రకారం..పండుగల సీజన్, వివాహ వేడుకలు, జ్యువెలరీకి స్థిరమైన డిమాండ్ కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు కూడా భవిష్యత్తులో బంగారం కొనుగోళ్లను కొనసాగించే అవకాశం ఉంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు, అమెరికన్ డాలర్ బలహీనపడటం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో, సురక్షితమైన పెట్టుబడి గా బంగారం డిమాండ్ స్థిరంగా ఉంటుంది. అందుకే రాబోయే రోజుల్లో బంగారం ధరలు మళ్లీ రికార్డు గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story