Gold Import Duty : బంగారంపై కేంద్రం డబుల్ పంచ్.. దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు
దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు

Gold Import Duty : దేశంలో పసిడి ప్రియులకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న ధరలతో సతమతమవుతుంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచేసింది. నిన్నటి వరకు కేవలం 6 శాతంగా ఉన్న మొత్తం సుంకాన్ని ఏకంగా 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రేట్లు 2026, మే 13 నుంచి అమలులోకి వచ్చాయి. పెళ్లిళ్ల సీజన్‌లో ఉన్న భారతీయులకు ఇది మింగుడుపడని వార్తే అయినప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడటానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.
ఎందుకు ఈ నిర్ణయం?
గతంలో అంటే 2024 బడ్జెట్‌లో స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం సుంకాన్ని తగ్గించింది. కానీ, ఇప్పుడు అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, డాలర్ నిల్వలను కాపాడుకోవాల్సిన అవసరం రావడంతో పన్నులను మళ్ళీ పెంచక తప్పలేదు. తాజా పెంపుతో బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD) 5% నుండి 10%కి, అగ్రికల్చర్ సెస్ (AIDC) 1% నుండి 5%కి పెరిగింది. అంటే మొత్తం మీద బంగారం దిగుమతి చేసుకోవడం ఇప్పుడు చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది.
ప్రభుత్వానికి వచ్చే లాభం ఎంత?
గత ఆర్థిక సంవత్సరంలో (2025-26) భారత్ సుమారు 71.98 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. పాత 6 శాతం సుంకం ప్రకారం చూస్తే ప్రభుత్వానికి 4.32 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చేది. ఒకవేళ దిగుమతులు తగ్గకుండా ఇదే స్థాయిలో కొనసాగితే, 15 శాతం సుంకం వల్ల ప్రభుత్వ ఖజానాకు 10.8 బిలియన్ డాలర్లు చేరుతాయి. అంటే అదనంగా సుమారు 6.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.54 వేల కోట్లు) ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే, ధరలు పెరిగితే దిగుమతులు తగ్గుతాయి కాబట్టి ఈ లెక్కల్లో మార్పులు ఉండవచ్చు.
దిగుమతులు తగ్గితే వచ్చే పరిణామాలు
ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుందన్నది మార్కెట్ సూత్రం. ఒకవేళ గోల్డ్ దిగుమతులు 10 శాతం తగ్గితే ప్రభుత్వానికి 9.72 బిలియన్ డాలర్లు, 20 శాతం మేర భారీగా తగ్గితే 8.64 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుంది. ఆదాయం సంగతి ఎలా ఉన్నా, దిగుమతులు తగ్గడం వల్ల విదేశాలకు తరలిపోయే డాలర్లు ఆదా అవుతాయి. దీనివల్ల రూపాయి విలువ పడిపోకుండా కాపాడుకోవచ్చని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పీఎం మోదీ విజ్ఞప్తి.. ప్రస్తుత పరిస్థితి
ఇటీవల ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని, అందుకే ప్రజలు బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలని కోరారు. పెట్రోల్, డీజిల్ వాడకంలోనూ పొదుపు పాటించాలని సూచించారు. దేశంపై ఆర్థిక భారం తగ్గించేందుకే ఒకవైపు ప్రధాని విజ్ఞప్తి, మరోవైపు ప్రభుత్వం సుంకాల పెంపు వంటి చర్యలు చేపడుతోంది.

