చరిత్ర సృష్టించిన దిగుమతులతో ప్రపంచమే షేక్

Gold Import : బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నా, భారతీయులకు పసిడిపై ఉన్న మక్కువ ఏమాత్రం తగ్గలేదు. 2026 జనవరిలో బంగారం దిగుమతులు కళ్లు చెదిరే రీతిలో పెరిగి సరికొత్త రికార్డులను సృష్టించాయి. గతేడాది జనవరిలో కేవలం 2.66 బిలియన్ డాలర్లుగా ఉన్న బంగారం దిగుమతి విలువ, ఈ ఏడాది ఏకంగా 350 శాతం పెరిగి 12 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే, ఈ భారీ దిగుమతులు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా భారత వాణిజ్య లోటు డిసెంబర్‌లో ఉన్న 24 బిలియన్ డాలర్ల నుంచి జనవరి నాటికి ఏకంగా 35 బిలియన్ డాలర్లకు పెరిగి ఆందోళన కలిగిస్తోంది.

వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలను పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. గత ఆరేళ్లలో మనం దిగుమతి చేసుకునే బంగారం పరిమాణం 23 శాతం తగ్గింది. అంటే 982.7 టన్నుల నుంచి 757.1 టన్నులకు పడిపోయింది. కానీ అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు విపరీతంగా పెరగడం వల్ల మనం చెల్లించే బిల్లు మాత్రం 76 శాతం పెరిగింది. 2018-19లో పసిడి దిగుమతి బిల్లు 32.9 బిలియన్ డాలర్లు ఉండగా, అది ఇప్పుడు 58 బిలియన్ డాలర్లకు చేరింది. అంటే మనం తక్కువ బంగారం కొంటున్నా, ధరల పెరుగుదల వల్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తోంది.

కేవలం బంగారమే కాదు, వెండి దిగుమతులు కూడా భారీగా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ కాలంలో వెండి దిగుమతి విలువ 128.95 శాతం పెరిగి 7.77 బిలియన్ డాలర్లకు చేరింది. మరోవైపు అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా భారత్‌కు అతిపెద్ద ఎగుమతి దేశంగా కొనసాగుతోంది. ఏప్రిల్-జనవరి మధ్య అమెరికాకు మన ఎగుమతులు 6 శాతం పెరిగి 72.46 బిలియన్ డాలర్లకు చేరాయి. అదే సమయంలో చైనా మనకు అతిపెద్ద దిగుమతి దేశంగా ఉంది. చైనా నుండి దిగుమతులు 13 శాతం పెరిగి 108.18 బిలియన్ డాలర్లకు చేరగా, ఆ దేశానికి మన ఎగుమతులు కూడా 38 శాతం మేర పెరగడం ఒక సానుకూల అంశం.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి వరకు మొత్తం బంగారం దిగుమతి బిల్లు 61.46 బిలియన్ డాలర్లకు చేరింది. నవంబర్ నెలలో దిగుమతుల గణాంకాల్లో భారీ మార్పులు చోటుచేసుకోవడం కూడా ఈ రంగంలో ఉన్న అస్థిరతను సూచిస్తోంది. దేశీయంగా బంగారం వినియోగం కంటే, అంతర్జాతీయ ధరల పెరుగుదలే మన వాణిజ్య లోటును పెంచుతూ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. పసిడిపై మనకున్న మోజు దేశ ఆర్థిక లెక్కలను తలకిందులు చేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story