Gold Price : గత నాలుగు వారాలుగా వరుసగా నష్టాలను చవిచూసిన బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ మద్దతుతో మళ్లీ పుంజుకున్నాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో కొనుగోలుదారులు గరిష్ట స్థాయిల్లో ఆసక్తి చూపడంతో పసిడి ధరలు భారీగా పెరిగాయి. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం.. రాబోయే రోజుల్లో కూడా బంగారం తన పరుగును ఇలాగే కొనసాగించే అవకాశం ఉంది. అయితే, వచ్చే వారం అమెరికాతో పాటు ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల నుంచి వెలువడనున్న కీలక ఆర్థిక గణాంకాలు, అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ఇచ్చే సంకేతాలు పసిడి తదుపరి కదలికలను నిర్ణయించనున్నాయి.

ఈ 5 ప్రధాన ఆర్థిక గణాంకాలపైనే ఇన్వెస్టర్ల కన్ను

వచ్చే వారం మార్కెట్ గమనాన్ని మార్చబోయే ఐదు ముఖ్యమైన అంశాలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు నిఘా పెట్టారు. అమెరికా సర్వీస్ పీఎంఐ రేట్లు, అంతర్జాతీయ వాణిజ్య నివేదికలు, వారపు నిరుద్యోగ భృతి క్లెయిమ్‌ల డేటా విడుదల కానుంది. వీటితో పాటు యూరో జోన్, చైనా, జపాన్, జర్మనీ దేశాల ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా బంగారం, వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలలో మార్పులు వచ్చినా లేదా ముడి చమురు ధరలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు నమోదైనా ఆ ఎఫెక్ట్ నేరుగా బులియన్ మార్కెట్‌పై పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధూమ్ ధామ్

జెఎమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రతినిధి ప్రణవ్ మేర్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం దేశీయ మార్కెట్లలో బంగారానికి బలమైన సపోర్ట్ లభిస్తోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఆగస్టు డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ ధర వారంలో ఏకంగా రూ.3,216 (2.2%) పెరిగి, 10 గ్రాములకు రూ.1,47,000 మార్కు వద్ద ముగిసింది. అదే సమయంలో సెప్టెంబర్ డెలివరీ వెండి ధర రూ.13,938 (6.2%) భారీగా లాభపడి కిలోగ్రాముకు రూ.2,37,000 కు చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లో అమెరికా డాలర్ ఇండెక్స్ కాస్త బలహీనపడటం, తక్కువ ధరల వద్ద ఇన్వెస్టర్లు ఎగబడి కొనడం మార్కెట్‌కు కలిసి వచ్చింది.

గ్లోబల్ మార్కెట్ సపోర్ట్

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‎లోనూ గోల్డ్ ఫ్యూచర్స్ 2.2% పెరిగి 4,187.30 డాలర్ల వద్ద, వెండి 5.3% పెరిగి 62.81 డాలర్ల వద్ద ముగిశాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఐదో ఏడాదికి చేరిన యుద్ధ ఉద్రిక్తతలు ఇన్వెస్టర్లను సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మళ్లేలా చేశాయి. వీటికి తోడు, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదిక ప్రకారం.. మే నెలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ రిజర్వుల కోసం ఏకంగా 41 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఈ పరిణామం మార్కెట్‌పై ఇన్వెస్టర్ల నమ్మకాన్ని మరింత రెట్టింపు చేసింది. అయినప్పటికీ, వచ్చే వారం డాలర్ కదలికలు, బాండ్ ఈల్డ్స్ ఆధారంగా మార్కెట్ ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Updated On
PolitEnt Media

PolitEnt Media

Next Story