Gold Prices : బంగారం ధరలు ఆకాశాన్ని తాకడానికి కారణం ఏంటి? మధ్యతరగతికి బంగారం ఇక కలేనా ?
మధ్యతరగతికి బంగారం ఇక కలేనా ?

Gold Prices : అమెరికా-చైనా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఈ సంవత్సరం చివరి నాటికి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తిరిగి తగ్గించే అవకాశం వంటి అంశాల నేపథ్యంలో బంగారం ధరలు రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం బంగారం ఔన్స్‌కు 4,185 డాలర్ల వద్ద కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. దీనితో పాటు వెండి ధర కూడా ఔన్స్‌కు 53.54 డాలర్లను దాటి ఆల్ టైమ్ హై లెవెల్‌కు చేరుకుంది. కేవలం పది నెలల్లో 50 శాతానికి పైగా రిటర్న్స్ ఇచ్చిన బంగారం ధరల పెరుగుదల వెనుక ఉన్న కారణాలు, సామాన్యులపై దాని ప్రభావం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారం చారిత్రక పెరుగుదలకు కారణాలు
గత 15 ఏళ్లుగా బంగారం డిమాండ్ స్థిరంగా ఉన్నా, సరఫరాలో పెద్దగా తగ్గుదల లేకపోయినా, బంగారం ధరలు ఇంతటి చారిత్రక స్థాయికి చేరడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనికి నిపుణులు అనేక కారణాలను విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా ఆర్థిక అనిశ్చితి, అమెరికా-చైనా ఉద్రిక్తతలు, భౌగోళిక రాజకీయ ఒత్తిళ్ల కారణంగా బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా కొనుగోలు చేయడం కొనసాగుతోంది. ఈ కొనుగోళ్లు, ట్రంప్ సుంకాల విధానం, ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఉద్రిక్తతలు కలిసి బంగారం ధరలపై ప్రభావం చూపాయి.
సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్ల జోరు
గత మూడు సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు విపరీతంగా బంగారాన్ని కొనుగోలు చేయడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. 2022, 2023, 2024లలో సెంట్రల్ బ్యాంకులు ప్రతి సంవత్సరం 1,000 టన్నుల కంటే ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేశాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. మే 2025 నాటికి సెంట్రల్ బ్యాంకుల వద్ద అధికారికంగా 36,344 టన్నుల బంగారం ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోని మొత్తం బంగారపు నిల్వల్లో దాదాపు నాలుగో వంతు సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లకే పోతుండటంతో, నగలు, పెట్టుబడుల కోసం మార్కెట్‌లో సరఫరా తగ్గిపోయింది, ఇది ధరల పెరుగుదలకు దారితీసింది.
మధ్యతరగతికి అందని బంగారం
భారతదేశంలో బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. 2010ల దశాబ్దంలో 10 గ్రాముల బంగారానికి రూ. 40,000-50,000 ఖర్చు చేయాల్సి ఉండగా, ఇప్పుడు అదే 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,000 మార్క్‌ను దాటింది. కేవలం గత పది నెలల్లోనే బంగారం ధర రూ. 77,000 స్థాయి నుంచి రూ. 1,30,000కు చేరుకుంది, అంటే ఈ ఒక్క సంవత్సరంలోనే దేశంలో ధర 51 శాతం పెరిగింది. ఈ విపరీతమైన పెరుగుదల కారణంగా మధ్యతరగతి, సాధారణ ప్రజలకు బంగారం కొనుగోలు చేయాలనే కోరిక ఒక కలగానే మిగిలిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
డాలర్ బలహీనత, భవిష్యత్తు అంచనాలు
బంగారం ధరలకు, అమెరికన్ డాలర్‌కు సాధారణంగా విలోమ సంబంధం ఉంటుంది. డాలర్ బలహీనపడినప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి, డాలర్ బలంగా ఉన్నప్పుడు బంగారం ధరలు తగ్గుతాయి. ఈ ఏడాది అమెరికన్ డాలర్ విలువ ఏకంగా 11 శాతం పడిపోయింది. ఇది 1973 తర్వాత అంటే 52 సంవత్సరాల తర్వాత అతిపెద్ద క్షీణత. న్యూయార్క్ ఇంటర్‌కాంటినెంటల్ ఎక్స్ఛేంజ్ ప్రకారం.. డాలర్ ఇండెక్స్ ప్రస్తుతం 98.57 వద్ద ఉంది. సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు కొనసాగడం, డాలర్ బలహీనంగా ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, ప్రస్తుతానికి బంగారం ధరలు తగ్గే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.
