Gold Price : యుద్ధ భయంతో వణికిపోతున్న మార్కెట్లు.. సురక్షిత పెట్టుబడిగా మళ్లీ బంగారం
సురక్షిత పెట్టుబడిగా మళ్లీ బంగారం

Gold Price : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. అంతర్జాతీయ రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి ప్రభావం నేరుగా పసిడి మార్కెట్‌పై పడింది. బుధవారం (మార్చి 4) ఉదయం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మళ్లీ మొగ్గు చూపడంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏప్రిల్ డెలివరీకి సంబంధించిన బంగారం ధర దాదాపు 1.13 శాతం పెరిగి 10 గ్రాములకు 1,62,930 రూపాయల రికార్డ్ స్థాయికి చేరుకుంది. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి కూడా అదే బాటలో పయనిస్తూ మే డెలివరీ ధర కిలోకు 1.3 శాతం పెరిగి 2,68,700 రూపాయల వద్ద ట్రేడవుతోంది.
నిజానికి ఒక్క రోజు క్రితం వరకు పరిస్థితి వేరుగా ఉండేది. మంగళవారం ట్రేడింగ్‌లో బంగారం ధర 3 శాతం, వెండి ధర ఏకంగా 5 శాతం మేర పడిపోయాయి. అప్పట్లో డాలర్ విలువ పెరగడం, అమెరికన్ బాండ్ ఈల్డ్స్ భారీగా ఉండటంతో పసిడిపై ఒత్తిడి నెలకొంది. కానీ ఇరాన్ సంక్షోభం తీవ్రం కావడంతో సీన్ రివర్స్ అయ్యింది. అమెరికా డాలర్ ఇండెక్స్ నెలల గరిష్ట స్థాయి అయిన 99.33కి చేరుకుంది. 10 ఏళ్ల అమెరికన్ బాండ్ ఈల్డ్ కూడా 4 శాతాన్ని దాటేసింది. ఇంధన ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉండటంతో, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చనే ఆందోళన ఇన్వెస్టర్లలో మొదలైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్ కంటే బంగారమే సురక్షితమని అందరూ కొనుగోళ్లకు దిగుతున్నారు.
మరి ఈ సమయంలో బంగారం కొనడం సరైన నిర్ణయమేనా? అనే ప్రశ్నకు నిపుణులు ఆచితూచి సమాధానం ఇస్తున్నారు. దీర్ఘకాలికంగా చూస్తే బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, అయితే ప్రస్తుతం మార్కెట్ తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతోందని వారు హెచ్చరిస్తున్నారు. కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వారు మార్కెట్ కాస్త స్థిరపడే వరకు ఆగడం మంచిదని సూచిస్తున్నారు. టెక్నికల్ పరంగా చూస్తే, ఎంసీఎక్స్‌లో బంగారానికి 1,59,100 నుంచి 1,57,700 రూపాయల వద్ద బలమైన సపోర్ట్ ఉంది. ఒకవేళ పెరిగితే 1,65,800 రూపాయల వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. వెండికి కూడా 2,78,800 రూపాయల వద్ద గరిష్ట నిరోధం కనిపిస్తోంది.
మొత్తానికి ఇరాన్ సంక్షోభం సద్దుమణిగితే తప్ప పసిడి ధరలు అదుపులోకి వచ్చేలా లేవు. మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాలు ఇన్వెస్టర్లను భయపెడుతుంటే, సామాన్య ప్రజలు మాత్రం పెళ్లిళ్ల సీజన్‌లో ఈ ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. చమురు ధరల సెగకు తోడు ఇప్పుడు పసిడి పరుగు కూడా తోడవ్వడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు పెరుగుతున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం.. యుద్ధం గనుక ముదిరితే బంగారం ధరలు మనం ఊహించని స్థాయికి చేరుకోవచ్చు.

