నేలచూపులు చూస్తున్న గోల్డ్ రేట్లు

Gold Price Drop : వారమంతా ఊరించిన పసిడి ధరలు ఒక్కసారిగా నేలచూపులు చూస్తున్నాయి. సోమవారం మార్కెట్ ప్రారంభం కావడమే భారీ పతనంతో మొదలైంది. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా ఎగబాకిన బంగారం, వెండి ధరలు ఒక్క ఉదుటన కిందకు దిగిరావడంతో అటు కొనుగోలుదారులు, ఇటు ఇన్వెస్టర్లలో గందరగోళం మొదలైంది. వెండి ఏకంగా రూ.8,000 కు పైగా పడిపోగా, బంగారం కూడా తులంపై రూ.1,000 వరకు తగ్గింది. ఈ భారీ క్షీణతకు కారణాలేంటి? ఇప్పుడు కొనడం మంచిదేనా? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

వారపు తొలి ట్రేడింగ్ రోజైన సోమవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‎లో విక్రయాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. ఏప్రిల్ 2026 గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.64% తగ్గి రూ. 1,54,905 (10 గ్రాములకు) వద్దకు చేరుకుంది. అయితే వెండి ధరలు చూస్తే గుండె గుభేల్ అనాల్సిందే. మార్చి 2026 డెలివరీ వెండి ధర ఏకంగా 3.3% పతనమైంది. అంటే ఒక్క రోజులోనే రూ. 8,265 తగ్గి కిలో వెండి ధర రూ. 2,36,100 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లోనూ స్పాట్ గోల్డ్ ధర 5,020 డాలర్లకు పడిపోవడం భారత మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపింది.

గ్లోబల్ మార్కెట్ లో నెలకొన్న కొన్ని అనూహ్య మార్పులే ఈ ధరల పతనానికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు, గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లలో భారీగా షేర్లను విక్రయించడం బంగారంపై ఒత్తిడిని పెంచింది. అమెరికా - ఇరాన్ మధ్య చర్చలు, అంతర్జాతీయ రాజకీయాల్లో మార్పులు ఇన్వెస్టర్ల ఆలోచనా విధానాన్ని మార్చాయి. డాలర్ బలోపేతం కావడం వల్ల పెట్టుబడిదారులు బంగారం నుంచి లాభాలను వెనక్కి తీసుకుంటున్నారు.

సాధారణంగా ధరలు తగ్గుతున్నప్పుడు కొనుగోలు చేయడం మంచి వ్యూహమని నిపుణుల సలహా. పృథ్వీ ఫిన్‌మార్ట్ విశ్లేషకులు మనోజ్ కుమార్ జైన్ ప్రకారం.. బంగారం ధర రూ.1,54,000 నుంచి రూ.1,53,300 మధ్య ఉన్నప్పుడు కొనుగోలు చేయడం లాభదాయకం. భవిష్యత్తులో ఇది మళ్ళీ రూ.1,57,500 వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే, వెండి విషయంలో మాత్రం ఇప్పుడే తొందరపడొద్దని, అస్థిరత ఎక్కువగా ఉన్నందున వేచి చూడటమే ఉత్తమమని ఆయన సూచిస్తున్నారు.

హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో రిటైల్ మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి.

22 క్యారెట్ల బంగారం: రూ.1,15,672 (8 గ్రాములకు)

24 క్యారెట్ల బంగారం: రూ.1,26,192 (8 గ్రాములకు)

హైదరాబాద్, ముంబైలలో ఇంచుమించు ఒకే ధరలు ఉండగా, చెన్నైలో మాత్రం ధరలు కాస్త ఎక్కువగా (24 క్యారెట్లకు రూ. 1,27,064) ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story