Gold Price Hike : పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి ప్రియులకు, సామాన్య కొనుగోలుదారులకు బులియన్ మార్కెట్ కోలుకోలేని గట్టి షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు, దేశీయంగా పెరిగిన డిమాండ్ కారణంగా బంగారం, వెండి ధరలు ఒకేసారి ఆకాశాన్ని తాకాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల మార్కెట్లలో పసిడి, వెండి ధరలు భారీగా పుంజుకున్నాయి. ఒకే రోజులో తులం బంగారం ధర ఏకంగా రూ.1600లు పెరగగా.. కేజీ వెండి ధర ఊహించని రీతిలో రూ.5,000లు ఎగబాకింది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న చర్చల ప్రభావం, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, వీటికి తోడు దేశీయంగా వివాహాది శుభకార్యాల కొనుగోళ్లు ఒక్కసారిగా పెరగడమే ఈ ధరల సునామీకి ప్రధాన కారణాలని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ల బంగారం ధరలు సాధారణ మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. శుక్రవారం నమోదైన భారీ పెంపుతో.. 10 గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.1,62,900 (అన్ని పన్నులతో కలిపి)కి చేరుకుంది. అంతకుముందు బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి దీని ధర రూ.1,61,300 వద్ద ఉండటం గమనార్హం. గురువారం నాడు ఈద్-ఉల్-అజ్హా పండగ సందర్భంగా సర్రాఫా మార్కెట్లకు సెలవు ప్రకటించగా.. శుక్రవారం ఉదయం మార్కెట్ తిరిగి తెరుచుకున్న వెంటనే కస్టమర్లు, ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు పోటీ పడటంతో పసిడి రేట్లు రాకెట్‌లా దూసుకెళ్లాయి.

పసిడితో పోటీ పడుతూ వెండి కూడా కొనుగోలుదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. శుక్రవారం ఒకే ఒక్క రోజులోనే ఏకంగా రూ.5,000 మేర బలపడిన కేజీ వెండి ధర.. మార్కెట్ ముగిసే సమయానికి రూ.2,74,700 వద్ద స్థిరపడింది. గత ట్రేడింగ్ సెషన్‌లో కేజీ వెండి ధర రూ.2,69,700 వద్ద ఉండేది. సాధారణంగా కేవలం సురక్షిత పెట్టుబడిగా మాత్రమే కాకుండా.. వివిధ రకాల భారీ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ తయారీలో కూడా వెండిని విరివిగా ఉపయోగిస్తుంటారు. ఈ పారిశ్రామిక డిమాండ్ కూడా తోడవడంతో వెండి రేట్లు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి.

గ్లోబల్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. అంతర్జాతీయ వేదికపై జరుగుతున్న కొన్ని కీలక పరిణామాలు బంగారం ధరలకు భారీ బూస్టింగ్ ఇచ్చాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ప్రాథమిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉందనే వార్తలతో మార్కెట్ పై ఉన్న ఒత్తిడి కొంత తగ్గింది. దీనితో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై మార్కెట్లో కొత్త ఆశలు చిగురించాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర దాదాపు 1 శాతం పెరిగి ఔన్స్‌కు 4,530.72 డాలర్లకు చేరుకోగా, వెండి ధర ఔన్స్‌కు 75.52 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అమెరికా-ఇరాన్ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా బయటకు వచ్చేంతవరకు అంతర్జాతీయ మార్కెట్లో ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.

ప్రస్తుతానికి బంగారం, వెండి ధరలు భారీగా కిందకు దిగివచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ కమోడిటీ రీసెర్చ్ హెడ్ హరీష్ వి స్పష్టం చేశారు. మార్కెట్లోని అంతర్గత శక్తులు, గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఇన్వెస్టర్లు సేఫ్ హెవెన్ (సురక్షిత పెట్టుబడి) అయిన బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు భారతదేశంలో ప్రస్తుతం వివాహాల సీజన్ నడుస్తుండటంతో.. ధరలు ఎంత పెరిగినా సరే సాంప్రదాయం ప్రకారం బంగారం కొనక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నిరంతర డిమాండ్ కారణంగా రాబోయే రోజుల్లో కూడా పసిడి రేట్లు మరింత రికార్డులను సృష్టించేలా కనిపిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story