Gold vs Stocks : బంగారం VS షేర్లు.. ఈ ఏడాది గోల్డ్ జోరుకు సెన్సెక్స్ ఢీలా.. పెట్టుబడికి ఏది బెటర్?
ఈ ఏడాది గోల్డ్ జోరుకు సెన్సెక్స్ ఢీలా.. పెట్టుబడికి ఏది బెటర్?

Gold vs Stocks : మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా? మీ డబ్బును బంగారం కొనడానికి వాడాలా, లేక షేర్ మార్కెట్‌లో పెట్టాలా అని తికమక పడుతున్నారా? ఈ సంవత్సరం పసిడి ఇచ్చిన రాబడి చూస్తే, ఎవరికైనా షేర్ల కన్నా బంగారమే బెటర్ అనిపిస్తుంది. విదేశీ మార్కెట్‌లో గోల్డ్ ధర $4,123 డాలర్లు ఉండగా, మన దేశంలో ఏకంగా రూ.1,26,090 ఉంది. ఈ సంవత్సరం గోల్డ్ ప్రదర్శన చూసి పెట్టుబడిదారులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. షేర్ల కన్నా బంగారమే బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌గా మారిందా? ఈ ప్రశ్నకే సమాధానం దొరకాలంటే, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం గోల్డెన్ పర్ఫామెన్స్
ప్రస్తుత సంవత్సరం (2025) లో బంగారం పనితీరు చూస్తే, షేర్ మార్కెట్ దాని ముందు పూర్తిగా వెనుకబడింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు సెన్సెక్స్ 8 శాతం, నిఫ్టీ 9.5 శాతం మాత్రమే పెరిగాయి. కానీ, బంగారం ఏకంగా 58 శాతం రాబడి ఇచ్చింది. ఈ పెరుగుదల ఒక్కసారిగా వచ్చింది కాదు. 2024 లో 27 శాతం, 2023 లో 13 శాతం రాబడి ఇచ్చింది. గత ఒక సంవత్సరంలో బంగారం ఏకంగా 61 శాతం పెరిగింది. అదే సమయంలో సెన్సెక్స్ కేవలం 9 శాతం మాత్రమే పెరిగింది. గత మూడు సంవత్సరాలలో బంగారం 32 శాతం రిటర్న్ ఇవ్వగా, సెన్సెక్స్ 11 శాతం మాత్రమే ఇచ్చింది. గత ఐదు సంవత్సరాలలో బంగారం 16 శాతం రిటర్న్ ఇవ్వగా, సెన్సెక్స్ 14 శాతం ఇచ్చింది. ఈ లెక్కలు చూస్తుంటే గత ఐదేళ్లలో షార్ట్ టర్మ్ మరియు మిడ్ టర్మ్‌లో బంగారం తిరుగులేని విజయం సాధించిందని స్పష్టంగా అర్థమవుతుంది.
ఎందుకు ఈ పెరుగుదల?
బంగారం ధరలు ఇంత భారీగా పెరగడానికి కారణం, ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో, రాజకీయాల్లో ఉన్న అనిశ్చితి. యుద్ధాలు, ఆర్థిక మాంద్యం భయాలు వంటి అనిశ్చిత సమయాల్లో, పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తిగా భావించి బంగారంలో పెట్టుబడి పెడతారు. అందుకే, రిస్క్ ఎక్కువగా ఉండే షేర్ల కన్నా గోల్డ్ మెరుగ్గా రాణించింది. గత మూడు సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు కూడా బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. ఈ డిమాండ్ కూడా గోల్డ్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం.
దీర్ఘకాలంలో ఎవరు టాప్?
షార్ట్ టర్మ్ రిటర్న్స్ బాగున్నప్పటికీ, లాంగ్ టర్మ్ రిటర్న్స్ విషయంలో గోల్డ్, షేర్ మార్కెట్ మధ్య గట్టి పోటీ ఉంది. గత 25 సంవత్సరాలలో గోల్డ్ సగటున 11.5 శాతం వార్షిక వృద్ధి రేటు ఇవ్వగా, సెన్సెక్స్ 13 శాతం CAGR ఇచ్చింది. అంటే లాంగ్ టర్మ్‌లో షేర్లు కొద్దిగా ముందున్నాయి. 20 సంవత్సరాల్లో గోల్డ్ 11 శాతం, సెన్సెక్స్ 12 శాతం రిటర్న్ ఇచ్చాయి. 10 సంవత్సరాల్లో గోల్డ్, సెన్సెక్స్ రెండూ సమానంగా 12.7 శాతం రిటర్న్ ఇచ్చాయి.
దీన్ని బట్టి చూస్తే, 10, 15, 20, 25 ఏళ్ల కాలంలో బంగారం, షేర్ల రాబడి దాదాపు ఒకే విధంగా, పోటీతత్వంతో ఉన్నాయని స్పష్టమవుతోంది. అయితే, బంగారం కొన్ని సమయాల్లో చాలా సంవత్సరాలుగా ఎలాంటి రాబడి ఇవ్వకుండా కూడా స్థిరంగా ఉందని చరిత్ర చెబుతోంది. ఉదాహరణకు.. 1980 లో $600 ఉన్న బంగారం, 2006 వరకు అంటే 25 ఏళ్ల పాటు అదే ధర వద్ద లేదా దాని కంటే తక్కువ ధర వద్ద ఉండి, చాలా కాలం నెగెటివ్ రిటర్న్స్‌లో ఉంది.
ఫైనల్ మాట ఏంటి?
మరి గోల్డ్‌లో పెట్టుబడి పెట్టడం మంచిదా? షేర్లలో పెట్టుబడి పెట్టడం మంచిదా? వాస్తవానికి ఈ ప్రశ్నే సరికాదు. ఎందుకంటే బంగారం, షేర్లు రెండూ వేర్వేరు లక్షణాలు కలిగిన పెట్టుబడి ఆస్తులు. ఆర్థిక నిపుణులు సూచించేది ఏంటంటే రిటైల్ పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలో 10 నుంచి 15 శాతం వరకు బంగారంలో పెట్టుబడి పెట్టడం ఆదర్శం.ముఖ్యంగా భౌతిక బంగారం కొనే బదులు, గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడం చాలా సులభం, తక్కువ ఖర్చుతో కూడుకున్నది. మీ పోర్ట్‌ఫోలియోను సమతుల్యంగా ఉంచడానికి బంగారం చాలా అవసరం.

