ఈఎంఐ కట్టే వాళ్లకు గుడ్ న్యూస్ వస్తుందా ?

RBI : భారత ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసే అతి ముఖ్యమైన ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ఈ రోజు సోమవారం మొదలై, మూడు రోజుల పాటు కొనసాగనుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయం ముఖ్యంగా బ్యాంకుల వడ్డీ రేట్లు, హోమ్ లోన్స్, ఈఎంఐలను ప్రభావితం చేయనుంది కాబట్టి, సామాన్య ప్రజల్లోనూ దీనిపై ఆసక్తి నెలకొంది.

గత కొద్ది నెలలుగా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే, ఫిబ్రవరి, ఏప్రిల్ మరియు జూన్‌లలో వరుసగా మూడు సార్లు రెపో రేటును తగ్గించింది. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే 100 బేసిస్ పాయింట్ల (1 శాతం) మేర వడ్డీ రేట్లు తగ్గాయి. అయితే, ఆగస్టులో జరిగిన చివరి సమావేశంలో మాత్రం వడ్డీ రేట్లను యథాస్థితిలో ఉంచారు. ఇప్పుడు అక్టోబర్ 1న ప్రకటించబోయే నిర్ణయంపై ఆర్థిక నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది నిపుణులు రెపో రేటును మరోసారి తగ్గించవచ్చని భావిస్తున్నారు.. మెజారిటీ నిపుణులు మాత్రం వడ్డీ రేట్లను యథాస్థితిలో కొనసాగించవచ్చు.

రెపో రేటును తగ్గించాలని కోరుకునే ఆర్థికవేత్తలు ..ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి అంత స్థిరంగా లేదు, ముఖ్యంగా అమెరికా విధించిన కొత్త సుంకాల ప్రభావం భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉంది. ఈ సమయంలో దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వడ్డీ రేట్లను మరింత తగ్గిస్తే, బ్యాంకుల నుంచి రుణాలు చౌకగా లభించి, ప్రజలు ఎక్కువ ఖర్చు చేయడానికి, కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం చాలా తక్కువ స్థాయిలో ఉంది. కాబట్టి, ధరలు పెరిగే ప్రమాదం లేదు. ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకొని వడ్డీ రేట్లను తగ్గించడం సరైన నిర్ణయమని వీరి వాదన.

వడ్డీ రేటును యథాస్థితిలో ఉంచాలని వాదించే వారి కారణాలు చాలా బలంగా ఉన్నాయి. ఆర్బీఐ సమావేశానికి కొద్ది రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టి సంస్కరణలు చేపట్టి, అనేక వస్తువులపై పన్నులు తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజం లభించే అవకాశం ఉంది. ఈ ప్రభావం పూర్తిగా కనిపించే వరకు ఆగడం మంచిది. దేశ స్థూల జాతీయోత్పత్తి వృద్ధి అంచనా వేసిన దానికంటే మెరుగ్గా నమోదైంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని సూచిస్తుంది. ద్రవ్యోల్బణం జులైలో1.6గా ఉండగా, ఆగస్టులో స్వల్పంగా పెరిగి 2.1కి చేరుకుంది. ఈ సమయంలో మళ్లీ వడ్డీ రేట్లను తగ్గిస్తే, ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతానికి జీడీపీ వృద్ధి ఆశాజనకంగా ఉంది కాబట్టి, తక్షణమే వడ్డీ రేట్లను తగ్గించాల్సిన అత్యవసరం లేదు. యథాస్థితిని కొనసాగించడమే తెలివైన నిర్ణయమని వీరి అభిప్రాయం. ఈ మూడు రోజుల సమావేశంలో నిపుణులు వివిధ ఆర్థిక అంశాలపై చర్చించిన తర్వాత, అక్టోబర్ 1, బుధవారం నాడు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పత్రికా గోష్ఠిలో కమిటీ తీసుకున్న తుది నిర్ణయాలను దేశానికి వెల్లడిస్తారు. ఈ నిర్ణయం ప్రజల హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, వెహికల్ లోన్స్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story