Smartphone Price : కొత్త ఫోన్ కొంటున్నారా.. కాస్త ఆగండి.. భారీగా తగ్గనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు
భారీగా తగ్గనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు

Smartphone Price : మీరు కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మరికొన్ని రోజులు ఆగడం మంచిది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫోన్ల ధరలను సామాన్యులకు మరింత అందుబాటులోకి తెచ్చేలా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దేశంలో బడ్జెట్, మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్లపై ప్రస్తుతం ఉన్న సరుకు సేవల పన్నును భారీగా తగ్గించాలనే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఇదే గనుక జరిగితే మార్కెట్లో మొబైల్ ఫోన్ల ధరలు భారీగా దిగిరానున్నాయి. గ్రాంట్ థార్న్టన్ భారత్, పాలసీ వాచ్ ఇండియా ఫౌండేషన్ సంయుక్తంగా రూపొందించిన ఒక తాజా నివేదికలో ఈ సంచలన సిఫార్సులను వెల్లడించింది.
ఈ సంయుక్త అధ్యయన నివేదిక ప్రకారం.. దేశంలో రూ. 25,000 కంటే తక్కువ ధర ఉన్న స్మార్ట్‌ఫోన్లపై జీఎస్‌టీని ప్రస్తుతమున్న 18 శాతం నుంచి ఏకంగా 5 శాతానికి తగ్గించాలని ప్రభుత్వానికి సూచించారు. అదే సమయంలో అంతకంటే ఎక్కువ ధర ఉండే ఖరీదైన ప్రీమియం, లగ్జరీ స్మార్ట్‌ఫోన్లపై మాత్రం ఎప్పటిలాగే 18 శాతం పన్నును కొనసాగించవచ్చని తెలిపారు. ప్రస్తుతం బడ్జెట్ ఫోన్లకు, ఐఫోన్ల లాంటి ప్రీమియం ఫోన్లకు ఒకే రకమైన 18 శాతం పన్ను విధించడం ఏమాత్రం సమంజసం కాదని నివేదిక స్పష్టం చేసింది. డిజిటల్ విప్లవంలో స్మార్ట్‌ఫోన్ల పాత్ర మారినందున, పన్నుల నిర్మాణాన్ని కూడా పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
స్మార్ట్‌ఫోన్లపై పన్ను తగ్గించడం వల్ల దేశంలో మొదటిసారి మొబైల్ కొనేవారికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వినియోగదారులకు పెద్ద ఎత్తున ఆర్థిక భారం తగ్గుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ ఇండియా, ఆర్థిక సమగ్రత, దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల లక్ష్యాలకు ఎంతగానో ఊతమిస్తుంది. సాధారణ బడ్జెట్ ఫోన్లను కేవలం ఒక విలాసవంతమైన వస్తువులా చూడకూడదని, వాటిని డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి అవసరమైన ప్రాథమిక మౌలిక సదుపాయంగా గుర్తించాలని ఈ నివేదికలో నిపుణులు గట్టిగా నొక్కి చెప్పారు.
ఈ నివేదికలోని గణాంకాల ప్రకారం.. భారతదేశంలో అమ్ముడవుతున్న మొత్తం మొబైల్ ఫోన్లలో రూ.25,000 లోపు ధర ఉన్నవే దాదాపు మూడింట రెండు వంతులు (సుమారు 66 శాతం) ఉన్నాయి. ఈ సెగ్మెంట్ ఫోన్లను ఎక్కువగా విద్యార్థులు, మహిళలు, గ్రామీణ కుటుంబాలు, తక్కువ ఆదాయం ఉన్నవారే కొనుగోలు చేస్తుంటారు. ఇప్పటికీ భారతదేశంలో దాదాపు 35 కోట్ల మంది ప్రజలు పాతకాలపు ఫీచర్ ఫోన్లనే (కీప్యాడ్ ఫోన్లు) వాడుతున్నారని ఈ స్టడీ వెల్లడించింది. వీరంతా స్మార్ట్‌ఫోన్ల వైపు మారకపోవడానికి మార్కెట్లో ఉన్న అధిక ధరలే ప్రధాన కారణం. కాబట్టి పన్ను తగ్గిస్తే ఈ 35 కోట్ల మంది సులభంగా డిజిటల్ ప్రపంచంలోకి మారే అవకాశం ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీలో దూసుకుపోతున్న ఇతర దేశాలతో పోలిస్తే.. భారతదేశంలోనే స్మార్ట్‌ఫోన్లపై అత్యధికంగా పరోక్ష పన్నులు వసూలు చేస్తున్నారు. వియత్నాం, థాయ్‌లాండ్, ఇండోనేషియా, మలేషియా వంటి దేశాలు చాలా తక్కువ పన్ను విధానాలను అవలంబిస్తున్నాయి. దీనివల్ల ఆయా దేశాల్లో మొబైల్ తయారీ రంగానికి మంచి పోటీ లభించడమే కాకుండా, ఎక్కువ మంది ప్రజలు స్మార్ట్‌ఫోన్లను సొంతం చేసుకోగలుగుతున్నారు. కాబట్టి బడ్జెట్ ఫోన్లపై పన్ను తగ్గించడాన్ని కేవలం ఒక పరిశ్రమకు ఇచ్చే రాయితీలా చూడకుండా, దేశ ఆర్థిక వృద్ధిని పెంచే ఒక వ్యూహాత్మక విధానంగా భావించాలని నిపుణులు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

