NPS : ఎన్‌పీఎస్ ఉద్యోగులకు మోదీ సర్కార్ బంపర్ గిఫ్ట్.. రెండు సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు
రెండు సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు

NPS : నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఖాతాదారులైన లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సెంట్రల్ అటానమస్ బాడీస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఎన్‌పీఎస్‌లో రెండు సరికొత్త పెట్టుబడి ఆప్షన్లను ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఉద్యోగులు తమ వయస్సు, అవసరాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యానికి అనుగుణంగా తమ రిటైర్మెంట్ ప్లాన్‌ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవడానికి వీలవుతుంది.
లక్షలాది మందికి భారీ ప్రయోజనం
భారత ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం ఒక అధికారిక మెమోరాండం ద్వారా ఈ కొత్త నిబంధనలను విడుదల చేసింది. గతంలో ఆర్థిక సేవల విభాగం 13 నవంబర్ 2025న జారీ చేసిన నోటిఫికేషన్‌ను, ఇప్పుడు ఎన్‌పీఎస్ పరిధిలోకి వచ్చే సెంట్రల్ అటానమస్ బాడీస్ ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. నిజానికి, ఈ అదనపు పెట్టుబడి ఆప్షన్లను కేంద్ర ప్రభుత్వం మొదట సాధారణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. కానీ, ఇప్పుడు ఆ పరిధిని విస్తరిస్తూ అటానమస్ బాడీస్ పరిధిలోని సబ్‌స్క్రైబర్లకు కూడా ఈ బంపర్ ఆఫర్‌ను వర్తింపజేశారు.
ఏమిటీ ఎగ్రెసివ్ లైఫ్ సైకిల్ ఫండ్ (LC-75)?
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్పుల ప్రకారం ఉద్యోగులకు లభించే ఆ రెండు కొత్త ఆప్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి:
* ఎగ్రెసివ్ లైఫ్ సైకిల్ ఫండ్ (LC-75):
దీనిని ఇప్పుడు 'LC-75-High' అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ ఆప్షన్‌ను ఎంచుకునే ఉద్యోగుల ఎన్‌పీఎస్ డబ్బులో గరిష్టంగా 75 శాతం వరకు నిధులను ఈక్విటీ (షేర్ మార్కెట్) లలో పెట్టుబడి పెడతారు. దీర్ఘకాలంలో తమ రిటైర్మెంట్ ఫండ్ భారీగా పెరగాలని కోరుకునే వారికి, మార్కెట్ రిస్క్‌ను తట్టుకోగల యువ ఉద్యోగులకు ఈ ఆప్షన్ ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది.
* బ్యాలెన్స్‌డ్ లైఫ్ సైకిల్ ఫండ్ (BLC) అంటే ఏంటి?
దీనికి ఇప్పుడు ఎగ్రెసివ్ లైఫ్ సైకిల్ ఫండ్ అని పేరు మార్చారు. ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌లో ఈక్విటీలలో పెట్టుబడి పరిమితి కేవలం 50 శాతం వరకే ఉంటుంది. ఇందులో ఒక ప్రత్యేకత ఉంది.. ఉద్యోగికి 45 సంవత్సరాల వయస్సు వచ్చినప్పటి నుంచి, ఈక్విటీలలో పెట్టే పెట్టుబడి శాతం క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీనివల్ల వయస్సు పైబడుతున్న కొద్దీ పెట్టుబడిపై రిస్క్ తగ్గి స్థిరత్వం వస్తుంది. అంటే అటు లాభాలు, ఇటు భద్రత రెండూ సమపాళ్లలో కావాలనుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌డ్ ఆప్షన్.
మీ రిస్క్ సామర్థ్యానికి తగ్గట్టుగా పెన్షన్ ప్లాన్
కేంద్ర ప్రభుత్వం ఈ పెట్టుబడి ఆప్షన్లను పెంచడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.. సెంట్రల్ అటానమస్ బాడీస్ లో పనిచేసే ఉద్యోగులకు తమ సొంత ఆర్థిక నిర్ణయాలు తీసుకునేందుకు మరింత స్వేచ్ఛను ఇవ్వడమే. దీనివల్ల ఉద్యోగులు తమ వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలు, రిటైర్మెంట్ అవసరాలకు తగినట్లుగా పెన్షన్ ఫండ్‌ను మలచుకోవచ్చు. ఈ సరికొత్త ఆప్షన్ల వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) స్కీమ్ మునుపటి కంటే చాలా సురక్షితంగా, మరింత లాభదాయకంగా, ఆకర్షణీయంగా మారనుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

