Inflation : సామాన్యుడికి ఊరట.. 14 నెలల కనిష్టానికి టోకు ధరలు
14 నెలల కనిష్టానికి టోకు ధరలు

Inflation : ఏ వస్తువు కొనాలన్నా ధరలు చూసి షాక్ తిని తిని విసిగిపోయిన జనాలకు ఒక శుభవార్త. దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. ముఖ్యంగా టోకు ద్రవ్యోల్బణం మే నెలలో భారీగా తగ్గి, 14 నెలల కనిష్ట స్థాయికి చేరుకుందట. అంటే, ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో ధరలు బాగా తగ్గాయని అర్థం. ఏప్రిల్‌లో 0.85 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం, మే నెలలో ఏకంగా 0.39 శాతానికి పడిపోయిందట. దీంతో సామాన్యుడి జేబుకు పెద్ద ఊరట లభించబోతోంది. మరి ఏ వస్తువుల ధరలు తగ్గాయో వివరంగా తెలుసుకుందాం.
14 నెలల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం
టోకు ద్రవ్యోల్బణం 14 నెలల కనిష్ట స్థాయికి చేరుకోవడం వల్ల సామాన్యుడికి చాలా ఊరట లభిస్తుంది. ముఖ్యంగా తినే ఆహార వస్తువులు, నిత్యావసర సరుకుల ధరలు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం తగ్గింది. దీనికి ముందు మార్చి 2024లో టోకు ద్రవ్యోల్బణం 0.26 శాతంగా ఉంది. ఇక ఏప్రిల్ నెలలో టోకు ద్రవ్యోల్బణం 2.05 శాతం నుంచి 0.85 శాతానికి తగ్గింది. ఇప్పుడు మే నెలలో మరింత తగ్గి, 0.39 శాతానికి చేరింది.
ఏ వస్తువుల ధరలు తగ్గాయి?
ఆహార, పానీయాల వస్తువుల ధరలు తగ్గడం టోకు ద్రవ్యోల్బణం డేటాలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం 2.55% నుంచి 1.72%కి తగ్గింది.ఇంధనం, విద్యుత్ టోకు ద్రవ్యోల్బణం -2.18% నుంచి -2.27%కి పడిపోయింది. తయారీ ఉత్పత్తుల టోకు ద్రవ్యోల్బణం 2.62% నుంచి 2.04%కి తగ్గింది.
రిటైల్ ద్రవ్యోల్బణంలోనూ తగ్గుదల
టోకు ద్రవ్యోల్బణం గణాంకాలకు ముందే ప్రభుత్వం రిటైల్ ద్రవ్యోల్బణం వివరాలను విడుదల చేసింది. జూన్ 12న విడుదల చేసిన డేటా ప్రకారం.. మే 2025లో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం 2.82%కి తగ్గింది, ఇది గత ఆరు సంవత్సరాలలోకెల్లా అత్యంత కనిష్ట స్థాయి. దీనికి ముందు మార్చి 2019లో ఇది 2.86%గా ఉంది. ఆహార పదార్థాల ధరలు నిరంతరం తగ్గడం వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం కూడా తగ్గింది. ఏప్రిల్ 2025లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.16% కాగా, మార్చిలో ఇది 3.34%గా ఉంది, ఇది 67 నెలల కనిష్ట స్థాయి. ఫిబ్రవరి నుండి రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశించిన 4% లక్ష్యం కంటే దిగువనే కొనసాగుతోంది.
ద్రవ్యోల్బణాన్ని ఎలా కొలుస్తారు?
రిటైల్, టోకు ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి వేర్వేరు ఉత్పత్తులను ప్రామాణికంగా తీసుకుంటారు. ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి వివిధ వస్తువులను కలుపుతారు. ఉదాహరణకు:
టోకు ద్రవ్యోల్బణం: ఇందులో తయారు చేసిన ఉత్పత్తుల వాటా 63.75%, ప్రాథమిక వస్తువులైన ఆహార పదార్థాల వాటా 22.62%, ఇంధనం, శక్తి వాటా 13.15% ఉంటాయి.
రిటైల్ ద్రవ్యోల్బణం: ఇందులో ఆహార పదార్థాలు, ఉత్పత్తుల వాటా 45.86%, గృహనిర్మాణం వాటా 10.07%, ఇంధనంతో సహా ఇతర వస్తువుల వాటా కూడా ఉంటాయి.
మొత్తంగా, ద్రవ్యోల్బణం తగ్గడం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా సామాన్య ప్రజలకు శుభవార్త. ఇది ధరల స్థిరత్వానికి సూచనగా భావించవచ్చు.
