విశాఖపట్నంలో డేటా సెంటర్, సబ్ సీ గేట్‌వే ఏర్పాటు

Google : ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ భారతదేశంలో ఒక చారిత్రక పెట్టుబడి ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, భారీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సదుపాయాల కోసం గూగుల్ రాబోయే ఐదేళ్లలో ఏకంగా 15 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.25 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. అమెరికా వెలుపల ఒక కంపెనీ నిర్మిస్తున్న అతిపెద్ద AI హబ్‌లలో ఇది ఒకటి కావడం విశేషం. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్ట్‌ను స్వాగతించారు.

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి ఈ ప్రతిపాదిత వైజాగ్ AI హబ్ వివరాలను పంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో గిగావాట్ స్థాయి కంప్యూటింగ్ సామర్థ్యం, కొత్త అంతర్జాతీయ సబ్-సీ గేట్‌వే (సముద్రగర్భ కేబుల్ వ్యవస్థ), భారీ విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. గూగుల్ వినూత్న సాంకేతికత భారతదేశంలోని వివిధ పరిశ్రమలకు, వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని, ఇది దేశవ్యాప్తంగా AI ఆవిష్కరణలను, అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ ద్వారా పంచుకున్నారు.

గూగుల్ భారీ AI హబ్ నిర్మాణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ పెట్టుబడి వికసిత భారత్ నిర్మాణ లక్ష్యానికి పూర్తి మద్దతుగా ఉంటుందని ఆయన తెలిపారు. అత్యాధునిక సాధనాల ద్వారా AI ఫలాలు దేశ ప్రజలందరికీ అందుబాటులోకి వస్తాయని, ఇది భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు సహాయకారిగా ఉంటుందని, తద్వారా భారత్ గ్లోబల్ టెక్నాలజీ లీడర్‌గా నిలబడగలదని మోదీ 'ఎక్స్' పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఈ AI హబ్ నిర్మాణంలో గూగుల్, భారతీ ఎయిర్‌టెల్ సంస్థలు సంయుక్తంగా భాగస్వామ్యం వహించనున్నాయి. విశాఖపట్నంలో భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌ను, భారీ డేటా సెంటర్‌ను ఈ రెండు సంస్థలు కలిసి ఏర్పాటు చేస్తాయి. ముఖ్యంగా, గూగుల్ కొత్త అంతర్జాతీయ సముద్రగర్భ కేబుల్‌లకు మద్దతుగా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కూడా నిర్మించబడుతుంది. ఇది గూగుల్ ప్రపంచ నెట్‌వర్క్‌కు మరింత బలాన్ని చేకూరుస్తుంది.

గూగుల్ క్లౌడ్స్ సీఈఓ థామస్ కురియన్, ఈ భారీ AI సౌకర్యం, గూగుల్ క్లౌడ్ ఫెసిలిటీ, సబ్-సీ కేబుల్ ల్యాండింగ్, గ్లోబల్ కన్స్యూమర్ సర్వీసెస్ డేటా స్టోరేజ్ ఏర్పాటు చేసే ప్రణాళికలను అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌ను ఢిల్లీలో జరిగిన భారత్​ఏఐశక్తి కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story