Cyber Attack: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన పనులను ఎంత సులభతరం చేస్తోందో, సైబర్ నేరగాళ్లకు అంతే ప్రమాదకరమైన ఆయుధంగా మారుతోంది. ఇప్పటివరకు హ్యాకర్లు చిన్నపాటి పనులకు మాత్రమే ఏఐ సాయం తీసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని టెక్ దిగ్గజం గూగుల్ సంచలన హెచ్చరిక జారీ చేసింది. మనుషుల సాయం ఏమాత్రం లేకుండానే సాఫ్ట్‌వేర్ లోపాలను గుర్తించి, వాటంతట అవే సైబర్ దాడులకు పాల్పడే కొత్త రకం ఏఐ ఏజెంట్లు రంగంలోకి దిగాయని గూగుల్ స్పష్టం చేసింది.

పాత, కొత్త కోడ్‌లను పోల్చి చూస్తూ దాడి చేస్తున్న విధానం

గూగుల్ త్రెట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ (GTIG) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఎక్స్‌ప్లాయిట్ ఏజెంట్ అనే ప్రమాదకరమైన వ్యవస్థను గుర్తించింది. ఇది నిరంతరం పాపులర్ సాఫ్ట్‌వేర్‌లు, వాటి కొత్త సెక్యూరిటీ అప్‌డేట్‌లపై కన్నేసి ఉంచుతుంది. ఏదైనా కంపెనీ సెక్యూరిటీ లోపాన్ని సరిదిద్దుతూ కొత్త అప్‌డేట్ విడుదల చేయగానే, ఈ ఏఐ సిస్టమ్ పాత కోడ్‌ను కొత్త కోడ్‌తో పోల్చి చూస్తుంది. తద్వారా ఆ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న బలహీనత ఏమిటో క్షణాల్లో పసిగడుతుంది. ఆ తర్వాత ఇంకా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోని కంపెనీలను లక్ష్యంగా చేసుకుని నేరుగా దాడులకు ప్లాన్ చేస్తోంది.

ఫ్రాన్స్ వెబ్‌సైట్లే లక్ష్యంగా సాగిన ఏఐ హ్యాకింగ్ వ్యూహం

భద్రత సరిగా లేని ఒక సర్వర్‌లో ఈ ప్రమాదకర ఏఐ ఫ్రేమ్‌వర్క్‌ను గూగుల్ పరిశోధకులు కనుగొన్నారు. అక్కడ అనేక పెద్ద ఏఐ మోడల్స్ అనుసంధానమై పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఆ సర్వర్‌లో నెట్‌వర్క్‌లను తనిఖీ చేసే స్క్రిప్ట్‌లు, సైబర్ దాడులకు సంబంధించిన కీలక డేటా లభించింది. ముఖ్యంగా ఫ్రాన్స్ దేశానికి చెందిన మీడియా, వినోద, విద్యా రంగాలకు సంబంధించిన వెబ్‌సైట్లను లక్ష్యంగా చేసుకునేందుకు ఈ ఏఐ వ్యవస్థ ఎక్కువ ఆసక్తి చూపినట్లు నివేదిక వెల్లడించింది.

దాడులను అడ్డుకోవాలంటే ఏఐ రక్షణే శరణ్యం

హ్యాకర్ల ఆలోచనలు కొత్తవి కాకపోయినా, ఏఐ తోడవడంతో దాడుల వేగం ఊహించని స్థాయికి చేరిందని గూగుల్ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ప్రింట్ మేనేజ్‌మెంట్ సర్వర్ లోపాలను ఏఐ సాయంతో కేవలం ఒక్క రోజులోనే హ్యాకింగ్ టూల్స్‌గా మార్చి వందలాది సంస్థలపై దాడులకు ప్రయత్నించారు. యంత్రాల వేగంతో సైబర్ దాడులు జరుగుతున్న ఈ తరుణంలో, కంపెనీలు కూడా తమ రక్షణ వ్యవస్థల్లో ఏఐ టెక్నాలజీని మరింత వేగంగా వినియోగించుకోవాలని, సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని గూగుల్ సూచిస్తోంది.

Next Story