Google: గూగుల్ సృష్టించిన నకిలీ ఇంటర్నెట్ ప్రపంచం.. షాపింగ్ నుంచి బ్యాంకింగ్ వరకు అన్నీ అక్కడే
బ్యాంకింగ్ వరకు అన్నీ అక్కడే

Google: మీరు చెప్పకుండానే ఆన్‌లైన్‌లో వస్తువులు వెతికి కొనడం, వెబ్‌సైట్లలో వివరాలు నమోదు చేయడం, బ్యాంకింగ్ పనులు చేయడం.. భవిష్యత్తులో ఏఐ ఏజెంట్లు ఇలాంటి పనులు చేయగలవు. అయితే వాటికి నిజమైన ఇంటర్నెట్‌లోనే శిక్షణ ఇస్తే వ్యక్తిగత ఖాతాలు, డేటాకు ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా గూగుల్ ‘మిర్రర్ డైమెన్షన్’ పేరుతో ఓ నకిలీ డిజిటల్ ప్రపంచాన్ని రూపొందించింది. అసలు వెబ్‌సైట్లను పోలిన వాతావరణంలో ఏఐని పరీక్షిస్తూ, తప్పులు చేయకుండా తీర్చిదిద్దడమే దీని లక్ష్యం.
మిర్రర్ డైమెన్షన్ అనేది నిజమైన ఇంటర్నెట్‌కు ప్రత్యామ్నాయం కాదు. ఏఐ ఏజెంట్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి, వాటి పనితీరును పరీక్షించడానికి గూగుల్ ప్రత్యేకంగా రూపొందించిన ప్రయోగశాల. ఇందులో ఆన్‌లైన్ షాపింగ్ దుకాణాలు, సామాజిక మాధ్యమాల పేజీలు, వంటకాల వెబ్‌సైట్లు, స్థానిక వ్యాపారాల వివరాలు, బ్యాంకింగ్ ఖాతాల తెరలు ఉంటాయి. ఏఐ ఏజెంట్ ఒక వెబ్‌సైట్‌ను తెరిచి బటన్ నొక్కడం, వివరాలు నమోదు చేయడం, వస్తువులను ఎంపిక చేయడం వంటి పనులు చేస్తుంది. అయితే ఇవన్నీ నిజమైన ఖాతాల్లో కాకుండా నకిలీ వెబ్‌సైట్లలోనే జరుగుతాయి. ప్రతి పరీక్ష పూర్తయిన తర్వాత వ్యవస్థను మళ్లీ మొదటి స్థితికి తీసుకువస్తారు. దీంతో ఒక పరీక్షలో చేసిన పనుల ప్రభావం మరో పరీక్షపై ఉండదు.
అసలు వెబ్‌సైట్లలో ఏఐకి శిక్షణ ఇవ్వడం ఎందుకు కష్టం?
నిజమైన వెబ్‌సైట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఒక రోజు కనిపించిన బటన్ మరో రోజు వేరే చోట ఉండొచ్చు. వెబ్‌సైట్ రూపం మారితే ఒకే పరీక్షను మళ్లీ అదే విధంగా నిర్వహించడం కష్టమవుతుంది. అంతేకాదు, ఏఐ పొరపాటున నిజమైన ఖాతాలో ఏదైనా మార్పు చేస్తే వినియోగదారుడికి నష్టం కలగవచ్చు. మరో సమస్యను గూగుల్ ‘ఎవాల్ అవేర్‌నెస్’గా పేర్కొంది. అంటే తనను పరీక్షిస్తున్నారని ఏఐ గుర్తిస్తే సాధారణంగా ప్రవర్తించకుండా, పరీక్షకు అనుగుణంగా జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. అప్పుడు నిజమైన ఇంటర్నెట్‌లో అది ఎలా పనిచేస్తుందో అంచనా వేయడం కష్టం. ఈ సమస్యలన్నింటినీ అధిగమించేందుకు గూగుల్ నకిలీ వెబ్ ప్రపంచాన్ని సిద్ధం చేసింది.
అసలు చిరునామాల్లాగే కనిపించే వెబ్‌సైట్లు
ఈ సిస్టమ్ రూపొందించేందుకు గూగుల్ జీశాండ్బాక్స్ అనే భద్రతా సాధనాన్ని ఉపయోగించింది. ఏఐ ఏజెంట్ సాధారణంగా ఒక వెబ్‌సైట్ చిరునామాను తెరిచినప్పుడు, ఆ అభ్యర్థన నిజమైన ఇంటర్నెట్‌కు వెళ్లకుండా ప్రత్యేక వ్యవస్థ ద్వారా నకిలీ వెబ్‌సైట్‌కు మళ్లుతుంది. అయితే బ్రౌజర్‌లో మాత్రం అసలు వెబ్‌సైట్ చిరునామానే కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల ఏఐకి తాను పరీక్షా వాతావరణంలో ఉన్నాననే అనుమానం రాకుండా చూస్తారు. దీనికోసం గూగుల్ ప్రత్యేక భద్రతా ధ్రువపత్రాలను కూడా ఉపయోగించింది. ఈ విధానం గూగుల్ పూర్తిగా నియంత్రించే ప్రత్యేక పరీక్షా వాతావరణంలోనే పనిచేస్తుంది. సాధారణ వినియోగదారుల బ్రౌజర్‌లలో ఇతరులు ఇలాగే వెబ్‌సైట్లను మళ్లించగలరని దీని అర్థం కాదు.
ఏఐతోనే వేలాది నకిలీ వెబ్‌సైట్ల తయారీ
ఇన్ని వెబ్‌సైట్లను మనుషులతో తయారు చేయడం చాలా సమయం తీసుకునే పని. అందుకే గూగుల్ మరో ఏఐ ఏజెంట్ల బృందాన్ని రంగంలోకి దించింది. ఇందులో మొదటి బృందం వెబ్‌సైట్ ఎలా ఉండాలి? అందులో ఏయే సదుపాయాలు ఉండాలి? అనే ప్రణాళిక సిద్ధం చేస్తుంది. రెండో బృందం దానికి అవసరమైన కోడ్ రాసి వెబ్‌సైట్‌ను తయారు చేస్తుంది. మూడో బృందం ఆ వెబ్‌సైట్‌ను తెరిచి బటన్లు, ఫారాలు, ఇతర సదుపాయాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో పరిశీలిస్తుంది. సమస్యలు కనిపిస్తే వాటిని సరిచేసి మళ్లీ పరీక్షిస్తుంది. ఈ విధంగా షాపింగ్ దుకాణాలు, సామాజిక మాధ్యమాల పేజీలు, వంటకాల వెబ్‌సైట్లు, బ్యాంకింగ్ తెరలు వంటి అనేక నమూనాలను రూపొందిస్తున్నారు.
ఏఐని మోసం చేసే సైబర్ దాడులపై టెస్టులు
ఈ ప్రాజెక్టులో మరో కీలక లక్ష్యం ‘ప్రాంప్ట్ ఇంజెక్షన్’ దాడుల నుంచి ఏఐని కాపాడటం. కొందరు సైబర్ నేరగాళ్లు వెబ్‌సైట్లలోని అక్షరాలు, చిత్రాలు లేదా ఇతర భాగాల్లో రహస్య ఆదేశాలను దాచిపెడతారు. వాటిని చదివిన ఏఐ తనకు వినియోగదారుడు ఇచ్చిన అసలు సూచనలను పక్కనపెట్టి, దాడి చేసేవారి మాట వినే ప్రమాదం ఉంటుంది. ఉదాహరణకు వ్యక్తిగత వివరాలను బయటపెట్టడం లేదా అనుమతి లేని పనులు చేయడం వంటి ముప్పులు ఎదురుకావచ్చు. మిర్రర్ డైమెన్షన్‌లో ఇలాంటి ప్రమాదకర పరిస్థితులను కావాలనే సృష్టించి ఏఐ వాటిని ఎలా …

