Aadhaar : కేంద్రం సంచలన నిర్ణయం.. కోట్లాది ఆధార్ కార్డులు బ్లాక్.. మాయగాళ్ల ఆటలకు ఇక చెక్
కోట్లాది ఆధార్ కార్డులు బ్లాక్.. మాయగాళ్ల ఆటలకు ఇక చెక్

Aadhaar : ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ వ్యవస్థ అయిన ఆధార్ భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు దాదాపు 2.5 కోట్ల ఆధార్ కార్డులను ప్రభుత్వం డీయాక్టివేట్ చేసింది. ఈ కార్డులన్నీ మరణించిన వ్యక్తుల పేరిట ఉన్నవని ప్రభుత్వం స్పష్టం చేసింది. డేటాబేస్‌ను క్లీన్ చేయడం ద్వారా ఎవరూ కూడా చనిపోయిన వారి ఆధార్ నంబర్లను వాడుకుని మోసాలకు పాల్పడకుండా చూడటమే ఈ చర్య వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ బుధవారం లోక్‌సభలో ఈ కీలక సమాచారాన్ని వెల్లడించారు.
సాధారణంగా ఒక వ్యక్తి మరణించిన తర్వాత వారి ఆధార్ కార్డు యాక్టివ్‌గా ఉండటం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. మృతుల ఆధార్ నంబర్లను ఉపయోగించి కొందరు కేటుగాళ్లు బ్యాంక్ ఖాతాలు తెరవడం, కొత్త సిమ్ కార్డులు తీసుకోవడం లేదా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అక్రమంగా పొందడం వంటివి చేస్తున్నారు. ఈ రకమైన గుర్తింపు దొంగతనాలకు అడ్డుకట్ట వేయాలంటే మృతుల కార్డులను తొలగించడం తప్పనిసరి అని ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం దేశంలో దాదాపు 134 కోట్ల మందికి పైగా యాక్టివ్ ఆధార్ కార్డుదారులు ఉండటంతో, ఇంత పెద్ద వ్యవస్థను అప్‌డేట్ చేయడం సవాల్‌గా మారింది.
ఆధార్ భద్రతను పెంచేందుకు ప్రభుత్వం కేవలం కార్డుల రద్దుతోనే ఆగలేదు. అత్యాధునిక సాంకేతికతను కూడా జోడించింది. ఫేస్ ఆథెంటికేషన్ లో ఇప్పుడు లైవ్‌నెస్ డిటెక్షన్ అనే ఫీచర్‌ను తెచ్చింది. అంటే ఫోటోలు లేదా వీడియోలు చూపించి ఆధార్‌ను వాడటం సాధ్యపడదు, నిజమైన వ్యక్తి ఎదురుగా ఉంటేనే అది పనిచేస్తుంది. అలాగే, ప్రజలు తమ బయోమెట్రిక్ సమాచారాన్ని (వేలిముద్రలు, ఐరిస్) తమకు అవసరం లేనప్పుడు లాక్ చేసుకునే సౌకర్యాన్ని కూడా కల్పించారు. దీనివల్ల ఎవరూ మీ అనుమతి లేకుండా మీ ఆధార్‌ను దుర్వినియోగం చేయలేరు.
ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ సమాచారాన్ని ఆధార్ డేటాబేస్‌కు చేరవేయడం గతంలో కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఒక కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే ఆ విషయాన్ని సులభంగా తెలియజేయవచ్చు. అన్ని ప్రభుత్వ సంస్థలు కూడా ఆధార్ డేటాను అత్యంత సురక్షితమైన ఎన్‌క్రిప్టెడ్ రూపంలో దాచాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తం ప్రక్రియ వల్ల ఆధార్ వ్యవస్థ మరింత పారదర్శకంగా, నమ్మదగ్గదిగా మారుతుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.

