SIM Binding Rules: దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులు, మోసపూరిత మెసేజ్‌లకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఓటీటీ మెసేజింగ్ యాప్‌ల వినియోగంలో అత్యంత పటిష్టమైన భద్రతా ప్రమాణాలు తీసుకొచ్చేందుకు సిమ్ బైండింగ్ నిబంధనను అమల్లోకి తేనుంది. జనవరి 1, 2027 నుంచి వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్రముఖ మెసేజింగ్ యాప్‌లు పనిచేయాలంటే, ఆ ఖాతాకు లింక్ అయిన యాక్టివ్ సిమ్ కార్డ్ ఖచ్చితంగా ఆ మొబైల్ ఫోన్‌లోనే ఉండాల్సి ఉంటుంది. మొబైల్ నంబర్లను దుర్వినియోగం చేస్తూ అమాయకులను దోచుకుంటున్న ముఠాల ఆటకట్టించడమే ఈ నిర్ణయ ప్రధాన ఉద్దేశం.

అసలు ఏమిటీ సిమ్ బైండింగ్ నిబంధన?

సాధారణంగా ప్రస్తుతం అనేక మెసేజింగ్ యాప్‌లలో ఒకసారి ఓటీపీ ద్వారా ఖాతా వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, ఆ ఫోన్ నుంచి సిమ్ కార్డు తీసివేసినా లేదా వేరే నంబర్ మార్చినా యాప్ యథావిధిగా పనిచేస్తూనే ఉంటుంది. సైబర్ నేరగాళ్లు ఈ వెసులుబాటును ఆసరాగా చేసుకుని విదేశాల్లో లేదా ఇతర ప్రాంతాల్లో ఉంటూ నకిలీ నంబర్లతో అకౌంట్లు నడుపుతున్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తీసుకొస్తున్న కొత్త నిబంధన ప్రకారం.. యాప్‌తో అనుసంధానమైన సిమ్ కార్డు ఫోన్ నుంచి తొలగిస్తే ఆటోమేటిక్‌గా అకౌంట్ సర్వీసులు నిలిచిపోతాయి. యాప్ అకౌంట్, సదరు మొబైల్ నంబర్ నిరంతరం ఒకదానికొకటి అనుసంధానమై ఉండేలా టెక్నాలజీని రూపొందిస్తున్నారు.

నిబంధన అమలు గడువు వివరాలు

కేంద్ర టెలికం శాఖ వాట్సాప్, టెలిగ్రామ్ వంటి దిగ్గజ సంస్థలకు సిమ్ బైండింగ్ అమలు చేయడానికి తొలుత 90 రోజుల సమయం ఇచ్చినప్పటికీ, సాంకేతిక మార్పులు చేయడానికి గడువు పొడిగించారు. కంపెనీలకు అవసరమైన సిస్టమ్ అప్‌డేట్లు చేసుకోవడానికి డిసెంబర్ 31, 2026 వరకు తుది గడువు నిర్దేశించారు. ఈ క్రమంలో జనవరి 1, 2027 నుంచి అన్ని మెసేజింగ్ యాప్‌లలో ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. కేవలం వాట్సాప్, టెలిగ్రామ్ మాత్రమే కాకుండా స్నాప్‌చాట్, సిగ్నల్, షేర్‌చాట్, జోష్, జియోచాట్ వంటి ప్రముఖ సోషల్ మీడియా వేదికలకు కూడా ఈ రూల్ వర్తిస్తుంది.

వినియోగదారులు తెలుసుకోవాల్సిన విషయాలు

ఈ నూతన మార్గదర్శకాల వల్ల సాధారణ వినియోగదారులు భయపడాల్సిన పనిలేదు కానీ కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు తప్పనిసరి. మీరు ఉపయోగిస్తున్న మెసేజింగ్ అకౌంట్ సిమ్ కార్డ్ అదే ఫోన్లో ఉండేలా చూసుకోవాలి. అలాగే వాట్సాప్ వెబ్ ఉపయోగించే వారి కోసం కూడా భద్రతా మార్పులు చేశారు. లాగౌట్ నిబంధనలను రిస్క్ ఆధారంగా రూపొందించనున్నారు. ప్రతి ఆరు గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా లాగౌట్ అయ్యే విధానం కాకుండా, సెక్యూర్ సెషన్ ప్రాతిపదికన ఇది పనిచేస్తుంది. అపరిచిత లింక్‌లు క్లిక్ చేయకుండా, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోకుండా ఉండటం ద్వారా సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.

Next Story