Mobile Covers: చైనా మొబైల్ కవర్లపై కేంద్ర ప్రభుత్వ కన్ను.. త్వరలో భారీ యాంటీ డంపింగ్ డ్యూటీ!
భారీ యాంటీ డంపింగ్ డ్యూటీ!

Mobile Covers: మార్కెట్లో విరివిగా లభించే చైనా దేశపు అతి చౌకైన మొబైల్ కవర్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మన దేశంలోకి విపరీతంగా వస్తున్న మొబైల్ కవర్ల కారణంగా స్థానిక పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ సమస్యను నివారించడానికి వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ సంస్థ రంగంలోకి దిగింది. చైనా నుంచి దిగుమతి అయ్యే మొబైల్ కవర్లపై సుమారు ఐదేళ్ల పాటు యాంటీ డంపింగ్ డ్యూటీ విధించాలని ప్రభుత్వాన్ని సిఫార్సు చేసింది. ఈ నిబంధన అమలైతే ప్రతి వెయ్యి కవర్లపై 72 డాలర్ల అదనపు సుంకం పడే అవకాశం ఉంది. దీనిద్వారా ఒక్కో కవర్‌పై సుమారు రూ.7ల వరకు అదనపు భారం పడొచ్చని అంచనా వేస్తున్నారు.
చైనా కవర్లు అంత చౌకగా మారడానికి అసలు కారణాలు
ఈ వివాదానికి ప్రధాన కారణం మన దేశంలోని మొబైల్ కవర్ల తయారీ కంపెనీలు ఇచ్చిన ఫిర్యాదులే. చైనా నుంచి అత్యంత తక్కువ ధరకు క్వాలిటీ లేని లేదా భారీ రాయితీలతో కూడిన కవర్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయని స్థానిక సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. డీజీటీఆర్ జరిపిన సమగ్ర విచారణలో ఈ విషయాలు నిజమని తేలాయి. గత ఆర్థిక సంవత్సరాల్లో చైనా నుంచి భారత్‌కు వచ్చే కవర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఉదాహరణకు 2021-22 సంవత్సరంలో సుమారు 10 లక్షల కవర్లు రాగా, 2023-24 నాటికి ఆ సంఖ్య ఏకంగా 7 కోట్ల 65 లక్షలకు ఎగబాకింది. అంతేకాకుండా 2021-22లో ఒక్కో చైనా కవర్ సగటు ధర రూ.18 ఉండగా, 2024-25 నాటికి అది కేవలం రూ.2.14కి పడిపోయింది.
భారతీయ తయారీ పరిశ్రమలపై తీవ్ర ప్రభావం
చైనా నుంచి వస్తున్న ఈ చౌకైన ఉత్పత్తుల వల్ల మన దేశంలోని లోకల్ తయారీదారులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. మార్కెట్లో భారతీయ కంపెనీల వాటా గతంలో 98 శాతంగా ఉండగా, అది కాస్తా పడిపోయి ఇప్పుడు కేవలం 49 శాతానికి పరిమితమైంది. మరోవైపు చైనా కవర్ల మార్కెట్ వాటా కేవలం 2 శాతాల నుంచి ఏకంగా 51 శాతానికి పెరిగింది. మన దేశంలో నలభైకి పైగా మొబైల్ కవర్ల తయారీ యూనిట్లు ఉండగా, వాటిలో సుమారు 10 యూనిట్లు మూతపడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మిగిలిన కంపెనీలు కూడా తమ పూర్తి ఉత్పత్తి సామర్థ్యంలో కనీసం మూడో వంతు భాగం మాత్రమే పనిచేస్తూ సరుకు అమ్ముకోలేక సతమతమవుతున్నాయి.
ప్రతిపాదిత డ్యూటీ వివరాలు
ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ ప్రతిపాదన అందరిపై ఒకేలా వర్తించదు. నిబంధనల ప్రకారం నడుచుకుంటున్న చైనాకు చెందిన రెండు నిర్దిష్ట కంపెనీలను ఈ సుంకం నుంచి మినహాయించారు. అలాగే అరామిడ్ ఫైబర్‌తో తయారు చేసే అత్యంత ఖరీదైన మొబైల్ కవర్లపై కూడా ఈ డ్యూటీ ప్రభావం ఉండదు, ఎందుకంటే అలాంటి కవర్లను మన దేశంలో పెద్దగా తయారు చేయరు. అయితే కొన్ని ప్రత్యేక పారదర్శక కవర్లను కూడా మినహాయించాలని స్పైజెన్ వంటి కొన్ని కంపెనీలు కోరినప్పటికీ, డీజీటీఆర్ ఆ విజ్ఞప్తిని ఆమోదించలేదు.
తుది వినియోగదారులపై ధరల ప్రభావం ఎంత?
ఈ అదనపు సుంకం విధిస్తే సామాన్య కస్టమర్ల జేబులకు చిల్లు పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతి కవర్‌పై సుమారు 7 రూపాయల వరకు అదనపు ఛార్జ్ పడే అవకాశం ఉన్నప్పటికీ, మార్కెట్లో విక్రయించే తుది ధరలపై దీని ప్రభావం ఒక శాతం కంటే తక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే దీనివల్ల మొబైల్ కవర్ల ధరలు భారీగా పెరిగే అవకాశం లేదు. అయితే డీజీటీఆర్ ప్రస్తుతం కేవలం సిఫార్సు మాత్రమే చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనిని పూర్తిగా పరిశీలించి ఆమోద ముద్ర వేసి అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తేనే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.

