LPG : గ్యాస్ సిలిండర్లలో కోత.. ఇకపై 14.2 కిలోలకు బదులు 10 కిలోలేనా? ప్రభుత్వ సంస్థల సరికొత్త ప్లాన్
ఇకపై 14.2 కిలోలకు బదులు 10 కిలోలేనా? ప్రభుత్వ సంస్థల సరికొత్త ప్లాన్

LPG : పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలై 22 రోజులు దాటిపోయింది. ఇరు దేశాల మధ్య దాడులు ఆగకపోవడంతో అంతర్జాతీయంగా గ్యాస్ సరఫరా వ్యవస్థ చిన్నాభిన్నమైంది. భారత్ తన అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతున్న తరుణంలో, సామాన్యుల వంటగదిపై ఈ యుద్ధ ప్రభావం పడకుండా ఉండేందుకు ప్రభుత్వ రంగ గ్యాస్ కంపెనీలు ఒక సాహసోపేతమైన బిగ్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాయి. అందుబాటులో ఉన్న గ్యాస్ నిల్వలను అందరికీ సమానంగా పంచేందుకు సిలిండర్ల బరువును తగ్గించే యోచనలో ఉన్నాయి.
ఏమిటా కొత్త ప్లాన్?
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. దేశంలో గ్యాస్ కొరత ఏర్పడకుండా ఉండేందుకు గ్యాస్ కంపెనీలు ఒక ప్రతిపాదనను సిద్ధం చేశాయి. ప్రస్తుతం మనం వాడుతున్న స్టాండర్డ్ సిలిండర్ బరువు 14.2 కిలోలు. ఇది సగటున ఒక ఇంట్లో 35 నుంచి 40 రోజులు వస్తుంది. అయితే, గ్యాస్ సరఫరా తగ్గడంతో ఎక్కువ మందికి సిలిండర్లు అందించడానికి, అదే 14.2 కిలోల సిలిండర్‌లో కేవలం 10 కిలోల గ్యాస్‌ను మాత్రమే నింపి పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ఈ 10 కిలోల గ్యాస్ ఒక కుటుంబానికి సుమారు ఒక నెల పాటు సరిపోతుంది. దీనివల్ల నిల్వ ఉన్న గ్యాస్‌ను ఎక్కువ మంది వినియోగదారులకు పంపే అవకాశం ఉంటుంది.
ధర తగ్గుతుందా?
ఒకవేళ ఈ పద్ధతిని అమలు చేస్తే, సిలిండర్లపై ఒక ప్రత్యేక స్టిక్కర్‌ను అంటిస్తారు. అందులో గ్యాస్ బరువు తక్కువగా ఉందని స్పష్టంగా పేర్కొంటారు. దీనికి అనుగుణంగా సిలిండర్ ధరను కూడా తగ్గిస్తారు. అంటే 14.2 కిలోల రేటు కంటే 10 కిలోల రేటు తక్కువగా ఉంటుంది. అయితే దీని కోసం బాట్లింగ్ ప్లాంట్లలోని బరువు తూచే యంత్రాలను మళ్ళీ సెట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి కొన్ని చట్టపరమైన అనుమతులు కూడా అవసరమవుతాయి. ఇప్పటికే గ్యాస్ వినియోగం 17 శాతం పడిపోయిన నేపథ్యంలో, ఈ నిర్ణయం అనివార్యమని కంపెనీలు భావిస్తున్నాయి.
రాజకీయ సెగలు.. ప్రజల ఆందోళన
గ్యాస్ సరఫరాలో అకస్మాత్తుగా ఇటువంటి మార్పులు చేస్తే ప్రజల్లో గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉందని అధికారులకు ఆందోళన ఉంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఇది రాజకీయ దుమారానికి దారి తీయవచ్చని భావిస్తున్నారు. అయితే, హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే లేదా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నట్లుగా ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులు జరిగితే, సరఫరా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. వచ్చే నెలలో గ్యాస్ లభ్యత ఇంకా తగ్గే అవకాశం ఉందని, అప్పుడు ఈ పద్ధతిని అమలు చేయడం మినహా మరో మార్గం ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత్‌లో ఎల్‌పీజీ వినియోగం ఎలా ఉంది?
భారతదేశం తన మొత్తం ఎల్‌పీజీ అవసరాలలో 60 శాతాన్ని దిగుమతుల ద్వారానే పొందుతోంది. గల్ఫ్ యుద్ధానికి ముందు వరకు మన దిగుమతులలో 90 శాతం ఈ గల్ఫ్ దేశాల నుంచే వచ్చేవి. దేశంలో రోజువారీ ఎల్‌పీజీ వినియోగం 93,500 టన్నులు కాగా, అందులో 86 శాతం (80,400 టన్నులు) కేవలం ఇళ్లలోనే వాడుతున్నారు. అంటే హోమ్ డెలివరీ అనేది చాలా కీలకమైన అంశం. ఒకవేళ గ్యాస్ సరఫరా ఆగిపోతే అది దేశీయంగా పెద్ద సంక్షోభానికి దారి తీస్తుంది. అందుకే అదనపు నిల్వలను సమీకరించుకుంటూనే, ఉన్న గ్యాస్‌ను పొదుపుగా వాడాలని కంపెనీలు నిర్ణయించుకున్నాయి.

