Flight Fare: ఆకాశంలో ఎగరడం కాస్త కాస్ట్లీ.. టికెట్ రేట్లు పెంచేస్తున్న ఎయిర్‌లైన్స్
ఎయిర్‌లైన్స్

Flight Fare: విమాన ఇంధన (ATF) ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ విమాన ప్రయాణికులకు ఊరట నిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగుతోంది. జెట్ ఫ్యూయల్ ధరల పెరుగుదలను అరికట్టి విమాన ప్రయాణ ఛార్జీలను స్థిరంగా ఉంచేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో ఇంధన ధరలు భారంగా మారడంతో, సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs), ఎయిర్‌లైన్ ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.
మూడే నెలల్లో 25 శాతం పెంపు
గడిచిన మూడు నెలల కాలంలోనే విమాన ఇంధన ధరలు ఏకంగా 25 శాతం వరకు పెరిగాయి. ఒక్క అక్టోబర్ నెలలోనే జెట్ ఫ్యూయల్ ఛార్జీలు 13 శాతానికి పైగా పెరగడం విశేషం. ఈ వరుస పెంపు వల్ల ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ వంటి దిగ్గజ విమాన సంస్థలతో కూడిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్(FIA) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. విమాన యాన సంస్థల నిర్వాహక వ్యయంలో ఒక్క జెట్ ఫ్యూయల్ వాటాయే 55 నుంచి 60 శాతానికి చేరడంతో కంపెనీల క్యాష్ ఫ్లో దెబ్బతింటోందని ఎఫ్‌ఐఏ ప్రభుత్వానికి తెలిపింది.
ఇంధన ధరల లెక్క మార్చండి
విమాన ఇంధన ధరలను నిర్ణయించే పాత ఫార్ములాను వెంటనే సమీక్షించాలని ఎఫ్‌ఐఏ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. అంతర్జాతీయ ప్రామాణిక ధర ఆధారంగా కాకుండా, అసలు ఉత్పత్తి వ్యయం ప్రాతిపదికన సముచిత లాభాల మార్జిన్‌తో ధరలను నిర్ణయించాలని కోరింది. అంతర్జాతీయంగా చమురు కంపెనీలు బ్యారెల్‌కు తీసుకుంటున్న 60 డాలర్ల అసాధారణ మార్జిన్‌ను తగ్గించి, సాధారణ 10-12 డాలర్ల స్థాయికి తెస్తేనే విమానయాన రంగానికి ఉపశమనం లభిస్తుందని పేర్కొంది.
క్రూడాయిల్ మంటతో క్రేజీగా పెరిగిన రేట్లు!
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ద వాతావరణం వల్ల బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 72 డాలర్ల నుంచి ఏకంగా 118 డాలర్లకు ఎగబాకింది. దీని ప్రభావంతో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధర బ్యారెల్‌కు 87.24 డాలర్ల నుంచి 260.24 డాలర్ల దాకా పెరిగింది. ప్రయాణికులపై భారాన్ని తగ్గించకపోతే కొన్ని నష్టాల్లో నడిచే విమాన మార్గాల్లో సేవలను నిలిపివేయక తప్పదని విమానయాన సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇండిగో ఇప్పటికే ఫ్యూయల్ సర్ఛార్జ్ పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఊరట కలిగించేందుకు కేంద్రం చర్యలు
ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారం పడకుండా ఉండాలంటే విమాన ఇంధనాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం లేదా పన్ను రాయితీలు ఇవ్వడం ఒక్కటే మార్గమని నిపుణులు భావిస్తున్నారు. ఆయిల్ కంపెనీలతో మాట్లాడి సముచితమైన ధర ఉండేలా సమన్వయం సాధించేందుకు కేంద్రం చొరవ చూపుతోంది. విమాన ఛార్జీలు సాధారణ ప్రజలకు అందుబాటులోనే ఉండేలా చూసేందుకు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తామని అధికారులు భరోసా ఇస్తున్నారు.

