Education Loan : ఉన్నత చదువులు చదవాలనుకునే నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. వచ్చే ఏడాది నాటికి దేశవ్యాప్తంగా విద్యా రుణాల పంపిణీని దాదాపు రెట్టింపు చేయాలని నిర్ణయించింది. విద్యా మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ రోడ్‌మ్యాప్‌పై పనిచేస్తున్నాయి. బ్యాంకులు, రాష్ట్ర విద్యా శాఖలు, ఉన్నత విద్యా సంస్థలను అనుసంధానిస్తూ రుణాల మంజూరు ప్రక్రియను అత్యంత వేగవంతం చేయడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.

కాలేజీ క్యాంపస్‌లలోనే బ్యాంక్ క్యాంపులు

విద్యార్థులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 50,000 ఉన్నత విద్యా సంస్థల క్యాంపస్‌లలోనే బ్యాంకులు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయనున్నాయి. దరఖాస్తు చేసుకున్న కేవలం 10 రోజుల్లోనే లోన్ ప్రాసెసింగ్ పూర్తి చేసి స్పాట్‌లోనే అనుమతి ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే దేశంలోని దాదాపు 1,000 ప్రముఖ విద్యా సంస్థల్లో ఈ సదుపాయాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలను కూడా బ్యాంకులు పూర్తిగా మినహాయిస్తున్నాయి.

గ్యారెంటీ లేని రుణ పరిమితి రూ. 20 లక్షలకు పెంపు?

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ స్కీమ్ ఫర్ ఎడ్యుకేషన్ లోన్(CGFSEL) కింద ఎటువంటి గ్యారెంటీ లేకుండా గరిష్టంగా రూ. 7.5 లక్షల వరకు మాత్రమే రుణం లభిస్తోంది. అయితే పెరిగిన చదువుల ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఈ గ్యారెంటీ లేని రుణ పరిమితిని రూ. 20 లక్షలకు పెంచాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా ఉండి, క్రెడిట్ గ్యారెంటీ కవరేజ్‌ను విస్తరించాలని యోచిస్తోంది. అలాగే గ్యారెంటీ కవర్ ఉన్న రుణాలకు కో-అప్లికెంట్ ఉండాలనే నిబంధనను కూడా ఎత్తివేసే ఆలోచనలో ఉన్నారు.

ప్రధానమంత్రి విద్యా లక్ష్మి యోజనకు రూ. 3,600 కోట్లు

మరోవైపు పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి యోజన కింద 2024-25 నుంచి 2030-31 కాలానికి గాను వడ్డీ సబ్సిడీ కోసం ప్రభుత్వం ఏకంగా రూ. 3,600 కోట్లను కేటాయించింది. గడచిన ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ దాదాపు రూ. 13,370 కోట్లు, కెనరా బ్యాంక్ రూ. 4,306 కోట్లు, యూనియన్ బ్యాంక్ రూ. 4,274 కోట్లు చొప్పున విద్యార్థులకు రుణాలుగా అందజేశాయి. ఈ నిర్ణయంతో లక్షలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్య సులభతరం కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story