Windfall Tax : దేశీయంగా చమురు లభ్యతను సురక్షితం చేయడానికి, ఆయిల్ రిఫైనరీ కంపెనీల మితిమీరిన లాభాలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 16 (ఈరోజు) నుంచే వర్తించేలా రాబోయే 15 రోజుల కాలానికి డీజిల్, విమాన ఇంధనం (ATF - ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్) ఎగుమతులపై విండ్‌ఫాల్ టాక్స్‌ను పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అంతర్జాతీయంగా ఎగుమతి అయ్యే పెట్రోల్ సుంకంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.

కొత్త పన్ను రేట్ల వివరాలు ఇవే

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. కొత్త పన్ను నిబంధనల ప్రకారం డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం రేటును లీటరుకు రూ.13.50 నుంచి రూ.14కి పెంచారు. అలాగే విమాన ఇంధనం ఎగుమతులపై ఈ పన్నును లీటరుకు రూ.9.50 నుంచి ఏకంగా రూ.12.50కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల విదేశాలకు ఇంధనాన్ని ఎగుమతి చేసే రిఫైనరీ కంపెనీలపై పన్ను భారం మరింత పెరగనుంది.

సామాన్యుడి పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం లేదు

ఈ విండ్‌ఫాల్ టాక్స్ పెంపు వల్ల సామాన్య వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం పడబోదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశీయంగా పెట్రోల్ బంకుల్లో విక్రయించే పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పులు ఉండవు. అలాగే విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్ పై లీటరుకు రూ.1.50గా ఉన్న పాత పన్ను రేటునే యథాతథంగా కొనసాగిస్తున్నారు. ఈ పన్ను కేవలం విదేశాలకు ఇంధనాన్ని ఎగుమతి చేసే పెద్ద కంపెనీలకు మాత్రమే వర్తిస్తుందని నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.

విండ్‌ఫాల్ టాక్స్ విధానం ఎందుకు అమల్లోకి వచ్చింది?

మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ భయాలు పెరిగిన నేపథ్యంలో.. ఈ ఏడాది మార్చి 26న కేంద్ర ప్రభుత్వం ఈ విండ్‌ఫాల్ టాక్స్ విధానాన్ని తిరిగి అమల్లోకి తెచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు, రిఫైనింగ్ మార్జిన్లలో వచ్చే మార్పులను బట్టి ప్రతి 15 రోజులకోసారి ప్రభుత్వం ఈ ఎగుమతి సుంకాలను సమీక్షిస్తూ, మారుస్తూ వస్తోంది. గత నెల మే 16న ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై కూడా ఈ ప్రత్యేక పన్నును అమలు చేయడం ప్రారంభించింది.

కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం

ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. ఇలాంటి సమయంలో భారతీయ రిఫైనరీ కంపెనీలు దేశీయ మార్కెట్లను పక్కనబెట్టి, ఎక్కువ లాభాల కోసం విదేశీ మార్కెట్లకు ఇంధనాన్ని భారీగా ఎగుమతి చేసే అవకాశం ఉంది. అలా జరగడం వల్ల భారతదేశంలో ఇంధన కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. దీన్ని నివారించి, దేశంలో చమురు ఉత్పత్తుల సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా చేయడమే ఈ విండ్‌ఫాల్ టాక్స్ ముఖ్య ఉద్దేశం. దేశీయ, విదేశీ మార్కెట్ల ధరల వ్యత్యాసాన్ని కంపెనీలు దుర్వినియోగం చేయకుండా ఈ పన్ను అడ్డుకుంటుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story