Gig Workers : మన దేశంలో స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగిన తర్వాత యాప్ ఆధారిత సేవల రంగం విపరీతంగా వృద్ధి చెందింది. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్, రాపిడో, బ్లింకిట్, జెప్టో వంటి ప్లాట్‌ఫామ్స్‌లో పార్ట్ టైమ్ లేదా ఫుల్ టైమ్ డెలివరీ బాయ్స్, డ్రైవర్లుగా పనిచేసే లక్షలాది మంది గిగ్ వర్కర్ల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వీరికి ఎలాంటి చట్టపరమైన రక్షణ గానీ, కంపెనీల నుంచి కనీస ప్రయోజనాలు గానీ ఉండేవి కావు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తూ, వీరందరికీ చట్టబద్ధమైన గుర్తింపుతో పాటు పెన్షన్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సామాజిక భద్రత సౌకర్యాలను కల్పించడానికి మోదీ సర్కార్ సరికొత్త అడుగులు వేస్తోంది.

కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా ఆదేశాల ప్రకారం.. అన్ని డిజిటల్ అగ్రిగేటర్ కంపెనీలు తమ పరిధిలో పనిచేస్తున్న గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల వివరాలను ప్రభుత్వ అధికారిక ఈ-శ్రమ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం జూన్ 21 వరకు గడువు విధించింది. కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ కింద కొత్త రూల్స్‌ను నోటిఫై చేసిన తర్వాత ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. కొత్త నిబంధనల ప్రకారం, ఏ కంపెనీలోనైనా గిగ్ వర్కర్ చేరిన 45 రోజులలోపు వారి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి కావడం చట్టపరంగా అనివార్యం.

కంపెనీల గుత్తాధిపత్యానికి పెనాల్టీల బ్రేక్

ప్రభుత్వం విధించిన జూన్ 21 డెడ్‌లైన్‌ను ఏ కంపెనీ అయినా ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తే, సోషల్ సెక్యూరిటీ కోడ్ చట్టం ప్రకారం సదరు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై భారీ పెనాల్టీలు, కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. కొత్త రూల్స్ ప్రకారం.. ఏ వర్కర్ అయినా ఒక సంవత్సరంలో కనీసం 90 రోజుల పాటు ఏదైనా ఒక నిర్దిష్ట అగ్రిగేటర్ సంస్థతో కలిసి పనిచేసినా, లేదా వేర్వేరు యాప్స్ ద్వారా మొత్తంగా 120 రోజులు సర్వీస్ అందించినా వారిని గిగ్ వర్కర్ గా గుర్తిస్తారు. అంతేకాకుండా, కంపెనీల్లో ప్రతిరోజూ కొత్తగా జాయిన్ అయ్యే లేదా పని మానేసే ఉద్యోగుల వివరాలను రియల్ టైమ్ బేసిస్‌లో ప్రభుత్వ సెంట్రల్ పోర్టల్‌కు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

ఈ భారీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వెనుక కేంద్ర ప్రభుత్వానికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉంది. డిజిటల్ రంగంలో ఉన్న కార్మికులందరి సమాచారంతో ఒక పెద్ద జాతీయ డేటాబేస్‌ను తయారు చేయడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ డేటా ఆధారంగా గిగ్ వర్కర్లందరికీ ఒక యూనిక్ నేషనల్ ఐడీ కార్డును జారీ చేస్తారు. దీనివల్ల వర్కర్లు ఒక యాప్ నుంచి మరో యాప్‌నకు మారినా వారి సామాజిక భద్రతా ప్రయోజనాలకు ఎలాంటి నష్టం వాటిల్లదు. ఇప్పటివరకు పూర్తిగా అసంఘటిత రంగంగా ఉన్న ఈ వ్యవస్థకు కార్పొరేట్ తరహా లీగల్ గుర్తింపు లభించడమే కాకుండా.. భవిష్యత్తులో ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఉచిత లైఫ్ ఇన్సూరెన్స్, ఉచిత వైద్య సదుపాయాలు, వృద్ధాప్య పెన్షన్ పథకాలు నేరుగా వీరి అకౌంట్లలోకి చేరే అవకాశం కలుగుతుంది.

కార్మిక సంఘాల డిమాండ్.. ఇకనైనా ఆలస్యం వద్దు

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. గతంలో కూడా ప్రభుత్వం ఈ విధమైన డేటా షేరింగ్ కోసం కంపెనీలపై ఒత్తిడి తెచ్చినప్పటికీ, అగ్రిగేటర్ సంస్థల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ కో-ఫౌండర్ షేక్ సలావుద్దీన్ ఈ విషయమై స్పందిస్తూ.. పలు యాప్ సంస్థలు ప్రభుత్వ ఆదేశాలను గతంలో సీరియస్‌గా తీసుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు చట్టబద్ధమైన రూల్స్ వచ్చాయి కాబట్టి, కంపెనీలు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కష్టపడి పనిచేసే కార్మికులు తమ హక్కుల కోసం ఎల్లకాలం ఎదురుచూడలేరని, ఈసారైనా ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ సామాజిక భద్రత చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆయన కోరారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story