Elon Musk X Report : అడ్డగోలు పోస్టులు పెడితే ఊరుకోం..ఎక్స్ నివేదికపై విరుచుకుపడ్డ కేంద్రం
ఎక్స్ నివేదికపై విరుచుకుపడ్డ కేంద్రం

Elon Musk X Report : సోషల్ మీడియా దిగ్గజం X, భారత ప్రభుత్వం మధ్య అశ్లీల కంటెంట్ వివాదం ముదురుతోంది. ఎలోన్ మస్క్ నేతృత్వంలోని X సంస్థ తన వేదికపై ఉన్న అభ్యంతరకర కంటెంట్‌పై కేంద్రానికి ఒక నివేదిక సమర్పించింది. అయితే ఆ నివేదికలోని సమాధానాలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో మస్క్ కంపెనీపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఇటీవల కాలంలో X వేదికగా, ముఖ్యంగా ఆ సంస్థకు చెందిన Grok AI టూల్‌ను ఉపయోగించి మహిళలు, పిల్లల ఫోటోలను అశ్లీలంగా మారుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సీరియస్ అయిన కేంద్ర ప్రభుత్వం, జనవరి 2న ఒక లేఖ రాసి 72 గంటల్లో వివరణ ఇవ్వాలని కోరింది. దీనిపై ఎక్స్ స్పందిస్తూ.. తాము అశ్లీల కంటెంట్‌ను తొలగిస్తున్నామని, నిబంధనలు పాటిస్తున్నామని నివేదిక ఇచ్చింది. కానీ, ఆ నివేదికలో స్పష్టత లేదని, ఐటీ చట్టాలను ఎలా అమలు చేస్తున్నారో సరిగ్గా వివరించలేదని ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఎలోన్ మస్క్ ప్రవేశపెట్టిన గ్రోక్ ఏఐ ద్వారా కొందరు వ్యక్తులు అనుమతి లేకుండా ఇతరుల ఫోటోలను డీప్ ఫేక్ టెక్నాలజీతో అశ్లీలంగా మారుస్తున్నారు. ఇది ఐటీ చట్టం 2000, 2021 నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వం హెచ్చరించింది. కేవలం భారత్ లోనే కాకుండా బ్రిటన్, యూరప్ దేశాల్లో కూడా దీనిపై విచారణ జరుగుతోంది. Grok AI ద్వారా క్రియేట్ అయ్యే అశ్లీల కంటెంట్‌ను ఎలా అడ్డుకుంటారో చెప్పాలని కేంద్రం డిమాండ్ చేస్తోంది.
వివాదం ముదురుతున్న తరుణంలో X సంస్థ ఒక ప్రకటన చేసింది. ఎవరైనా Grok AI ని తప్పుగా ఉపయోగిస్తే లేదా అశ్లీల కంటెంట్‌ను పోస్ట్ చేస్తే వారి అకౌంట్లను శాశ్వతంగా బ్యాన్ చేస్తామని తెలిపింది. స్థానిక ప్రభుత్వాలకు, చట్టాలకు సహకరిస్తామని కూడా చెప్పింది. అయితే, ఇలాంటి కంటెంట్‌ను ముందే గుర్తించే వ్యవస్థ ఏది? అని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం అడిగిన మరిన్ని ప్రశ్నలకు ఎక్స్ నుంచి సరైన సమాధానం రాకపోతే, ఆ ప్లాట్‌ఫామ్‌కు ఉన్న సేఫ్ హార్బర్(థర్డ్ పార్టీ కంటెంట్ కి సంస్థ బాధ్యత వహించని సదుపాయం) రక్షణను ప్రభుత్వం తొలగించే అవకాశం ఉంది.
ఐటీ మంత్రిత్వ శాఖ ఇప్పుడు ఎక్స్ సంస్థ నుంచి మరిన్ని వివరాలను కోరనుంది. అవసరమైతే ఉన్నతాధికారులను పిలిపించి విచారించే అవకాశం కూడా ఉంది. సోషల్ మీడియాలో మహిళల గౌరవానికి భంగం కలిగించే ఏ కంటెంట్‌ను ఉపేక్షించేది లేదని కేంద్రం స్పష్టం చేస్తోంది. ఒకవేళ ఎక్స్ తన తీరు మార్చుకోకపోతే, భారీ జరిమానాలు లేదా భారత్ లో ఆ సర్వీసులపై ఆంక్షలు విధించే ప్రమాదం ఉంది.

