పోస్టాఫీసు పథకాల వడ్డీ రేట్లు ఇవే!

Govt Savings Schemes : కేంద్ర ప్రభుత్వం పొదుపు చేసుకునే సామాన్యులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. 2026 జనవరి నుంచి మార్చి వరకు ఉండే ఈ కొత్త త్రైమాసికానికి సంబంధించి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్కెట్‌లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, వరుసగా ఏడో సారి కూడా ప్రభుత్వం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకుండా పాత రేట్లనే కొనసాగించాలని నిర్ణయించింది. దీనివల్ల పోస్టాఫీసు, బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టే వారికి మునుపటి లాభాలే అందనున్నాయి.

సుకన్య సమృద్ధి యోజన : ప్రభుత్వ పథకాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన సుకన్య సమృద్ధి యోజన‎లో పెట్టుబడి పెట్టేవారికి ప్రభుత్వం 8.2 శాతం వడ్డీని యథావిధిగా కొనసాగిస్తోంది. ఆడపిల్లల భవిష్యత్తు కోసం దీర్ఘకాలికంగా డబ్బు దాచుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. అదేవిధంగా, రిటైర్డ్ వ్యక్తులకు అండగా నిలిచే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‎లో కూడా 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. సురక్షితమైన, స్థిరమైన నెలవారీ ఆదాయం కోరుకునే వృద్ధులకు ఇది ఎంతో మేలు చేకూరుస్తుంది.

కిసాన్ వికాస్ పత్ర: మీరు పెట్టిన పెట్టుబడి రెట్టింపు కావాలని కోరుకుంటే కిసాన్ వికాస్ పత్ర సరైన ఎంపిక. దీనిపై ప్రభుత్వం 7.5 శాతం వడ్డీని అందిస్తోంది. ప్రస్తుత లెక్కల ప్రకారం.. ఇందులో మీరు దాచుకున్న డబ్బు సుమారు 115 నెలల్లో (9 ఏళ్ల 7 నెలలు) డబుల్ అవుతుంది. అలాగే, మధ్యతరగతి ప్రజల ఫేవరెట్ పథకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పై వడ్డీ రేటు 7.1 శాతం వద్దే స్థిరంగా ఉంది. పన్ను ఆదా చేసుకుంటూ దీర్ఘకాలికంగా కోట్లు సంపాదించాలనుకునే వారికి పీపీఎఫ్ నేటికీ హాట్ ఫేవరెట్.

పోస్ట్ ఆఫీస్ ఇతర పథకాల వివరాలు: సురక్షితమైన పెట్టుబడి మార్గం అయిన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ పై 7.7 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక ప్రతి నెల ఆదాయం కావాలనుకునే వారి కోసం ఉన్న మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‎లో 7.4 శాతం రిటర్న్స్ అందుతాయి. మధ్యతరగతి గృహిణులు ఎక్కువగా ఇష్టపడే రికరింగ్ డిపాజిట్ (RD) పై 6.7 శాతం, సాధారణ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ పై 4 శాతం వడ్డీ అమల్లో ఉంటుంది. టైమ్ డిపాజిట్ల విషయానికి వస్తే.. ఏడాదికి 6.9%, రెండేళ్లకు 7.0%, మూడేళ్లకు 7.1%, ఐదేళ్ల కాలపరిమితికి 7.5% వడ్డీని ప్రభుత్వం ఖరారు చేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story