Export Duty : చమురు కంపెనీలకు కేంద్రం ఊరట.. డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతి సుంకాలు భారీగా తగ్గింపు
డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతి సుంకాలు భారీగా తగ్గింపు

Export Duty : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1, 2026 నుంచి అమల్లోకి వచ్చేలా డీజిల్, విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్ ఎగుమతులపై మాత్రం ఎలాంటి పన్ను విధించకుండా డ్యూటీ ఫ్రీని కొనసాగించింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా దేశీయంగా ఇంధన కొరత రాకుండా ఉండేందుకు గతంలో పెంచిన పన్నులను ఇప్పుడు కాస్త సడలించింది.
కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. డీజిల్ ఎగుమతులపై అదనంగా విధించే ప్రత్యేక పన్నును లీటరుకు రూ.55.5 నుంచి ఏకంగా రూ.23కు తగ్గించారు. అలాగే విమానాల్లో వాడే ఇంధనం (ATF)పై ఈ సుంకాన్ని రూ.42 నుంచి రూ.33కు కుదించారు. పెట్రోల్ ఎగుమతులపై మాత్రం పన్నును సున్నాగానే ఉంచారు. దేశీయంగా వాడే పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీలో ఎలాంటి మార్పులు చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి 15 రోజులకు ఒకసారి నిర్వహించే సమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు అమాంతం పెరిగాయి. యుద్ధానికి ముందు బ్యారెల్ ధర 73 డాలర్లు ఉండగా, అది 126 డాలర్లకు చేరింది. ఇలాంటి సమయంలో చమురు కంపెనీలు దేశీయంగా అమ్మకుండా, విదేశాలకు ఎగుమతి చేసి అధిక లాభాలు గడించాలని చూస్తాయి. దీనివల్ల మన దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా ఉండేందుకు ప్రభుత్వం విండ్‌ఫాల్ ట్యాక్స్ (అకస్మాత్తుగా వచ్చే లాభాలపై పన్ను) విధిస్తుంది.
గత మార్చి 26న ప్రభుత్వం డీజిల్‌పై రూ.21.50, ఏటీఎఫ్‌పై రూ.29.5 ఎగుమతి పన్ను విధించింది. అయితే ఏప్రిల్ 11న నిర్వహించిన సమీక్షలో వీటిని భారీగా పెంచింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులు కాస్త కుదుటపడుతుండటంతో, ఎగుమతిదారులకు వెసులుబాటు కల్పిస్తూ మళ్ళీ పన్నులను తగ్గించింది. దీనివల్ల చమురు కంపెనీల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. రాబోయే 15 రోజులకు డీజిల్ ఎగుమతిపై రోడ్, డెవలప్‌మెంట్ సెస్ కూడా సున్నాగా ఉంచడం విశేషం.
ఈ పన్ను తగ్గింపు అనేది కేవలం ఎగుమతులపై మాత్రమే. కాబట్టి పెట్రోల్ బంకుల్లో మనకు లభించే ఇంధన ధరల్లో తక్షణమే మార్పులు ఉండకపోవచ్చు. అయితే అంతర్జాతీయంగా ధరలు తగ్గితే, భవిష్యత్తులో దేశీయంగా కూడా రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తగ్గితేనే చమురు ధరలు పూర్తిస్థాయిలో నియంత్రణలోకి వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

