ఎగుమతి, దిగుమతులపై వారానికోసారి నిఘా.. గ్లోబల్ టెన్షన్లపై వాణిజ్య శాఖ ఫోకస్

Commerce Ministry : గ్లోబల్ మార్కెట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు భారత వాణిజ్యంపై ప్రభావం చూపకుండా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎగుమతి, దిగుమతులలో వస్తున్న మార్పులను, సరఫరా గొలుసులో తలెత్తుతున్న ఆటంకాలను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక వీక్లీ మానిటరింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడం, ప్యాకేజింగ్ మెటీరియల్ కొరతపై ప్రభుత్వం దృష్టి సారించింది.

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల భారత సరఫరా గొలుసు దెబ్బతినకుండా ఉండేందుకు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకువస్తోంది. దీని ద్వారా ప్రతి వారం ఎగుమతి-దిగుమతుల ధోరణులను, వివిధ రంగాల్లో ఎదురవుతున్న సమస్యలను పర్యవేక్షిస్తారు. వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో, అంతర్జాతీయ జలాల్లో ఓడల రాకపోకలకు ఎదురవుతున్న అడ్డంకులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నిఘా వ్యవస్థ ద్వారా ఏ రంగానికైనా ముప్పు పొంచి ఉంటే వెంటనే చర్యలు తీసుకునే వీలుంటుంది.

ప్రస్తుత గ్లోబల్ పరిస్థితుల వల్ల పాలిమర్లు, రెజిన్లు వంటి పెట్రోకెమికల్ ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉందని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్యాకేజింగ్ ఖర్చులు పెరిగి, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పై తీవ్ర ప్రభావం పడుతోంది. గార్మెంట్స్, లెదర్, టెలికాం, మెడికల్ ఎక్విప్‌మెంట్ వంటి రంగాలు లాజిస్టిక్స్ సమస్యల వల్ల ఇబ్బందులు పడుతున్నాయని గుర్తించారు. వీటికి సంబంధించి దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని, దిగుమతులపై ఆధారపడటం తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.

సమావేశం అనంతరం ఓడరేవుల మంత్రిత్వ శాఖ అన్ని పోర్టులు, టెర్మినల్ ఆపరేటర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పారదర్శకతను పెంచడానికి కార్గో, ఓడలకు ఇచ్చే రాయితీలను బహిరంగపరచాలని, బంకర్ ఇంధనం అందుబాటులో ఉంచాలని సూచించింది. అలాగే, పోర్టుల్లో నిలిచిపోయిన కంటైనర్లను వెంటనే క్లియర్ చేయడం ద్వారా మొత్తం వ్యవస్థ పనితీరును మెరుగుపరచాలని ఆదేశించింది. ఎగుమతిదారులకు నగదు లభ్యత పెంచేందుకు జీఎస్టీ రీఫండ్‌లను సత్వరమే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని స్టేక్ హోల్డర్లు కోరారు.

పశ్చిమ ఆసియాతో భారత్‌కు ఉన్న వాణిజ్య బంధం చాలా బలమైనది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాంతంతో మన ద్వైపాక్షిక వాణిజ్యం 178 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో 56.87 బిలియన్ డాలర్ల ఎగుమతులు, 121.67 బిలియన్ డాలర్ల దిగుమతులు ఉన్నాయి. గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఈ భారీ వాణిజ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున, ఎల్ఎన్జీ, హీలియం వంటి కీలక వనరుల నిరంతర సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story