GST 2.0 : దేశంలో పన్నుల వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ సెప్టెంబర్ 22, 2025న అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 సామాన్య వినియోగదారుడికి తీపి కబురు అందించినా, వ్యాపార వర్గాలకు మాత్రం నిద్రలేకుండా చేస్తోంది. వస్తువుల ధరలు తగ్గించి మార్కెట్‌లో డిమాండ్ పెంచడమే లక్ష్యంగా తెచ్చిన ఈ మార్పులు, ఇప్పుడు ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ (తలకిందలైన పన్నుల విధానం) అనే కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయి. ప్రభుత్వం 12 శాతం స్లాబ్‌ను రద్దు చేసి, చాలా వస్తువులను 5 శాతం పరిధిలోకి తెచ్చింది కానీ, వాటి తయారీకి వాడే ముడి సరుకులపై పన్ను మాత్రం తగ్గించకపోవడమే ఈ సమస్యకు మూలం.

ఏమిటీ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్?

వ్యాపార భాషలో చెప్పాలంటే.. ఒక వస్తువును తయారు చేయడానికి కొనే ముడి సరుకులపై ఎక్కువ పన్ను చెల్లించి, తయారైన వస్తువును తక్కువ పన్నుతో అమ్మడమే ఈ సమస్య. ఉదాహరణకు ఒక సైకిల్ తయారీదారుని తీసుకుందాం. అతను సైకిల్ బాడీ కోసం స్టీల్, టైర్ల కోసం రబ్బరు కొనేటప్పుడు 18 శాతం జీఎస్టీ చెల్లిస్తాడు. కానీ అదే సైకిల్‌ను మార్కెట్‌లో అమ్మేటప్పుడు ప్రభుత్వం కేవలం 5 శాతం పన్ను మాత్రమే వసూలు చేయమంటుంది. దీనివల్ల వ్యాపారి ముందుగానే తన జేబులో నుంచి ఎక్కువ పన్ను చెల్లించినట్లు అవుతుంది. ఈ అదనపు పన్నును ఇన్పుట్ టాక్స్ క్రెడిట్(ITC) రూపంలో ప్రభుత్వం నుంచి తిరిగి పొందాల్సి ఉంటుంది.

అన్ని రంగాల్లోనూ ఇదే గందరగోళం

కేవలం సైకిల్ పరిశ్రమ మాత్రమే కాదు.. టెక్స్‌టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రిక్ వాహనాలు ఇలా ప్రతి రంగం ఈ సమస్యతో సతమతమవుతోంది. ప్యాక్ చేసిన తినుబండారాలపై 5 శాతం పన్ను ఉంటే, వాటి ప్యాకేజింగ్ కోసం వాడే అల్యూమినియం ఫాయిల్, ప్రకటనల కోసం చేసే ఖర్చులపై మాత్రం 18 శాతం పన్ను కట్టాల్సి వస్తోంది. మెడికల్ రంగంలో వ్యాక్సిన్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. సేవల రంగం, క్యాపిటల్ గూడ్స్ వాటా ఎక్కువగా ఉన్న కంపెనీలకు ఈ పన్నుల వ్యత్యాసం భారంగా మారి, లాభాలను హరించివేస్తోంది.

చిన్న వ్యాపారుల నగదు కష్టాలు

ఈ తలకిందులైన పన్ను విధానం వల్ల దేశంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమల పరిస్థితి దారుణంగా తయారైంది. వారి దగ్గర ఉండాల్సిన పని పెట్టుబడి అంతా పన్నుల రూపంలో ప్రభుత్వ వద్దే ఆగిపోతోంది. సిద్ధాంతపరంగా ఈ రిఫండ్ వస్తుందని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం నిబంధనలు, కాగితపు పనులు, రాష్ట్రాల ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ డబ్బు రావడానికి నెలల సమయం పడుతోంది. ఎటువంటి వడ్డీ లేకుండా వ్యాపారుల సొమ్ము ప్రభుత్వ ఖజానాలో చిక్కుకుపోవడంతో, రోజువారీ ఖర్చులకు, ముడిసరుకు కొనడానికి కూడా వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు.

సిద్ధాంతం తప్పిన జీఎస్టీ 2.0

సెప్టెంబర్ 2025లో జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాల్లో ప్రధానంగా ధరలు తగ్గించి వినియోగాన్ని పెంచడంపైనే దృష్టి పెట్టారు. సాధారణంగా పన్ను రేట్లు మార్చేటప్పుడు ముడిసరుకు, తయారైన వస్తువు మధ్య పన్ను వ్యత్యాసం లేకుండా చూస్తారు. కానీ జీఎస్టీ 2.0లో ఈ ప్రాథమిక సూత్రాన్ని విస్మరించినట్లు కనిపిస్తోంది. పాత పద్ధతిలో ఈ లోపాలను ముందే గుర్తించేవారు. కానీ ఇప్పుడు వినియోగదారులను ఖుషీ చేసే క్రమంలో తయారీదారులను కష్టాల్లో నెట్టేసినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ చిక్కుముడిని విప్పి, వ్యాపారుల పెట్టుబడిని త్వరగా విడుదల చేయడం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు.

PolitEnt Media

PolitEnt Media

Next Story