GST Collections : జీఎస్టీ వసూళ్లలో మరో రికార్డు.. అక్టోబర్లో ప్రభుత్వ ఖజానాకు డబ్బుల వరద
GST Collections : భారతదేశంలో జీఎస్టీ వసూళ్లు మరోసారి మెరుగైన వృద్ధిని నమోదు చేశాయి. గత అక్టోబర్ నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1,95,936 కోట్లుగా నమోదయ్యాయి.

GST Collections : భారతదేశంలో జీఎస్టీ వసూళ్లు మరోసారి మెరుగైన వృద్ధిని నమోదు చేశాయి. గత అక్టోబర్ నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1,95,936 కోట్లుగా నమోదయ్యాయి. సెప్టెంబర్ నెలతో పోలిస్తే ఇది 4.6 శాతం పెరుగుదల. అయితే, ఈసారి జీఎస్టీ రీఫండ్‌లు కూడా భారీగా పెరిగాయి. గత నెలతో పోలిస్తే రీఫండ్‌లు ఏకంగా 39.6 శాతం పెరిగి రూ.26,934 కోట్లకు చేరాయి. అయినప్పటికీ, దేశీయంగా వినియోగం పెరగడం, పండుగల సీజన్‌లో అధిక డిమాండ్, ఇటీవలి జీఎస్టీ రేట్ల తగ్గింపు వంటి సానుకూల అంశాల కారణంగా మొత్తం జీఎస్టీ వసూళ్లు పెరిగాయని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు.
గత అక్టోబర్ నెలలో భారత ప్రభుత్వం జీఎస్టీ ద్వారా మెరుగైన రాబడిని సాధించింది. అక్టోబర్ నెలలో మొత్తం రూ.1,95,936 కోట్ల స్థూల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. సెప్టెంబర్ నెలలో నమోదైన రూ.1,87,346 కోట్లతో పోలిస్తే ఇది 4.6 శాతం ఎక్కువ. దేశీయంగా వసూలైన ఆదాయం 2 శాతం పెరిగింది. అయితే, దిగుమతుల ద్వారా వచ్చిన పన్ను ఆదాయం ఏకంగా 12.84 శాతం పెరగడం గమనార్హం. మొత్తం జీఎస్టీ వసూళ్లు పెరిగినప్పటికీ, ఈసారి రీఫండ్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నెలలో రీఫండ్‌లు రూ.26,934 కోట్లుగా ఉన్నాయి. ఇది గత నెలతో పోలిస్తే 39.6 శాతం పెరిగింది.
స్థూల వసూళ్ల నుంచి రీఫండ్‌లు తీసివేసిన తర్వాత ప్రభుత్వానికి వచ్చిన నికర జీఎస్టీ ఆదాయం రూ.1.69 లక్షల కోట్లు. రీఫండ్‌లు పెరగడం కారణంగా నికర ఆదాయ వృద్ధి మాత్రం కేవలం 0.6 శాతం మాత్రమే నమోదైంది. దేశీయంగా రూ.1.45 లక్షల కోట్లు, దిగుమతులపై రూ.50,884 కోట్లు వసూలయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో (ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు) జీఎస్టీ వసూళ్లు స్థిరమైన వృద్ధిని కనబరిచాయి. ఈ ఏడు నెలల కాలంలో మొత్తం జీఎస్టీ ఆదాయం రూ.13.89 లక్షల కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.12.74 లక్షల కోట్ల ఆదాయంతో పోలిస్తే ఈసారి 9 శాతం వృద్ధి నమోదైంది. జీఎస్టీ వసూళ్ల పెరుగుదలకు అనేక సానుకూల అంశాలు దోహదపడ్డాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ రేట్లను తగ్గించడం వల్ల వస్తువుల అమ్మకాలు, వినియోగం పెరిగి మొత్తం లావాదేవీలు పెరిగాయని కేపీఎంజీ పరోక్ష పన్నుల విభాగం అధిపతి అభిషేక్ జైన్ తెలిపారు. పండుగ సీజన్ కారణంగా వినియోగం, వస్తువులకు డిమాండ్ పెరగడం కూడా ప్రధాన కారణంగా చెప్పవచ్చు. పన్ను విధానంలో సంస్కరణల కారణంగా వినియోగం, పన్నుల అమలు రెండూ సరైన దిశలో పయనిస్తున్నాయని డెలాయిట్ ఇండియా పార్టనర్ మహేష్ జైసింగ్ పేర్కొన్నారు.

