GST : సామాన్యుడికి గుడ్ న్యూస్..ప్యూరిఫైయర్లపై జీఎస్టీ కోత..భారీగా తగ్గనున్న ధరలు
ప్యూరిఫైయర్లపై జీఎస్టీ కోత..భారీగా తగ్గనున్న ధరలు

GST : కాలుష్యం కోరల్లో చిక్కుకున్న సామాన్యుడికి త్వరలోనే ఊరట లభించనుంది. స్వచ్ఛమైన గాలి, శుభ్రమైన నీరు అందించే ఎయిర్ ప్యూరిఫైయర్లు, వాటర్ ప్యూరిఫైయర్లు త్వరలోనే చౌకగా మారబోతున్నాయి. వీటిపై విధిస్తున్న జీఎస్టీని భారీగా తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఎయిర్, వాటర్ ప్యూరిఫైయర్లపై ప్రభుత్వం 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది. అంటే వీటిని ప్రభుత్వం లగ్జరీ వస్తువుల జాబితాలో చూస్తోంది. అయితే దేశవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా, వీటిని విలాసవంతమైన వస్తువుల నుంచి తప్పించి అవసరమైన వస్తువుల జాబితాలోకి చేర్చాలని డిమాండ్ వస్తోంది. జీఎస్టీ కౌన్సిల్ ఈ పన్నును 18 శాతం నుంచి నేరుగా 5 శాతానికి తగ్గించే యోచనలో ఉంది. ఇదే జరిగితే మార్కెట్లో వీటి ధరలు 10 నుండి 15 శాతం వరకు తగ్గుతాయి. ఫలితంగా మధ్యతరగతి, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు కూడా వీటిని కొనుగోలు చేయగలుగుతాయి.
వాయు కాలుష్యంతో అల్లాడుతున్న ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిస్థితులను గమనించిన ఢిల్లీ హైకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకుంది. ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీని తగ్గించడం లేదా పూర్తిగా తొలగించడంపై వెంటనే చర్చించాలని కేంద్రానికి సూచించింది. కాలుష్యం కారణంగా ప్రజారోగ్యం దెబ్బతింటుంటే, క్లీన్ ఎయిర్ కోసం ప్రయత్నించే పౌరులపై 18 శాతం పన్ను వేయడం సరికాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. సాధ్యమైనంత త్వరగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
కేవలం కోర్టులే కాకుండా రాజకీయ నేతలు, పార్లమెంటరీ కమిటీలు కూడా ప్యూరిఫైయర్లపై పన్ను తగ్గించాలని కోరుతున్నాయి. స్వచ్ఛమైన గాలి, నీరు పొందడం పౌరుల ప్రాథమిక హక్కు అని, వాటిని అందించే యంత్రాలపై భారీ పన్నులు వేయడం శిక్ష వేయడమేనని పార్లమెంటరీ స్థాయి సంఘం తన నివేదికలో స్పష్టం చేసింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు కూడా వీటిపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రుల ఆమోదం లభిస్తే, రాబోయే రోజుల్లో ప్యూరిఫైయర్ల ధరలు భారీగా తగ్గి సామాన్యులకు ఊరట లభించనుంది.

