జీఎస్టీ సంస్కరణలు: నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman: దేశంలోని 140 కోట్ల మందికి వర్తించే జీఎస్టీపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయాలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయని ఆమె పేర్కొన్నారు. విశాఖపట్నంలోని మధురవాడలో జీఎస్టీ సంస్కరణలపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

జీఎస్టీ వల్ల అనేక రంగాల్లో ప్రయోజనాలు చేకూరాయని, నాలుగు శ్లాబ్‌ల నుంచి రెండు శ్లాబ్‌లకు తగ్గించినట్లు ఆమె వివరించారు. 12 శాతం శ్లాబ్‌లో ఉన్న 99 శాతం వస్తువులను 5 శాతం శ్లాబ్‌లోకి, 28 శాతం శ్లాబ్‌లో ఉన్న సిమెంట్‌తో సహా 90 శాతం వస్తువులను 18 శాతం శ్లాబ్‌లోకి తెచ్చినట్లు తెలిపారు. 2017కు ముందు 17 రకాల పన్నులు, 8 సెస్సులతో వస్తువుల ధరలు రాష్ట్రాల వారీగా మారేవని, జీఎస్టీ ద్వారా దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని తీసుకొచ్చామని ఆమె చెప్పారు.

2017-18 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా రూ.7.19 లక్షల కోట్ల ఆదాయం సమకూరగా, 2024-25లో ఇది రూ.22.08 లక్షల కోట్లకు చేరిందని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ప్రజలపై భారం తగ్గించేందుకు పాలు, పెరుగు వంటి నిత్యావసర వస్తువులను 5 శాతం నుంచి సున్నా శాతం శ్లాబ్‌లోకి తీసుకొచ్చామన్నారు. కారు, ఫ్రిజ్‌, ఏసీలపై పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించామని, మహిళల ఆరోగ్యం కోసం శానిటరీ న్యాప్‌కిన్స్‌పై పన్నును సున్నా చేసినట్లు తెలిపారు. గతంలో 65 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉండగా, గత 8 ఏళ్లలో ఈ సంఖ్య 1.51 కోట్లకు పెరిగిందని ఆమె పేర్కొన్నారు. మధ్యతరగతి వర్గానికి ఉపశమనం కల్పించేలా, ఆత్మనిర్భర్‌ భారత్‌కు ఊతమిచ్చేలా జీఎస్టీ సంస్కరణలు చేపట్టినట్లు ఆమె వివరించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story