GST 2.0 : జీఎస్టీ సంస్కరణల ఫస్ట్ డే-ఫస్ట్ షో అదిరింది.. టీవీ-ఏసీల అమ్మకాలు రెట్టింపు!
టీవీ-ఏసీల అమ్మకాలు రెట్టింపు!

GST 2.0 : జిఎస్‌టి రేట్లు తగ్గడంతో మార్కెట్ ఊపందుకుంది. ఇది ప్రభుత్వం విడుదల చేసిన ఒక బ్లాక్‌బస్టర్ సినిమా లాంటిదని చెప్పొచ్చు. కార్ల నుంచి మొదలుకుని టీవీలు, ఏసీలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అమ్మకాలు భారీగా పెరిగాయి. నవరాత్రుల మొదటి రోజే ఈ జిఎస్‌టి రిఫార్మ్స్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. అసలు మార్కెట్లో ఏ ఏ వస్తువుల ధరలు ఎంత తగ్గాయి? అమ్మకాలు ఎలా పెరిగాయో చూద్దాం.
టీవీ, ఏసీల అమ్మకాలు రెట్టింపు
ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జిఎస్‌టి రేట్ల తగ్గింపు ప్రజలను, ముఖ్యంగా వినియోగదారులను ఎంతగానో ఆకర్షించింది. కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన మొదటి రోజే మార్కెట్‌లో ఈ మార్పు ప్రభావం స్పష్టంగా కనిపించింది. పండుగ సీజన్ ప్రారంభం కావడంతో పాటు, ధరలు తగ్గడంతో ప్రజలు ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు.
ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాల్లో భారీ పెరుగుదల
సోమవారం, జిఎస్‌టి రేట్లు తగ్గిన మొదటి రోజు, ఎయిర్ కండిషనర్లు (ఏసీలు),టెలివిజన్ సెట్‌ల అమ్మకాల్లో భారీగా పెరుగుదల నమోదైంది. రిటైలర్లు కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ప్రకటించడంతో వినియోగదారుల్లో ఉత్సాహం పెరిగింది.
దేశీయ ఎలక్ట్రానిక్స్ డీలర్లు చెబుతున్న ప్రకారం, ఏసీల అమ్మకాలు మొదటి రోజునే దాదాపు రెట్టింపయ్యాయి. ఇంతకుముందు ఏసీలపై 28 శాతం జిఎస్‌టి ఉండేది, ఇప్పుడు అది 18 శాతానికి తగ్గింది. హయ్యర్ ఇండియా ఛైర్మన్ ఎన్.ఎస్.సతీష్ మాట్లాడుతూ, "మా డీలర్లలో సాయంత్రం 5 గంటల వరకు సాధారణ సోమవారాలతో పోలిస్తే దాదాపు రెట్టింపు అమ్మకాలు నమోదయ్యాయి. సాయంత్రం మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాం" అని చెప్పారు. బ్లూ స్టార్ మేనేజింగ్ డైరెక్టర్ బి.త్యాగరాజన్ కూడా మార్కెట్ స్పందన ప్రోత్సాహకరంగా ఉందని పేర్కొన్నారు.
థామ్సన్, కోడక్ వంటి బ్రాండ్‌ల టీవీలను తయారు చేసే సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (SPPL) సీఈఓ అవ్నీత్ సింగ్ మార్వాహ్ మాట్లాడుతూ.. మొదటి రోజు అమ్మకాల్లో 30 నుంచి 35 శాతం పెరుగుదల కనిపించిందని తెలిపారు. ఈ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా టీవీలను విక్రయిస్తుంది.
దేశవ్యాప్తంగా వినియోగాన్ని పెంచడానికి జిఎస్‌టి కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. పాత నాలుగు స్లాబ్‌ల (5%, 12%, 18%, 28%) జిఎస్‌టి పన్ను విధానాన్ని ఇప్పుడు రెండు స్లాబ్‌లకు (5%, 18%) తగ్గించారు. ఈ కొత్త విధానం అమలులోకి రావడంతో రోజువారీ అవసరాలైన ఆహార పదార్థాలు, ప్రసాధన సామాగ్రి నుంచి టీవీలు, ఏసీల వరకు చాలా వస్తువుల ధరలు తగ్గాయి. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో ఈ అమ్మకాల పెరుగుదల మరింత వేగవంతమైంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాబోయే రోజుల్లో ముఖ్యంగా పండుగల సీజన్‌లో ఈ అమ్మకాల్లో మరింత పెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు.
