Haldiram : హల్దీరామ్ వివాదం ముగిసినట్టేనా? రూ.85 వేల కోట్ల డీల్‌కు సీసీఐ గ్రీన్ సిగ్నల్!
రూ.85 వేల కోట్ల డీల్‌కు సీసీఐ గ్రీన్ సిగ్నల్!

Haldiram : దేశంలోనే అతిపెద్ద స్నాక్స్ తయారు చేసే కంపెనీ అయిన హల్దీరామ్ స్నాక్స్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉన్న వివాదం ఇప్పుడు సమసిపోతున్నట్లు కనిపిస్తోంది. జూన్ 24, 2025 మంగళవారం CCI ఒక కీలక నిర్ణయం తీసుకుంది. హల్దీరామ్ స్నాక్స్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కొన్ని ఈక్విటీ షేర్ క్యాపిటల్‌ను ఆల్ఫా వేవ్ వెంచర్స్ II ఎల్‌పీ, ఆల్ఫా వేవ్ ఐహెచ్‌సీ సీఐ, ఎల్‌పీ కొనుగోలు చేయడానికి CCI ఆమోదం తెలిపింది.
గతంలో మార్చి 31, 2025న హల్దీరామ్ తన వాటాలను ఐహెచ్‌సీ, ఆల్ఫా వేవ్ గ్లోబల్ కు విక్రయించినట్లు ధృవీకరించింది. అంతకు కొద్ది రోజుల ముందు, సింగపూర్‌కు చెందిన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ టెమాసెక్ హల్దీరామ్‌లో చిన్న వాటా కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఈ వరుస డీల్స్‌తో హల్దీరామ్ బ్రాండ్‌లో కొత్త పెట్టుబడులు వస్తున్నాయి.
భారతదేశంలో ప్రధాన స్నాక్ అండ్ ఫుడ్ బ్రాండ్ అయిన హల్దీరామ్, టెమాసెక్ భాగస్వామ్యం తర్వాత ఇప్పుడు రెండు కొత్త పెట్టుబడిదారులు - ఐహెచ్‌సీ, ఆల్ఫా వేవ్ గ్లోబల్ లను ఆహ్వానిస్తోంది. వీరందరూ ప్రస్తుతం కొనసాగుతున్న తమ ఈక్విటీ రౌండ్‌లో భాగం అవుతారు. ఆల్ఫా వేవ్ గ్లోబల్ అనేది ఒక గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ. ఇది ప్రైవేట్ ఈక్విటీ, ప్రైవేట్ క్రెడిట్, పబ్లిక్ మార్కెట్స్ అనే మూడు ప్రధాన రంగాలలో పెట్టుబడులు పెడుతుంది. ఐహెచ్‌సీ అనేది యూఏఈ ఆధారిత సంస్థ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడి కంపెనీలలో ఒకటి.
హల్దీరామ్ తన స్నాక్స్ డివిజన్‌లో 6 శాతం వాటాను అబుదాబికి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ, న్యూయార్క్‌కు చెందిన ఆల్ఫా వేవ్ గ్లోబల్కు విక్రయించింది. ఈ డీల్ దాదాపు 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ.85,570 కోట్లు) అని అంచనా వేస్తున్నారు. అయితే, హల్దీరామ్ అధికారికంగా ఈ డీల్ మొత్తాన్ని ప్రకటించలేదు.
మార్చి 30న, సింగపూర్‌కు చెందిన సావరీన్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ టెమాసెక్, హల్దీరామ్ స్నాక్స్ డివిజన్‌లో 10శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8,555 కోట్లు) కు జరిగింది. టెమాసెక్, కంపెనీలోని ప్రస్తుత వాటాదారుల నుంచి 10శాతం వాటాను కొనుగోలు చేసిందని హల్దీరామ్ తెలిపింది.
హల్దీరామ్ గ్రూప్ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో స్నాక్స్, నమ్‌కీన్, స్వీట్లు, రెడీ-టు-ఈట్ ఫుడ్, ఫ్రోజెన్ ఫుడ్, బిస్కెట్లు, నాన్-కార్బోనేటెడ్ డ్రింక్స్, పాస్తా, అనేక ఇతర ఆహార ఉత్పత్తులు ఉన్నాయి. భారతదేశంలో హల్దీరామ్ వ్యాపారం రూ.63,000 కోట్లు విలువ చేస్తుంది. అంతేకాకుండా, అమెరికా నుంచి యూరప్ వరకు ఈ కంపెనీ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఈ కొత్త పెట్టుబడులతో హల్దీరామ్ మరింత విస్తరించే అవకాశం ఉంది.
