Haldiram: భారతీయ సంప్రదాయ స్వీట్లు, స్నాక్స్ రుచులతో ప్రతి ఇంటికీ చేరువైన ప్రముఖ సంస్థ హల్దీరామ్ స్నాక్స్ ఫుడ్ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. సంస్థ తన ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. 2027 సంవత్సరం చివరి నాటికి ఈ ఐపీవోను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పబ్లిక్ ఇష్యూ పరిమాణం సుమారు రూ.10,000 కోట్లు (దాదాపు 1 బిలియన్ డాలర్లు) ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ లిస్టింగ్ ద్వారా కంపెనీ మొత్తం విలువ రూ.లక్ష కోట్ల మార్కును దాటే అవకాశం కనిపిస్తోంది.

ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఆఫీస్‌గా ఈవై నియామకం

పబ్లిక్ లిస్టింగ్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, వేగంగా పూర్తి చేసేందుకు హల్దీరామ్ సంస్థ ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఈవైను ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఆఫీస్గా నియమించుకుంది. వివిధ విభాగాల మధ్య సమన్వయం సాధించడం, నిబంధనల నిర్వహణ వంటి కీలక బాధ్యతలను ఈవై పర్యవేక్షిస్తుంది. కంపెనీ వ్యాపార నిర్మాణం చాలా విస్తృతంగా ఉన్నందున ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 6 నుంచి 12 నెలల సమయం పట్టవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రతిపాదిత ఐపీవోలో ప్రస్తుత వాటాదారుల వాటాల విక్రయంతో పాటు కొత్త షేర్ల జారీ కూడా ఉండే అవకాశం ఉంది.

గ్లోబల్ ఇన్వెస్టర్ల భారీ పెట్టుబడులు

ఢిల్లీ కేంద్రంగా ఉన్న హల్దీరామ్ స్నాక్స్, నాగ్‌పూర్‌కు చెందిన హల్దీరామ్ ఫుడ్స్ ఇంటర్నేషనల్ విలీనం తర్వాత ఈ కొత్త సంస్థ రూపుదిద్దుకుంది. భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న ప్యాకేజ్డ్ స్నాక్స్ మార్కెట్‌పై నమ్మకంతో ప్రపంచ దిగ్గజ ఇన్వెస్టర్లు ఇందులో భారీగా పెట్టుబడులు పెట్టారు. సింగపూర్‌కు చెందిన టెమాసెక్, ఆల్ఫా వేవ్ గ్లోబల్, యూఏఈ ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీలతో పాటు అమెరికా సంస్థ ఎల్ క్యాటర్టన్ ఇందులో వాటాలు కొనుగోలు చేశాయి. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులను లక్ష్యంగా చేసుకుని అమెరికా, మధ్యప్రాచ్య దేశాలలో వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి ఈ నిధులు ఉపయోగపడుతున్నాయి.

కన్జ్యూమర్ రంగంలో మరో లిస్టింగ్

క్రిసిల్ రేటింగ్స్ నివేదిక ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో హల్దీరామ్ స్నాక్స్ ఫుడ్ రూ.7,762 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. సుమారు 19 శాతం ఆపరేటింగ్ మార్జిన్‌తో కంపెనీ బలమైన ఆర్థిక పనితీరును కనబరుస్తోంది. పంపిణీ వ్యవస్థను పెంచుకోవడం, కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ద్వారా రాబోయే రోజుల్లో రెండంకెల వృద్ధిని సాధిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు కన్జ్యూమర్ విభాగంలోనే కోకా-కోలా ఇండియా అనుబంధ సంస్థ హిందుస్థాన్ కోకా-కోలా హోల్డింగ్స్ కూడా 1 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో ఐపీవోకు వచ్చేందుకు సెబీ వద్ద పత్రాలు దాఖలు చేయడం విశేషం.

Next Story