Harmanpreet Kaur : దేశానికి తొలి వరల్డ్ కప్ అందించిన హర్మన్‌ప్రీత్ కౌర్ ఆస్తులెన్ని కోట్లో తెలుసా ?
Harmanpreet Kaur : భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించారు.

Harmanpreet Kaur : భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించారు. ఆమె కెప్టెన్సీలో టీమిండియా తొలిసారిగా ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ను గెలుచుకుని, దేశానికి గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చింది. 36 ఏళ్ల వయసులో కూడా తన ఫిట్‌నెస్, ఆటతీరుతో అదరగొడుతున్న హర్మన్‌ప్రీత్, మైదానం వెలుపల కూడా అంతే విజయవంతంగా రాణిస్తున్నారు. దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఈ కెప్టెన్ ఆస్తులు, ఆదాయం, బ్రాండ్ వాల్యూ వివరాలు తెలుసుకుందాం.
భారత మహిళా క్రికెట్‌లో అత్యంత టాలెంటెడ్ క్రీడాకారిణిగా ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ మైదానంలోనే కాక, ఆర్థికంగా కూడా ఉన్నత స్థానంలో ఉన్నారు. 2024-25 నాటి నివేదికల ప్రకారం హర్మన్‌ప్రీత్ కౌర్ నికర ఆస్తి సుమారు రూ.25 కోట్లుగా అంచనా వేశారు. ఈ ఆదాయం కేవలం క్రికెట్ మ్యాచ్‌ల నుంచి మాత్రమే కాకుండా, వివిధ ప్రకటనలు, బ్రాండ్ డీల్స్, లీగ్ క్రికెట్ నుంచి కూడా వస్తోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ ఆదాయంలో ఎక్కువ భాగం బీసీసీఐ కాంట్రాక్ట్, మహిళా ప్రీమియర్ లీగ్ నుంచి లభిస్తుంది.
ఆమె బీసీసీఐలో గ్రేడ్ ఎ విభాగపు క్రీడాకారిణి. ఈ కేటగిరీలో ఉన్నవారికి బీసీసీఐ ద్వారా ఏటా రూ.50 లక్షల ఫిక్స్‌డ్ జీతం లభిస్తుంది. ఫిక్స్‌డ్ జీతంతో పాటు ఆమె మ్యాచ్ ఫీజు ద్వారా కూడా సంపాదిస్తారు. టెస్ట్ మ్యాచ్ రూ.15 లక్షలు, వన్డే మ్యాచ్ రూ.6 లక్షలు, టీ20 మ్యాచ్ రూ.3 లక్షలు. ఆమె మహిళా ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ లీగ్‌లో ప్రతి సీజన్‌కు ఆమెకు రూ.1.80 కోట్ల జీతం లభిస్తుంది. అంతేకాక, విదేశీ లీగ్‌లలో ఆడటం ద్వారా కూడా ఆమె అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు.
హర్మన్‌ప్రీత్ కౌర్ బ్రాండ్ వాల్యూ చాలా ఎక్కువగా ఉండటం వలన, అనేక ప్రముఖ బ్రాండ్లు ఆమెను తమ అంబాసిడర్‌గా చేసుకున్నాయి. ఆమె HDFC లైఫ్, ప్యూమా, బూస్ట్, ఐటీసీ, టాటా సఫారీ, సియాట్, ఏషియన్ పెయింట్స్, జైపూర్ రగ్స్, ఒమాక్స్ ఎస్టేట్ వంటి అనేక ప్రఖ్యాత బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్నారు. ఒక్కో బ్రాండ్ డీల్ ద్వారా ఆమెకు సుమారు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు లభిస్తుంది. మొత్తం బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా ఆమె ఏటా రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఆమెకు ముంబై, పటియాలా రెండు చోట్లా లగ్జరీ ఇళ్లు ఉన్నాయి. పటియాలాలో ఉన్న ఆమె కుటుంబ బంగ్లా హర్మన్‌ప్రీత్ కౌర్ పటియాలా హౌస్ పేరుతో పాపులర్. 2013లో ఆమె ముంబైలో తన మొదటి ఇంటిని కొనుగోలు చేశారు. ఆమె వద్ద వింటేజ్ జీప్ నుండి హార్లే-డేవిడ్‌సన్ బైక్ వరకు పలు రకాల కార్లు, బైక్‌ల కలెక్షన్ కూడా ఉంది.

